మానవ జన్మము వుత్కృష్టమైనది. అట్టి పవిత్ర జన్మమును సార్థకము చేసుకొనుటకు, పవిత్ర ప్రవర్తనలు ప్రధానము. అట్టి ప్రవర్తనకు గుణము ముఖ్యము. మనుజుడు చనిపోయిన తరువాత కూడా వాని స్వభావములు నిలిచేయుండును. కాన నడవడిక ప్రతి మనుజునకూ నిజబలము. లోకమున చాలామంది జ్ఞానము శక్తి అందురు. కాదు. కాదు, గుణమే శక్తి, గుణములేక జ్ఞానము కుదరదు నిర్దుష్ట మయిన గుణము కలిగియుండవలెను. చూడు బుద్ధుడు, క్రైస్తు, శంకరా చార్యులు, వివేకానంద ఇట్టి గొప్ప గొప్ప మహనీయులూ, ఋషులు, మహాభక్తులు, వీరందరూ, ఇప్పటివరకూ మానవులకు జ్ఞాపకంగా వుండుటకు కారణమేమి; వారి స్వభావములు (గుణములు). గుణము యెదుట యే ధనమూ, విద్యా, పదవులూ, పనికిరావు.
గుణము సువాసన వెదజల్లు పుష్పము వంటిది. ఆ పుష్పము యెచ్చటనున్నమా దాని వాసనను మనము పొందుచున్నాము: లోకమున కొందరు కవులూ, మరికొందరు మహా కవులూ, ఇంకా యెందరో విద్వాంసులు, విజ్ఞాన శాస్త్రజ్ఞలూ కావచ్చు, కాని గుణము మాత్రము లేనిదే సంఘమున చోటేలేదు. ఇప్పటి సంఘములో చోటున్నవారి కెల్లరకునూ గుణమున్నదా? అని శంకింపవచ్చును.
అట్టి గుణములు, అట్టి సంఘములూ, నేను తెలుపునట్టి గుణములకు అన్వయించవు. అటువంటి గుణములయందు క్షణక్షణమునకూ, మార్పు వచ్చు చుండును. నిజమైన నిర్దుష్టగుణము జీవితాంతము వరకూ, యుగయుగముల వరకూ అమరత్వమై ఆత్మలో నుండును. ఇట్టి అమరత్వమును పొందునట్టి గుణములే దయా దాక్షిణ్యము, ప్రేమ, క్షమాపణ, నిజాయితీ, ఓర్పు, ఇవియే లోకమునకు గొప్ప యోగ్యత. కాని వేరు స్వభావములు ఈ స్థానమును పొందవు.
(ప్రే వా పు. 20/21)
అన్ని జ్ఞానములందు ఆత్మజ్ఞానము చాలా ప్రధానమైనది. దానిని పురస్కరించుకొనియే జ్ఞానములలో ఆత్మజ్ఞానము ఉత్తమము అన్నారు. అంతకంటే ఉత్తమమైన జ్ఞానము మరొకటి లేదు. లోకములో అనేక జ్ఞానములున్నవి. పదార్థజ్ఞానము. సాహిత్యజ్ఞానము. చిత్రజ్ఞానము, శిల్పజ్ఞానము. ఈ విధమైన జ్ఞానములన్నింటిలోకి ఆత్మజ్ఞానము ప్రధానమైనది. భౌతిక జ్ఞానములు కేవలము పాండిత్యమును అందించవచ్చు. భౌతిక జగత్తునందు గౌరవ మర్యాదలనందుకోవచ్చును. శృణ్యంతు విశ్వే అమృతస్య పుత్రః, ఇదియే ప్రధానమైన బిరుదు. నాయనా! ఇవన్నీ ప్రాకృతమైనవి. చలించేటటువంటివి. భ్రమించు నటువంటివి. నీవు అమృత పుత్రుడవు. కనుక చలించినది. భ్రమించినది. ఆత్మజ్ఞానము అని బోధిస్తూ వచ్చారు ప్రాచీనులు. అయితే దీనికి కొన్ని గుణములు అత్యవసరము.
