గాయత్రి ఎవరు? ఏదో ఒక స్త్రీ అని, ఆమె శక్తివంతురాలని కాదు. సర్వత్ర ఉండేది గాయత్రి. ఎక్కడ నీవు గానం చేస్తే అక్కడ గాయత్రి ఉంటున్నది. ఈమెకు గాయత్రి, సావిత్రి, సరస్వతి అని మూడు పేర్లు ఉంటున్నవి. ఇంద్రియములకు నాయకత్వం వహించినది గాయత్రి: సత్యమును పోషించేది సావిత్రి, వాగ్దేవతా స్వరూపిణి సరస్వతి. అనగా హృదయము, వాక్కు, క్రియ – ఈ త్రికరణశుద్ధి గావించునదే గాయత్రి, సర్వదేవతాస్వరూపిణి గాయత్రి. ఈమెకు "పంచముఖి" అని మరొకపేరు. పంచముఖి ఆనగా, ఐదు ముఖములు కల్గినది. ఓం - ఇది ఒక ముఖము, భూర్భువస్సువః - రెండవముఖము; తత్సవితుర్వరేణ్యం - మూడవముఖము; భర్గోదేవస్య ధీమహి – ఇది నాల్గవది; ధీయోయోనః ప్రచోదయాత్ - ఇది ఐదవది. అంతేకాదు. ఈమెకు, తొమ్మిది వర్ణనలున్నాయి. ఓం, భూ, భువః, సువః, తత్, సవితుర్, పరేణ్యం , భర్గో, దేవస్య - ఇవి వర్ణనలు. ధీమహి - ధ్యానించడం, ధీయోయోన: ప్రచోదయాత్ - ప్రార్ధించడం. కనుక వర్ణన, ధ్యానము, ప్రార్థన - ఈ మూడూ ఒక్క గాయత్రి మంత్రములోనే లీనమై ఉంటున్నది.
(స.. సా. జూ 1995 పు. 164)
ప్రతి మనిషికి ఒక్కటికాదు వాలుగు జన్మదినము లున్నాయి. మొదటిది శిశువుగా జన్మించినపుడు, ఆ స్థితిలో ఆహారము రక్షణలను మాత్రమే ఆ శిశువు కోరుతుంది. కనుక అది పాప పుణ్యము లెరుగని స్థితి. రెండవ జన్మదినము ఈనాడు మీకు ప్రాప్తించిన ఉపనయనము. ఇప్పుడు మీరు ద్విజులు అంటే రెండు సార్లు జన్మించినవారు. ఇప్పుడు మీరు అంధకారము నుండి వెలుగులోనికి తీసుకువచ్చే మంత్రోపదేశము పొందారు. ఈ యజ్ఞోపవీతము మీ కర్తవ్యాన్ని గుర్తు చేస్తుంది. మూడవ జన్మదినము ఎప్పుడనగా మీరు మహార్షులు బోధించిన మార్గములలో ఆత్మ సాక్షాత్కారమునకు అవసరమైన ఆధ్యాత్మిక పరిజ్ఞానమును ఆర్జించినరోజు. ఆరోజుననే ఆత్మ విశ్వాసముతో నీవు అమృత పుత్రుడవని గ్రహించి నిజమైన విప్రుడుగా అనగా వివేకవంతుడిగా మారగలవు. అంతేకాదు. నాలుగవ జన్మదినోత్సవము చేసుకునే రోజుంది. బ్రహ్మసాక్షాత్కారము పొంది ఏ పరబ్రహ్మము యొక్క ప్రతిబింబములో అపర బ్రహ్మములో లీనమయ్యే పర్వదినమది. అపుడే నువ్వు స్వస్వరూపమును పొందుతావు. జీవితమనే యజ్ఞములో పాల్గొనుటకు అత్యవసరమైన పవిత్రతకు యజ్ఞోపవీత మొక చిహ్నం. జీవితమమనది అల్బమైన వాటిని త్యజించి ఉన్నతమైన స్థితిని పొందు నిర్విరామ త్యాగము. ఉపనయనమనగా మరొక నేత్రమును పొందుట, ఆత్మ సామ్రాజ్య వైభవమును తిలకించుటకు ఈ రెండు చర్మ చక్షువులూ పనికిరావు. ఈ కండ్లతో అనిత్యమైన ప్రాపంచిక వస్తువులను తిలకించుటకు వీలగును. గాయత్రి మంత్రము అంతర్ దృష్టిని ప్రసాదించు దివ్య నేత్రము. గాయత్రి మంత్రమును స్త్రీలు కూడా జపించవచ్చును. గాయత్రిని దేవిగా పూజించునప్పుడు స్త్రీలకు జపించు అధికారమెందుకు ఉండదు?
