భగవంతుడు గానప్రియుడు. తుంబుర, నారదులు గానంచేస్తుంటే భగవంతుడు తన్మయుడవుతుంటాడు. గానములోనే భగవంతుడు లీనం అవుతాడు. అందువల్లనే సామూహిక భజన అనేది ఏర్పడి మీకు గానం చేయడం తెలియదని మీరు నిరుత్సాహ పడనక్కరలేదు. మీ హృదయంలోనే మీరు గానం చేసుకోండి. పదిమంది వినాలని శ్రుతిలయ రాగతాళములను చూసుకోవద్దు. గానములో నున్న ఆకర్షణ మరోక దానిలో కనిపించదు. అనేక మంది కవులు ఎన్నో పద్యాలు వ్రాస్తుంటారు. ఓరామా! నన్ను కాపాడు" అని పద్యంలో చెబుతుంటాడు. మరి కొందరు వచనంలో చెబుతుంటారు. ఈ రెండు అంత ఆకర్షణీయంగా ఉండవు. "రామా... నన్ను కాపాడు" అని గానం చేస్తే అది హృదయాన్ని కరిగిస్తుంది. గానము భగవంతుని వరప్రసాదమే. చక్కగా గానం చేయాలని ఎంత మందో ప్రయత్నిస్తున్నారు. కాని విఫలమై పోతున్నారు. కొందరు ఏ ప్రయత్నమూ చేయకపోయినా సులభంగా, సున్నితంగా మధురంగా, ఆనందంగా గానం చేయగల్గుతున్నారు. ఇది భగవంతుని వరప్రసాదమే. ఎమ్.ఎస్. సుబ్బలక్ష్మి ఉన్నదిక్కడ. గానమువల్ల ఆమె హృదయం మధురంగా మారిపోయింది. ఇది ప్రాక్టీసు చేస్తే వచ్చేది కాదు. ఇది భగవదనుగ్రహప్రసాదమే.
బాహ్యంగా భజన చేస్తే పదిమందికి ఆనందము నందించవచ్చును. అట్లచేయలేకపోయినా మీలో మీరు భగవంతుని ప్రార్థిస్తూ గానం చేసుకోండి. అది మీ హృదయాన్ని మధురంగా మార్చుతుంది.
(స.సా. డి. 96 పు. 313, 314)||
తేజోమయుడైన భగవంతుని యందు మంత్ర పూర్వకమైన ఆరాధన చేత సామవేదమనే గానం చేత లీనం కావాలి. లీనం కావడానికి గానం తప్ప మరొక దారి లేదు. చాలామంది. పద్యాలు చదువుతుంటారు. మాటలు చెపుతుంటారు. కాని పద్యముల చేత, మాటలచేత హృదయం ఆకర్షింపబడదు. రాముని ముందుకుపోయి "రామా నన్ను కాపాడు" అని మాటలతో చెపితే హృదయం ఏమాత్రం కరుగదు. పద్యంలో చెపితే అది కూడా హృదయాన్ని ఏమాత్రం కరిగించదు. కాని, “రా... నన్ను కా.పా.డు..." అని గానం చేస్తే, అది హృదయాన్ని ఎంతగానో ఆకర్షిస్తుంది. గానంలో ఈ విధముగా లీనం కావడానికి అవకాశముంది. కాని, ఈ లీనతత్వాన్ని అర్థం చేసుకోలేని వ్యర్థజీవులందరూ గానాన్ని వినలేకపోతున్నారు. గానంలో ఏమైనా కొంత అపస్వరం వస్తే అది భ్రష్టు పట్టిస్తుంది. ఏకాగ్రతను చెడగొట్టుకుంది. కనుక, మనం పాడే సమయంలో సుస్వరంగా పాడగల్గితేనే మైకు ముందు కూర్చోవాలి. లేకపోతే మైకునకు దూరంగా ఉండి శ్రవణం చేస్తే మంచిది. అపస్వరంతో పాడే భజనలు, అపస్వరంతో చేసే గానము మన హృదయాన్ని కొంతవరకు చలింపజేస్తున్నాయి. నీకు పాడాలని ఇష్టముంటే ఒంటరిగా ప్రాక్టీసు చేయి, తరువాత మైకు ముందుకు వచ్చి కూర్చో. భగవంతుని ఆకర్షింపజేసేది, హృదయాన్ని రంజింపచేసేది గానమే. ఇదే శబ్దప్రమాణము.
(స.సా. ఆ. 93 పు. 274)
(చూ॥ సాక్షాత్కారము)