నిజముగా మానవుడు భయస్వరూపుడు కాడు. మానవత్వమనే పదమునందే దివ్యత్వమనే అర్థము యిమిడి వుంది. దీనికి ఒక చిన్న కథ. ఒక భయంకరమైన అరణ్యములో సర్వవిధములైన జంతువులు నివసిస్తూ వుండేవి. ఏ అడవిలో సింహములు నివసిస్తాయో ఆ అడవిలో ఏనుగులు నివసించవు. ఏనుగులు సంచరిస్తూ వుండే అడవిలో సింహములుండవు. కాని యీ అడవీయందు సింహము మొదలుకొని నక్క కుక్క వరకు సమస్త ప్రాణులు సంచరిస్తూ వున్నాయి. ఒక నక్క అనేక విధములుగా యోచిస్తూ వచ్చింది. మానవత్వమునుఆదర్శజీవితముగా లోకులు భావిస్తున్నారు. మానవ జన్మము చాలా దుర్లభమైనదని చెప్పుకుంటున్నారు. మానవుడు పుట్టినట్లుగానే జంతువులు కూడా పుట్టినాయి. తల్లిగర్భము నుండి జన్మించిన ప్రతిదీ ఒకవిధమైన జంతువే. మానవునికి కూడను జంతువు అని పేరు పెట్టకుండా మానవుడనే పేరు ఎందుకు పెట్టారు? మాకంటె తాను యేమంత గొప్పవాడు? వారికంటె మేము యేమి తీసిపోయినవారము? ఈ విధముగా తర్జనభర్జన చేసుకొని విచారణ సల్పియిది వూరికే విడిచి పెడితే ప్రయోజనము లేదు దీనిని సాధించాలి అని ఆ నక్క గట్టిపట్టు పట్టింది. ఆనాటి నుండి నక్క కాన్వాసింగ్ కు బయలుదేరింది. ప్రతి జంతువు దగ్గరకు వెళ్లింది. మానవునికంటె మనము యెందుకు తక్కువగా వుండాలి? జంతుజాతి మానవజాతికంటే హీనజాతియని భావిస్తున్నారు. ఈ పేరును మనము తుడిచివేసుకోవాలి. అని బోధిస్తూ ప్రతీ జంతువుకు వుద్రేకమును వుత్సాహమును చేకూరుస్తూ వచ్చింది. శరీరపుష్టిగల ఏనుగు మొదలుకొని మృగరాజైన సింహము హీనస్థాయియందున్న నక్క కుక్కలవరకు దీనిని టాంటాం వేయించి అందరికీ యీ విషయమును బోధించింది. అందరూ చేరి ఒక మహాసభను యేర్పరచుకోవాలని నిర్ణయం జరిగింది. సభకు చతుష్పాద మహాసభ యని పేరు పెట్టుకున్నారు. ఫలాని కాలములో ఫలాని సమయానికి అందరూ యీ మహాసభలో పాల్గొనాలని చెప్పింది. దీనికి ఎజెండా మూడు విషయాలు నిర్ణయము చేసుకుంది. మానవులు జంతువులు తల్లి గర్భమునుండి పుట్టినవారే. అందుచే మానవులకు జంతువులకు “జంతువు" అని ఒకే పేరు వుండాలి రెండు పేర్లు ఉండటానికి వీలులేదు. జంతువులకు మానవుడుఅనైనా పేరుండాలి లేదా మానవునకు జంతువు అనైనా పేరుండాలి. ఈ రెండు సమానము, భిన్నముగా వుండటానికి వీలు కాదు అని నిర్ణయము చేసుకోవాలి. ఇంక రెండవది మానవుడు జ్ఞానవంతుడని, జంతువులు అజ్ఞానముతో కూడినవని మనకొక చెడ్డ పేరు. దీనిని మనము అంగీకరించరాదు. మనకున్న జ్ఞానముకంటె మానవునికి యేమంత అధికముగా వుంటుండాది? మానవునకున్న జ్ఞానముకంటె మనకేమి తక్కువగా వుంటుండాది? ఇరువురికీ ఒకే స్థానము అనే దానిని మనము స్థిరము చేసుకోవాలి. ఇక మూడవది మనము నోరులేని వారమని, మానవుడు నోరున్నవాడని, మనము మూగజంతువులమని, వారు మాటకారులని పేరు ప్రతిష్ఠలు కలిగినాయి. మనం మూగజంతువులమైనప్పటికీ మనకు యేమి కొరతగా వున్నది. మాటలు నేర్చిన వాడైనప్పటికిని వాడేమి సుఖమును అనుభవిస్తున్నాడు. కనుక మాటలకు, మూగతనమునకు యేమాత్రము బేధము వుండకుండా చూచుకోవాలి. మనము క్రూరులమనిభావిస్తున్నారు. మానవుడు తాము సాత్వికుడని విశ్వసిస్తున్నాడు. దీనికి మనము అంగీకరించరాదు. మనలో వున్న సాత్వికత్వము మానవులెవరియందు కూడ లేదు. మానవునికంటె మృగము సాత్వికమైనదనే సత్కీర్తిని మనము తీసుకురావాలి. ఇప్పుడు చెప్పిన నాలుగు పాయింట్లు మనము యీ సమావేశము లోపల చర్చించాలి.