మూడవకన్ను అనగా జ్ఞానవేత్రము. శివునకు త్రినేత్రుడని పేరు.అతడు భవిష్యత్తును కూడ చూడ గలుగు త్రికాలజ్ఞుడు. అతనిని బిల్వపత్రములతో పూజింతురు.
బిల్వపత్రము మూడు కన్నులకు చిహ్నముగా ఉపపత్రముల కలయిక. అతడు త్రిశూలమును ధరించును. మూడు శూలముల కలయికయైన త్రిశూలము యొక్క అంతరార్థమూ అదియే. శివలింగమును బిల్వ పత్రముతో పూజించునప్పుడు మీరు మీ గుణముల ప్రాబల్యమునూ త్రిశూలముతో ఛేదించి గుణాతీతమైన చిన్మయ స్థితిని మీకు ప్రసాదించమని ప్రార్థించవలెను.
గాయత్రి జీవితాంతము మీరు సంరక్షించు కోవలసిన పెన్నిధి అని జ్ఞప్తి యందుంచుకోవాలి. ఈ మంత్రం యొక్క స్వరముల ఉచ్చారణ మీకు సరిగ్గా పట్టుపడక పోయినట్లయితే మీ తండ్రి వద్ద కాని మీ కుటుంబ పౌరోహితుని వద్ద కాని విని నేర్చుకొనండి బహుశః అశ్రద్ధ వలన వారు కూడా మరచిపోయి ఉండవచ్చు. అట్టివారిని మీవద్ద నేర్చుకోమంటాను. ఏ మంత్రం మరచిపోవద్దు. నిత్యం వీలయినన్నిసార్లు జపించండి మీరు బస్సులో ఉన్నా, రోడ్డు మీదవున్నా బజార్లో ఉన్నా, కార్లో ఉన్నా, రైల్లో ప్రయాణం చేస్తున్నా, ఎప్పుడైనా, ఎక్కడైనా సరే అది మీకు హాని కలుగకుండా కాపాడుతుంది. పాశ్చాత్యులు గాయత్రి మంత్రము యొక్క ప్రాశస్త్యమును పరిశోధించగా వేదోక్తమైన స్వర బద్ధముగా ఉచ్చరించునప్పుడు వెలువడు శబ్దతరంగముల ప్రభావముచే కాంతి వలయము ఏర్పడునట్లు కనుగొన్నారు. స్వరబద్ధముగా లేకున్న అంధకారమే తప్ప ఆ కాంతివలయము కనబడదు. మంత్రోచ్చారణ ద్వారా బ్రహ్మతేజస్సు తద్వారా జ్ఞాన ప్రకాశము పొంది మీరు కాంతి పధములలో ఉంటారు. గాయత్రి అన్నపూర్ణ, తల్లి, జీవశక్తి. అందుచేత అశ్రద్ధ చెయ్యకండి, పెద్దలు పూరోహితులు దీనిని నిర్లక్ష్యము చేస్తున్నారు. భారతీయ సంస్కృతికి వారసులైన మీరు గాయత్రి యొక్క పవిత్ర శక్తి ప్రభావములను ఆచరణ రూపములో చాటవలసిన బాధ్యతను వహించండి.
(స.సా.అ. 77 పు. 141/142)
క్రమక్రమేణ గాయత్రీ మంత్రమందు సూర్యుని ప్రధానమైన దేవతగా విశ్వసిస్తూ వచ్చారు. ధీయో యో నః ప్రచోదయాత్. సూర్యుడు ప్రకాశించినట్లుగా మానవుని బుద్ధి అమితంగా ప్రకాశించాలి: సూర్యప్రకాశము బుద్ధిలో ప్రవేశించాలనే ప్రార్థనలు సలుపుతూ వచ్చారు.గాయత్రి మంత్రముచ్చరించుకుంటూ గాయత్రి వేదమాత అని విశ్వసించినారు. గాయత్రి ఒక కాలమునకు, ఒక దేశమునకు ఒక పాత్రకు సంబంధించినది కాదనియు, భూర్భువస్సువః మూడులోకములకు మూడు కాలములకు సంబంధించినదని విశ్వసించారు. "తత్సవితుర్ వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యో నః ప్రచోదయాత్", చీకటిని రూపు మాపేది వెలుగు. వెలుగు లేకుండా చీకటి దూరము కాదు. చీకటిని రూపుమాపే సూర్యుడు గాయత్రీరూపములో ప్రధాస్థానమును ఆక్రమించాడు. ఈ విధముగా యేదో ఒక శక్తి వున్నదని, ఆ శక్తియే దైవమని విశ్వసించుకుంటూ వచ్చారు.