సద్గుణంబులు, సత్యరతి విద్యకు అవసరమైన గుణములు, సర్వమును గౌరవించి, ప్రేమించి అనుభవించే మనస్సు మానవునియందు ఆవిర్భవించాలి. మానవుడు చదివిన విద్య సేవలో వినియోగించాలి. ‘సర్వే లోక హితే రతః ఇది ప్రధానమైన గుణము. ఇది మొదటి గుణము ‘సర్వేజ్ఞాన సంపన్నై రెండవ గుణము. మూడవది. సర్వే సముచితాగుణైః - సర్వమానవులను హితముగా ప్రేమించి, వారికి అవసరమైనప్పుడు ఆదుకొని వారిని సేవించటానికి ప్రయత్నించాలి. సర్వేజ్ఞాన సంపన్నః - విద్యార్థి సర్వజ్ఞానములందు ఉత్తీర్ణుడై ఉండాలి.
పదార్థజ్ఞానము, లౌకిక జ్ఞానము తీసుకుంటే అది కేవలం ఒక Subject మాత్రమే అవుతుంది. సర్వజ్ఞానములు హితముగా గుర్తించాలి. అనుభవించాలి. అతను సర్వజ్ఞానిగా రూపొందాలి. మిగిలిన Subjects అంతా ఏదో కించిత్ జ్ఞానమే కలిగి, తద్వారా ఈ జగత్తునందు పేరు ప్రఖ్యాతులకు పాటుపడుతుంటారు. (స్వామీ చేతిలో రూమాలు మూసివుంచి చూపించి) ఇది. ఏమని ప్రశ్నించినపుడు piece of cloth అంటారు. ఇది అల్ప విద్యల యొక్క ప్రమాణము. ఇదంతా విప్పి చూపినప్పుడు -కర్చీస్ అంటారు. ఇదియే పరిపూర్ణ జ్ఞానము. ఈ విధమైన పరిపూర్ణత్వ స్వరూపాన్ని నిరూపించిన జ్ఞానమే పరిపూర్ణ జ్ఞానము. ఇదియే ‘సర్వేజ్ఞాన సంపన్నః’. అన్ని విధములైన మార్గములందు గుర్తింపదగినది ఈ ఆధ్యాత్మిక జ్ఞానము. ‘సర్వే సముచితాగుణైః’ ఏమిటి గుణమంటే? గుణమనగా చక్కని నడత, త్రిగుణముల సమ్మిళితమైన పదము. పరుల యొక్క దోషమునుగానీ, పరుల తప్పులునుగాని గుర్తించక తనలోనున్న దివ్యభావములను ప్రకటింప చేయుటయే సరైన గుణము. విద్యార్థులకు అత్యవసరమైన గుణములు నేర్పునదే విద్య.
(భ. శ్రీ స. మ. పు. 179/180)
గుణములు మూడు రకములు ఒకటి సాత్వికము, రెండవది రాజసికము మూడవది తామసికము. ఇవి అంత:కరణముపై ఆధారపడి యుండును అంతఃకరణము ఆహారంపై ఆధారపడియున్నది. ఎట్టి గుణములు కలుగునో అట్లు ప్రవర్తించగలరు; కాన జన్మాంతర పుణ్య పాప సంస్కారములచే కొన్ని దైవ దానవ ప్రవర్తనలు కలిగియుండిననూ ఈ జన్మమున నైననూ అట్టి దానవ గుణములను బలపరచు ఆహార విషయములు అరికట్టి సాత్విక ఆహార విషయమును అభివృద్ధి పరచుకొన్న. తప్పక ఎట్టి దానవ సంస్కారములనైననూ కొంత మార్చుకొనవచ్చును.
(గీ.పు.229)
సత్వరజస్తమో గుణము లనబడు మూడు గుణములు అనేక పరిణామములు కలిగి ప్రకృతియందు వ్యక్తమగుచుండుటచే ప్రకృతికిట్టి మార్పులు కలుగుచున్నవి. ఆత్మ తేజోరూపమైన, చైతన్యము; దానికెట్టి గుణవికారములు లేవు: దానికెట్టి కళంకము రాదు. బుద్ధి, మనస్సు, శరీరము మొదలగునవన్నియు ప్రకృతి రూపము లగుటచే తమ యందలి గల గుణాధిక్యమును బట్టి వానిలో లోపములుండును.
