మానవ దేహం ఒక దేవాలయం వంటిది. ఇటువంటి దేహాన్ని మనం సద్వినియోగం పరచు కోవాలి. మానవుడు సద్గుణాలను కలిగియుండి, సదాచార సంపన్నుడై, దేహాన్ని సరియైన మార్గంలో ప్రవేశ పెట్టాలి. మానవ దేహమనే మందిరము యొక్క పవిత్రతను పురస్కరించుకొనియే దైవము యొక్క శక్తి సామర్థ్యాలు వ్యాప్తమౌతుంటాయి. దేహమును చూసిన తక్షణమే మనకు దేవుడు జ్ఞప్తికి రావాలి. దేవాలయము భగవంతుని జ్ఞప్తికి తెప్పిస్తుంది. అందు చేతనే మానవుడు దేవాలయాన్ని చూసి దానిలోపల ప్రవేశిస్తాడు గాని, దేవుని చూసి కాదు.
ఇట్టి పవిత్రమైన ప్రబోధలు సల్పే నిమిత్తమై ప్రాచీన భారతీయులు గ్రామ గ్రామములందు దేవాలయాలను చాలా ఎత్తైనవిగా కట్టేవారు. కాని, వారు వెఱ్ఱితనంతో ధనమును వ్యర్ధం చేసే నిమిత్తమై పెద్ద పెద్ద గోపురాలను కట్టించలేదు. గ్రామములో నున్న ప్రజలకు ఆ ఎత్తైన గుడి గోపురాలు కనిపించిన తక్షణమే తెలియకుండానే వారియందు దైవభావము ఆవిర్భవించేది. ఈ విధంగా మానవునియందు నిరంతరం దైవత్వాన్ని ఆవిర్భవింపజేసే తలంపులు ఉద్భవింపజేయాలనే ఉద్దేశ్యంతోనే ఆనాటివారు ఎత్తైన గోపురాలను నిర్మింప జేసారు.
(స.సా.న 91 పు. 304)