కౌరవులు పుణ్యకర్మఫలమగు భోగము లనుభవించుచు పాపకార్యములు చేసిరి, పాండవులు పాపకర్మఫలమగు కష్టములనుభవించుచు పుణ్యకార్యములు చేసిరి. ఈ రెండే వివేకము లేనివారికి వివేకము ఉన్నవారికి భేదము. కష్టములనుభవించు సమయమున పాపకర్మఫలమని తలంచి భగవంతునిపై విసుగు, కోపము రానీయక, ఆ కష్టములనే తలంచక పుణ్యకార్యములు, పరోపకారములు చేయుచు, భగవంతుని నామము తలంచుచుండిన అదియే వివేక గుణమునకు గుర్తు. అట్టివారు పాండవులను పోలినవారగుదురు. ఇట్టి పవిత్రభావమును బలపరచుటకు శాంతికి మించిన సహాయకారి వేరులేదు. పుణ్యఫలమని శుభములనుభవించుచు పాపకార్యములు తలపెట్టరాదు. అట్టి పుణ్యఫలమును అనుభవించు సమయమున మరింత పుణ్యకార్యములే చేయుచుండిన అట్టి వారి జన్మము భగవత్సాన్నిధ్యమున చేరగలదు. ఇది ఉత్తమ గుణ లక్షణము. ఇట్టి గుణములలో శాంతిని సాధించి మోక్షము పొందుటే జీవిత రహస్యము, ధర్మము. చూచినవి, విన్నవి, చదివినవి, నేర్చినవి. చేసినవి. చేయించినవి అన్నియు మరచి చిత్తశుద్ధుడై యుండుటే సమాధి అనియు, మోక్షమనియు అందురు.
(ప్ర. వా. పు. 35-36)