సత్వగుణము నిశ్చల నిర్మల నిస్వార్థ తేజస్సు కాన ఈ గుణము కలవారికి యెట్టి కోరికయు లేక యుండును. కోరికలు లేనివాడే ఆత్మ జ్ఞానమునకు అర్హుడగును. రజోగుణము కలవాని కర్మలయందు కొంత కళంకము కలిగి పరోపకార బుద్ధి యుండియు అందులో ఫలమును కీర్తిని కోరి పరోపకారముతోపాటు స్వార్థమును సైతము అపేక్షించును; తమోగుణము కలవాని జ్ఞానము అంధకార మగుటచే యేది చేయతగినది యేది చేయతగనిది అని తెలుసుకొనలేడు. ఈ మూడు గుణములుండు వరకును నిర్వికారుడై గుణాతీతమైన మోక్షమును పొందలేడు. పురుషుడు ప్రకృతి యందున్న వాడు కనుక ఆ కారణమున ప్రకృతి సంబంధమగు గుణము లనుభవించుచుండి నటుల కనుపించుచున్న భ్రమను తొలగించు కొనుటే క్షేత్రవిచారణ అని తేలినది. సాధకునకు జ్ఞాన, జ్ణేయములు ప్రధానమైన అంశములు జ్ఞానికి సుగుణములే ప్రధానమనియు, దైవసాక్షాత్కారమునే చేయమనియు గ్రహించవలెను.
(గీ. పు. 204)
మొదట నీతినీ, నిష్టనూ ఉపదేశించక పూర్వమే బ్రహ్మము నుపదేశించుట, తైలము. వత్తి. ప్రమిదయు లేకనే దీపమును వెలిగించ ప్రయత్నించినట్లుండును. తైలాదులు మూడును సిద్ధముచేసిన తదుపరే బ్రహ్మజ్ఞానజ్యోతి వెలుగును. ఇచట సాధకులు అతిజాగ్రత్తగా విచారించవలెను. అనగా వత్తి, ప్రమిద చిన్నవై నూనె అధికమైననూ జ్యోతి వెలుగదు. ప్రమిద పెద్దదై నూనె ఎక్కువై, వత్తి చిన్నదయిననూ జ్యోతి వెలుగదు. వత్తి, ప్రమిద పెద్దవయిననూ నూనె తక్కువుండిన జ్యోతి వెలుగదు. ఒకదానికి తగినట్లు మరొకటి వుండినపుడే, సమాన ప్రమాణములు కలిగినప్పుడే స్వచ్చమైన వెలుతురును అనుభవించగలరు. అటులనే పైమూడు గుణములును సమస్థితియందుండిననే జ్ఞానజ్యోతిని పొందగలరు. దానిద్వారా మోక్షానందమును అనుభవించ గలరు. మోక్షప్రాప్తికి పై మూడు గుణములలో యేవక్కటి వుండినను ప్రకృతి జన్య దేహములో బంధించు మూడు గుణములు మూడు బంధనలే. ఏ బంధన వుండిననూ స్వతంత్రుడు కాలేడు. పశువునకు ముందు కాళ్లు రెండును వక పగ్గముతో కట్టివైచి వెనుకకాళ్ళను మరొక పగ్గములో కట్టివైచి, కొమ్ములను మెడను మరొక త్రాడుతో కట్టివైచిన ఆ పశువు యెట్లు స్వేచ్చగా వుండగలదు! అటులనే మానవునకు సత్వ, రజస్త మోగుణములు మూడు బంధించు త్రాళ్లవంటివి, సత్వగుణము కూడనూ త్రాడేః బంధనే. సత్వము బంగారు త్రాడు వంటిది; రజస్సు రాగిత్రాడు వంటిది; తమస్సు ఇనుపత్రాడు వంటిది.