ఈ మీటింగుకు ఎవరిని అధ్యక్షుని చేయాలి? అప్పుడు నక్కనే చెప్పింది. మన అడవి లోపల కొంతమంది యోగులు, ఋషులు తపస్సు ఆచరించుకుంటున్నారు. అందులో ఉత్తముడైన ఒక ఋషిని మనం ఆహ్వానిద్దాము అని విశ్వసించి నక్కనే ఆ ఋషి దగ్గరకు వెళ్ళింది. స్వామీ! మా జంతురాజ్యములో చతుష్పాద మహాసభ యనే గొప్ప సభన జరుపుకుంటున్నాము. తమరు దీనికి అధ్యక్షత వహించాలి అని కోరింది. సర్వభూత సమానత్వమును గుర్తించిన ఆ యోగి మీ సభకు తప్పక వస్తానని అంగీకరించాడు.
మంచి ముహుర్తములో ఆ సభను ప్రారంభించుకున్నారు. విశాలమైన ఒక ప్రదేశములో ఆనాడు అడవిలో వున్న చిన్న జంతువు మొదలుకొని పెద్ద జంతువు వరకు తల్లితండ్రులు మొదలుకొని మునిమనుమలు వరకును అన్నీ ప్రయాణమై వచ్చినాయి. అక్కడ కలకలలాడుతుండాయి, కిలకిలా నవ్వుతున్నాయి. ఈ మృగములంతా కూడను అధ్యక్షునిపై కొంతవరకు విశ్వాసమున్నవే. కనుక ఆ ఋషికి ఉన్నతాసనమును యేర్పరచినాయి. అదే విధముగా అధ్యక్షుని పక్కన సింహమునకు వున్నత స్థానము అమర్చినాయి. మహర్షి తన ప్రక్కనున్న సింహమును చూచి యేమాత్రము అదరలేదు. బెదరలేదు. సర్వభూతములందుండిన దైవత్వమనే యేకత్వమును కలిగినవాడు యీ మహర్షి. ఈతని యందు అభయత్వమే వుందిగాని భయత్వము లేదు. అందరూ కూర్చున్న తరువాత స్వాగతం చెప్పాలి. ఈ మహాసభకు సెక్రట్రీ యీ నక్కనే కనుక ఇట్లా ప్రారంభించింది. ఈనాడు మనకందరికి సువర్ణాక్షరము లతో లిఖించవలసిన దినము. ఇది మరువరానటువంటి దినము. మన అందరి సమావేశము ఒక దిగ్విజయమును సాధించబోతుంది. మీకు యెన్నో పనులున్నప్పటికిని అన్నియును వదలి యీ సమావేశములో పాల్గొన్నారు. మీ అందరికి నా ధన్యవాదములు అంది. తరువాత మీటింగ్యొక్క మూడు విషయాల ఎజండాను చెప్పింది.
ఎజెండాను చెప్పిన తరువాత సింహరాజు లేచాడు. లేచి నా సోదరుడైన నక్క చెప్పిన విషయము మీరంతా విన్నారు. నిజముగా మన జంతువులయందుండే శౌర్యసాహసములు, ధైర్యము, పటుత్వము మానవుని యందు లేవు. దీనికి నేను ప్రత్యక్ష ప్రమాణము. నాయందున్న ధైర్యము, బలము మానవునిలో యేఒక్కరి కైనా వుంటుందా చూపించండి. నేను మృగరాజునైనప్పటికి అన్యాయఅక్రమ అనాచారములలో యేమాత్రము అడుగు పెట్టలేదు. నిష్కారణముగాపరజీవులను హింసించటము లేదు. ఆకలైనప్పుడు మాత్రము యేదో ఆహారమును భుజిస్తాను. వ్యర్ణముగా నేను యే ప్రాణిని తినటం లేదు. ఈ ధైర్యము, యీ సాహసము, యీ నీతి మానవుని యందు వుందా? లేదు. కనుక మనము మానవులకు యెందుకు వెరవాలి. అతనికంటె అల్పజాతి అని మనము యెందుకు అన్పించుకోవాలి. దీనిని యీనాడు నిర్ణయం చేసుకోవాలి అంది. తరువాత ప్రక్కనున్న ఏనుగు లేచింది. మానవుడంటే నా మోకాలంత కూడ లేదు. ఆకారములో నాది గొప్ప ఆకారము. తెలివితేటలలో నాది గణతెలివి అనిపించుకున్నాను. నన్ను రాజులు, రారాజులు విశ్వసిస్తూ అన్వేషిస్తూ వచ్చారు. రాజుకు పట్టాభిషేకము చేసే సమయములో నేను లేకపోతే పట్టాభిషేకము జరుగదు. నాకంటె మానవులు గొప్పవారని నేను ఎట్లా చెప్పాలి. నా తెలివితేటలకు నా బలమునకు నాయొక్క ఆకారమునకు మానవుడే నాటికి సాటిరాడు అన్నది.
