ఉపనిషత్తులు, బ్రహ్మసూత్రములు, భగవద్గీత వేదాంత భాష్యములందు గల సమస్త బోధలకు కేవలము కీలకము ఒకే ఒకటి. అదే మనో నిగ్రహము. ఆ మనో నిగ్రహాని కివన్నీ కొమ్మలు రెమ్మలు. ఏదిచేసినా విశ్వాసంలో చేయాలి. గీతలోని 700 శ్లోకాలు కంఠస్థం చేసినంత మాత్రాన కంఠశోష తప్ప సుఖంలేదు. వేదం 80 పన్నాలు వల్లిస్తున్నాము. ఇది కూడా కసరత్తు మాత్రమే. ఉపనిషత్తులు కథలు చదివినట్లు చదువుతున్నాము. ఆ మహర్షి అట్లన్నాడు ఈ మహర్షి ఇట్లన్నాడు - అని కథల మాదిరి చదివితే ప్రయోజనం లేదు. విశ్వాసంతో చదివినప్పుడే కథలుగా కాకుండా వెతలను మార్చే స్థితులుగా బోధపడతాయి. కథలు మన వెతలను దూరం చేయలేవు. వెతలను దూరం చేయాలంటే పూర్తి శక్తి సామర్థ్యాలలో స్వయంకృషి సలుపాలి. కర్తవ్యాన్ని నిర్వర్తించాలి. కథలను కూడా తెలుసుకొని వాటిలోని పవిత్రతను తీసుకోవాలి.
(జ. పు. 207)
"గేయం గీతా నామ సహస్రం |
ధ్యేయం శ్రీపతి రూపమజస్రం!
నేయం సజ్జన సంగేచిత్తం |
ధ్యేయం దీనజనాయత విత్తం"
పవిత్రాత్మస్వరూపులగు విద్యార్థులారా :
ఈ శ్లోకము శంకరుల కడగొట్లు శిష్యుడు గీతను గురించియు, ధ్యానమును గురించియు, సహస్ర నామమును గురించి, త్యాగమును గురించి భజగోవింద తత్వమునందు యిమిడ్చి సంతృప్తినొందాడు. "గేయంగీత" అనగా గీతను పాడుట. గీతను పాడుటవలన ఫలితమేమి? మానవుడు విషయ భాగములకు గురి అగుటచేత అశాంతికి లోనవుతాడు. అట్లుకాక అశాంతినుంచి దూరము చేయుటకు గీతయే భగవానుని దూత, గీతయే జగదేకమాత, గీత సాధనకు పూత. గీత సంసారికొక ఈత, గీతయే మంత్రాలమూట, గీతయే వేదాంతపూట, గీతయే ఘనరాజ బాట, గీతయే పుష్పలబాట. యిదియే శ్రీసాయిమాట.
(భ.ప్ర.పు. 148)
గీతయొక్క భావార్ధము గ్రహించిన అది ఎంత గాంభీర్యమో తెలియును. ఉపనిషత్తులు గోవులుగను, అర్జునుడు దూడగను, పితుకు వాడు గోపాలుడుగను, మంచి బుద్ధి గల వారలు త్రాగు వారుగను పవిత్ర గీతామృతమే పాలుగానూ, రూపించిరి. ఆహా ఎట్టి అద్భుత రూప కల్పన!
(గీ పు. 1)