తాళ్ళ విలువ హెచ్చు తగ్గులుండునే కానీ బంధన దృష్టిలో మూడును స్వేచ్చా రహిత సాధనములే.
(గీ పు. 205/206)
గుణము యొక్క స్వభావమును బట్టి రాక్షస సంతతికి చేర్చడమైనది. అసుర గుణములన్నిటికినీ కామము, క్రోధము, లోభము, అనెడి మూడు గుణములనూ హేతువైయున్నవి. ఆత్మ వినాశమునకునూ, అసుర వికాసమునకునూ మూలకారణము పై మూడు గుణములే, వాటిని జయించుటకు దైవగుణములైన వైరాగ్యము. శాంతము, త్యాగము అను ఉత్తమ గుణములే సరియైన సైనికులు, ఈ సైనికులను చక్కని శ్రద్ధతో బలపరచిన నిమిషమాత్రములో కామ క్రోధ లోభమును రాక్షస మూలాధార సారధులను నిర్మూలము చేతురు. దైవత్వమును నిర్మాణము గావింతురు. కామ, క్రోధ, లోభములనబడు అసురులలో ఏ ఒక్కడు మిగిలియుండిననూ, జీవితమునకు ప్రమాదమే కాన మూడింటిని మంట గలుపవలెను. అప్పుడే జీవితము ధన్యము కాగలదు.
(గీ. పు. 227)
గొప్ప చదువులుండి గుణము లేకున్నను
విలువయేమి వాని ఫలమేమి?
పంట పండని భూమి పది యెకరములే
కొంచెమైన చాలు మంచి భూమి
గొప్ప విద్యావంతులగుట కంటె గుణవంతుడు కావటం అత్యవసరము. ఈనాడు కలిమి, చెలిమి చేకూర్చు కొనుటకు తగినకృషి చేస్తున్నారేగాని గుణమును పోషించుటకు ఎవ్వరు ప్రయత్నం కావించటం లేదు. కలిమి, చెలిమి, బలములు కదలిపోయే మేఘములు, శాశ్వతముగా సత్యమార్గమును నిరూపించునది గుణము. గుణమునందు ఆదర్శవంతులు కావాలిగాని బలమునందు ధనమునందు ఆదర్శవంతులు కారాదు.
(బృత్ర, పు. 3)
గుణము లేని సుతులు గురిలేని విద్యలు నీతిలేని జాతి నిష్పలంబు! శాంతి లేని జీవి శశిలేని నిశిసుమీ! వినుము భారతీయ వీరసుతుడ!
(సా.పు.350)
మనదేహము తెలుపు, ఎరుపు, నలుపు, సత్వరజో, తమో గుణములతో కూడినది. ఈ గుణములు ఎట్టి కాలమునందుగాని, ఎట్టి స్థితియందుగాని ఈ దేహమును వదులునవి కావు. వీనియందు గుణాతీతమైన జీవతత్వము చెలగాడుచున్నది. జీవతత్వమునకు గుణములకు సంబంధముండదు. ఒక్కొక్క సమయమున సత్వగుణము ప్రకోపిస్తుంది. అట్టి సమయమున రజో, తమో గుణములు అడుగున పడి ఉంటాయి. మరొక్క సమయమున రజోగుణము ప్రకోపిస్తుంది. ఆ సమయమున సాత్వికము, తమోగుణము అడుగున పడి ఉంటాయి. సాత్విక సంగము కలిగినప్పుడు మానవత్వానికి సుఖప్రాప్తి చేకూరుతుంది.
(శ్రీ భ. ఉ..పు.10)
(చూ|| అవతారములు, అహందేహాస్మి, ఆరుగుణములు, ఈక్షతేర్నాశబ్దం,ఉపకారము, కర్తవ్య ధర్మము, కర్తవ్యము, కళలు, తమోగుణము, త్రిగుణములు, దుర్గుణములు, దైవగుణము, దైవము, నిష్పలము. నిష్కామకర్మ, పంచభూతములు. పాము. భ్రమ. మానవత్వము, రజోగుణము, విద్య, శోభ, సమత్వము సముద్రము, స్త్రీతత్వములు)