ఆంతలో నక్క ఒక యోచన చేసింది. మృగరాజు లేచి చెప్పాడు. ఆమహారాజ ప్రకమున్న మంత్రి సమానమైన ఏనుగు లేచి చెప్పింది. చిన్నవాడు ఒకనిని పైకి లేపి మాట్లాడించాలి అనుకుంది. పక్కనున్న అడవికుక్కను లేపింది. అడవికుక్క లేచి అధ్యక్షునికి నమస్కరించి, మృగరాజుకు నమస్కరించి, సమావేశములో చేరిన వారందరికీ నమస్కరించి, “గొప్ప వారి ముందు అల్పుడను, నేను మాట్లాడవలసి వచ్చిందిగాని నా యల్పత్వము నందుండిన మహాగుణము మానవునియందు లేదు. విశ్వాసములో నాకు మించినవాడు మరొకడు లేదు. నన్ను సాకి సంరక్షించినవాని పైన నేను యెంతో విశ్వాసమును పెంచుకుంటాను. నా ప్రాణము పోయేంతవరకు వానికి కృతజ్ఞుడైవుంటాను. నన్ను హింసించినప్పటికిని నేను అతనిని యేమాత్రము బాధించను. మానవలోకమునందు కూడము "కుక్కకున్న విశ్వాసము లేదురా యని అనిపించుకుంటాను. విశ్వాసములో మానవునికే మాత్రము నేను తీసిపోను. మానవుడు తన మాష్టర్ని హింసించటానికి ప్రయత్నిస్తాడు. ఉపకారము చేసినవానికే అపకారము చేస్తున్నాడు. తనకు అన్ని విధములుగా సహాయము చేసినవానికే ద్రోహం చేసి దూషిస్తున్నాడు. మానవుడు. తన యజమానిపై కుట్రపన్ని హింసకు పాల్పడుతున్నాడు. మానవుడు, మానవునికి కృతజ్ఞత అనేది లేదు. విశ్వాసము కూడను లేదు. తన అక్కర తీరేంతవరకు యెంతైనా వినయ విధేయతలు ప్రదర్శిస్తాడు. తన అక్కరి తీరిన తరువార మాస్టర్నే హింసించటానికి పూనుకుంటాడు. మానవునికంటే మనమే మాత్రము తక్కువజాతి వారము కా"మన్నది. ఈ విధముగా మిగతా జంతువులు వాటి వాటికి తగినట్లుగా ఉపన్యాసాలిచ్చినవి. తరువాత అధ్యక్షుని ఉపన్యాసము వచ్చింది.