(ఉ.బృపు. 16)
గాయత్రి మంత్రము వేదసారము. సమస్త వేదములకు గాయత్రియే మూలము. "గాయత్రీ ఛాందసాం మాతా" ఒక్కొక్క వేదము ఒక్కొక్క మహావాక్యము అందిస్తుంది. (1) తత్త్వమసి (2) ప్రజ్ఞాన బ్రహ్మ (3) అయమాత్మా బ్రహ్మ (4) అహం బ్రహ్మస్మి ఈ నాల్గింటిని ఈ నాలుగు మహావాక్యములు జత చేస్తే అవి గాయత్రి రూపము ధరించును. గాయత్రి సమస్త దేవతా స్వరూపము. గాయత్రి ఉపదేశమును అందుకున్న తరువాత ధరించే యజ్ఞోపవీతములో మూడు త్రాళ్ళు చేరి వుంటాయి. త్రికాలము సంధ్యా వందనము చేయవలయునని దీని యర్థము. ప్రాతః సంధ్య, మధ్యాహ్న సంధ్య, సాయం సంధ్య, ఈ మూడు కాలములను బ్రహ్మ, విష్ణు, రుద్రస్వరూపములుగా
భావించి, త్రిలోకములందు, త్రికాలములందు, సార్థక జీవితమును సాధించ
వలయుననే గాయత్రి ప్రార్థన. అంతరార్థం. గాయత్రి పంచభూత స్వరూపిణి. పంచ ప్రాణ పోషిణి, పంచేద్రియ విధాయిని. కనుక సర్వజ్ఞానములు గాయత్రి యందు వుంటున్నది. అందువలననే గాయత్రి దేవిని పంచముఖి యని ధ్యానించుచున్నారు. గాయత్రి ప్రథమ ముఖం "ఓం, ద్వితీయముఖం" భూర్భువస్సువః" మూడవముఖం "తత్సవిత్వరేణ్యం" నాల్గవ ముఖం "భర్గోదేవస్య ధీమహి?" ఐదవ ముఖం "ధీయోయోనః ప్రచోదయాత్"..
గాయత్రి మంత్ర పారాయణ ద్వారా పంచభూతములు, పంచ ప్రాణముల, పంచ కోశముల తత్త్వమును పొందుటకు వీలుండును. ఆధ్యాత్మికము, ఆధిదైవికము, ఆధిభౌతికము అని మూడు ఉన్నట్లుగా గాయత్రికి కూడా గాయత్రి, సావిత్రి, సరస్వతి అని మూడు పేర్లున్నాయి. ప్రాణమును పోషించువది గావున గాయత్రి, ఇంద్రియములమ పోషించువది గావున సావిత్రి, వాక్కును రక్షించునది. గావున సరస్వతి యని పేరు. వాక్కు, ఇంద్రియములు, ప్రాణములు ఇవి త్రికరణములుగా యుండును. ఇట్టి త్రికరణములు శుద్ధీకరించునుగాన గాయత్రి మంత్రము త్రికరణ శుద్ధి కొరకు కర్మ లాచరించునపుడే విజయము సాధించుటకు వీలగును. గాయత్రి జప సాధనవలన త్రికరణ శుద్ధి సులభమగును.
(సా॥పు|| 564)
గాయత్రికి నాలుగు పాదములు, ఆరు విధములును కలవు. ఆ విధము లెవ్వి అన: వాక్కు, భూతము, పృథివి, శరీరము, హృదయము, ప్రాణము. ఇట్టి పవిత్ర గాయత్రిచే చెప్పబడిన పురుషుడు మిక్కిలి శ్రేష్టుడు; మిగుల పవిత్రం గలవాడు, మిగుల మహిమకలవాడు. సకల భూతములు ఆయన శరీరమున అల్ప భాగముగా పరిగణింపబడుచున్నవి. గాయత్రిచే పేర్కొనబడిన పురుషుడే బ్రహ్మయని చెప్పబడువాడు. అతడే పురుషునికవతలనుండు ఆకాశమై యుండును. అప్పుడు "బహిర్దా పురుషాకాశః" అని చెప్పబడుచున్నది. ఇదియే జాగ్రదావస్థ. అతడు పురుషుని లోపల నుండు ఆకాశమై యున్నాడు. అప్పుడు "అస్తః పురుషాకాశః" అని చెప్పబడును. దీనిని స్వప్నావస్థ అందురు. అది పూర్ణము. సర్వత్ర నిండియున్నది. ఆదియే సుషుప్తి అనబడును.
(శ్రీ. స.సూ. పు. 111) –
(చూ|| ఆ హూతి, కర్తవ్యధర్మము,వాల్మీకి, విశ్వామిత్రుడు)