పరమాత్ముని పలుకులు ప్రతి ఒక్కటియు, ఆచరణ ప్రధానమైనవే గాని, కేవలము ప్రచారరూపము లైనవికావు. కృష్ణపరమాత్మ చెప్పిన ప్రతి పదము అర్జునుడు అనుభవమున నిరూపించినాడు. గీతలోని గురు, శిష్యులు ఆదర్శమూర్తులు, అధికారమూర్తి శిష్యుడు, అవతారమూర్తి గురువు, నరోత్తముడు శిష్యుడు, పురుషోత్తముడు గురువు, మహాత్ముడైన అర్జునుడు శిష్యుడు, పరమాత్ముడైన కృష్ణుడు గురువు, ధనుర్ధరుడైన వాడు శిష్యుడు.యోగీశ్వరుడైనవాడు కృష్ణుడు గురువు. ఇట్టి గురుశిష్యులు అయినప్పుడే బ్రహ్మ విద్య లభ్యమగును. "యథేచ్చేసి తథాకురు" అని గురువు అంటే? "కరిష్యే వచనం తవ” అని ఆహంకారమును వీడిన శిష్యుడు అంటాడు. అందుకే పరమ కృపాళువైన శ్రీకృష్ణభగవానుడు మానవ ప్రతినిధియగు అర్జునుని నిమిత్త మాత్రునిగా చేసి, పవిత్రమగు గీతామృతమును ప్రపంచమున కందించినాడు.
(శ్రీ భ.ఉ.పు.37)