ఎవరైనా వచ్చి, "నీవు దొంగవురా" అంటే నీకు కోపం వస్తుంది. "నేనేమి దొంగతనం చేశాను? ఎందుకు నన్ను దొంగ అంటున్నావు?" అని వానితో పోట్లాడతావు. అదే పదములో భగవంతుని కీర్తిస్తూ, "బడా చిత్తా చోర బృందావన సంచార... " అనే పాట పాడితే అందరూ తన్మయులౌతారు. గానములో ఇంతటి మాధుర్యమున్నది. భగవంతుడు గావప్రియుడు. "హే రామా! ఎంతటి దయామయుడవయ్యా నీవు!" అని మాటలలో చెపితే మనసు కరుగదు. "ఓ రామా! నన్ను కాపాడు" అని పద్యంలో చెప్పినా అంత గొప్పగా ఉండదు. కాని, “రామా! నన్ను కాపాడు...." అని గానం చేస్తే హృదయాన్ని ఆకర్షిస్తుంది. కనుకనే, భజనకు ఇంతటి ప్రాధాన్యత ఇవ్వబడినది.
(స. సా. సె.96 పు. 242)