జగత్తంతయూ నిండియుండినది జగదీశుడే "ఈశావాస్య మిదం సర్వం" అని ఉన్నది.
ఉన్నది ఒకటే అయినప్పటికినీ అనేకములుగా గోచరించునని కృష్ణపరమాత్మ చెప్పిన విషయములో మనమొక ఉదాహరణమును స్మరింతుము. ఒక సాయంకాల సమయమున మసక మసక గల మబ్బులలో మనము ప్రయాణముచేయు దారిలో మధ్య మడతలు మడతలుగా చుట్టుకొన్న త్రాడు పడి యుండును. అది నిజమునకు త్రాడు. త్రాడుగనే యున్ననూ ఆదారిని నడచు ప్రయాణీకులు ఒక్కొక్కరూ ఒక్కొక్క విధమైన వస్తువుగా భ్రాంతి పడుదురు. ఒకరు అది దండ అని తలంచి దాటిపోవుదురు. మరొకరు జలధార అని తలంచి తొలగి పోపుదురు. మరొకరు యేదో తీగ పడినదని తలంతురు. మరికొందరు పామేమో, అని దూరము దూరమే నిలచి పరీక్షించుచూ భయపడుదురు కదా!
అటులనే పరబ్రహ్మ, తన స్వరూపమునకు భంగము లేకనే, మాయ వలన నానా నామరూప ప్రపంచముగా భాసిస్తాడు. యెన్ని రకములుగా కనుపించిననూ, భావించిననూ, భ్రమించిననూ త్రాడు తప్ప అన్యమెట్లు కాదో, అటులనే భగవంతుని యెన్ని విధములుగా తలంచి, భావించి, భ్రమించిననూ, అతను బ్రహ్మము తప్ప అన్యము కాడు. పరమాత్ముడు అన్నింటికి ఆధారమైయున్నాడు. అతని ఆధారము లేక ప్రపంచము నిలువజాలదు. పూలమాలకు దారమెట్లు ఆధారమో, కట్టిన అంతస్థుల మేడకు పునాది ఎంత ఆధారమో, పరమాత్ముడు కూడనూ జీవులను పూలకూ ప్రకృతి సౌధమునకూ అంత ఆధారము. అయితే పూలమాలలోని పూలు, కట్టిన అంతస్థుల మేడ ముందు కనుపించును. కానీ, మాలలోని దారమూ, భూమిలోని పునాది ముందుగా కనుపించవు. కనుపించనంత మాత్రమున అవి లేవనరాదు. వాటి ఆధారమే లేకున్న పూలమాల లేదు. అంతస్తుల భవనము లేదు.
అయితే, వాటిని మనము చూడవలెనన్న కొంత విచారణ అవసరము. పరిశీలన చేయక అవి కనుపించవు. మాలలో పరిశీలించి చూచిన దారము, భూమిలో త్రవ్వి చూచిన పునాదులూ మనకు తెలియునే కాని కనిపించు పై అంతస్తులందూ, కట్టిన పూలమాల పైనా పునాదులు, దారము కనపించవు. కనుక కనుపించు ఆధేయాన్ని మనము ప్రధానముగా తీసుకొని అంతటితోనే ఉండి మన బుద్దిని పరిశీలనకు దింపుకున్న మనకు సత్యమే మాత్రము తెలియదు. కనుపించినదానికి కనుపించని ఆధారమొకటి వున్నదని, దీనిని తెలుసు కొనుటకు విచారణ సలుపుట చక్కని మార్గము. దీనిని అనుభవమునకు తెచ్చుకొనువారలకు అనేక విధముల చెప్పనవసరము లేదు. అంతే కాని పూసలైన జీవుల యోగ్యతా, అయోగ్యతా మనకు ప్రధానముకాదు. దీనికి ఆధారమైన సూత్రము బ్రహ్మము; అదే మనకు ప్రధానము. కేవలము మాల అందమునకు అయోగ్యమైన పూవులు కూడనూ చేర్చవచ్చును. అనగా జీవులు తామాసిక, రాజసిక సాత్వికములైన భేదములలో వున్ననూ పరమాత్మ వాటిని పాటించక అతీత స్థాయిలో సత్య నిత్య నిర్మలుడై నిండియుండును. దండకు దారము అండయై యుండును. దారము లేక పూవులు దండ కాలేవు అటులనే బ్రహ్మములేక జీవులను వేరు చేయ వీలులేదు, సాధ్యము కాదు.
(గీ.వా. పు.102/104)