ఆ ఋషి చెప్పాడు. ఓ మృగములారా ! మీరు చెప్పిన విషయములన్నియు సత్యములే. “కూరిమి గల దినములలో నేరములెన్నడును కలుగనేరవు" ఇష్టంగా ఉండే రోజల్లో మాస్టర్ చేసేవి అన్ని మంచివే అనుకుంటాము. "కూరిమి విరసంబైనను నేరములే తోచుచుండు". ఈ మాస్టర్ పైన యేమైనా కొంచెము అయిష్టము బయలుదేరిన అతను మంచి పని చేసినా చెడ్డగా భావించుకుంటాము. మానవుడు, ఎదురుగా నమస్కరిస్తాడు. మరుగున పోయి దూషిస్తాడు. ఎదురున ఒకమాట, మరుగున ఒకమాట. ఎదురుగా వర్ణించి వెనుకగా పోయి హతమార్చటానికి ప్రయత్నిస్తాడు. ఇలాంటి తెలివితేటలకంటె మృగము చెప్పిన తెలివితేటలు చాలా గొప్పవి. మీరు చెప్పిన దోషములు మానవునియందు లేకపోలేదు. ఆహారనిద్రాభయ మైధునేచ్చలు నాల్గింటి యందును మృగమునకు మానవునకు యెట్టి వ్యత్యాసము లేదు. అయితే జంతువులకంటె మానవుని యందు ప్రత్యేకత ఒకటి వున్నది. మృగములయందు పుట్టుకతో వచ్చిన క్రూరత్వమున మృగములు మార్చుకొనలేవు. ఎంత ఆకలిగొన్నప్పటికి పులి పూరీ పలావు తినదు. పులి మాంసాన్నే ఆరగిస్తుంది. టిఫిన్, కాపీలు త్రాగదు. ఎంత ప్రయత్నము చేసినప్పటికి దాని స్వభావము మారటానికి వీలుకాదు. మానవుడు ప్రయత్నము చేస్తే ఎటువంటి క్రూరత్వమును గానీ, ఎటువంటి దుర్గుణములు గాని మార్చుకొనగలడు. ప్రయత్నముచేత పరివర్తన కలిగే శక్తి మానవునియందు వుంది. ఎట్టి ప్రయత్నము చేసినప్పటికినీమృగమునందు పరివర్తన కలిగే శక్తిలేదు. ఇదే రెండింటికి బేధము. ఈ విధమైన శక్తి సామర్థ్యములు మనిషియందుంటున్నవి" అన్నాడు. అప్పుడు నక్క లేచి "స్వామీ! మీరు చెప్పినది వాస్తవమే. అయితే అలాంటి మార్చుకొనే శక్తి మానవుని యందుండి నప్పటికిని మార్చుకోలేని మానవుడు ఎలాంటివాడు?" అన్నది. "శక్తి వుండి కూడా అలా మార్చుకోలేని మానవుడు మృగము కంటే హీనము" అన్నాడు అధ్యక్షుడు. అప్పుడు అన్ని మృగములు చప్పట్లు కొట్టాయి. మానవునియందు వివేకశక్తి వుండినప్పటికీ వినియోగించక సన్మార్గములో ప్రవేశించ కుండా వుండే మానవుడు మృగము కంటే హీనము అని మహర్షి నిర్ణయించాడు.
ఇంక మానవుడు చదువు సంధ్యల లోపల మహా గొప్పవాడుగా వుంటున్నాడు. చదువులు చదివినందువలన - కల్గిన ఫలితమేమి? ఇవి కేవలము పొట్టకూటి కోసమే కదా! ఆ పొట్టను మనము కూడా నింపుకుంటున్నాము కదా. పొట్టను నింపుకునే నిమిత్తమై మానవుడు యిన్ని విధములైన శ్రమలు పడుతున్నాడు. శ్రమ పడకుండా మనము పొట్ట నింపుకుంటున్నాము. వారికంటే మనమే గొప్ప అన్నది నక్క. నక్క స్వాతంత్ర్యము మరీ మితిమీరిపోతున్న సమయంలో అధ్యక్షుడైన మహర్షి దానిని నివారించి రెండవ భేదము చెబుతూ వచ్చాడు. “మానవుడు మాయను సాధించగలడు. మానవుడు ఆత్మను చూడగలడు. మానవుడు నిర్వాణమనే ఆనందమును చేరగలడు. మానవునకుమాయనుజయించే అధికారము వుంటుందాది. ప్రయత్నము చేసి ఆత్మను ఉద్దరించుకోగలడు. సాధనసంపత్తివలన నిర్వాణమున చేరగలడు. ఈమూడు మీ మృగములయందులేవు అన్నాడు. ఆ మహర్షి ఇంకా చెప్పాడు. నాయనా! ఆంగ్ల భాషలోపల MANఆని చెబుతున్నారు. తెలుగులో మానవ అని చెబుతున్నారు. మాయయనే అజ్ఞానమును దూరము చేసుకొని ఆత్మతత్వమును దర్శించి విజ్ఞానమనే ఆనందములో లీనమవుతాడు. మానవుడు. ఆదే అర్థము యీ MAN లోపల వుంది. M అనగా మాయ. మాయను తొలగించు.Aఅనగాఆత్మ, ఆత్మను దర్శించు Nఅనగా నిర్వాణము. నిర్వాణము పొందుము. ఆనందములో లీనముకా, అజ్ఞానమును దూరము చేసుకొని ఆత్మను దర్శించి ఆనందములో లీనము అయ్యేవాడు నిజమైన వాడు అని చెప్పాడు. మృగములన్నియు తలలు వంచుకున్నాయి. అది తమకు చేతకానిపని యని ఒప్పుకున్నాయి. అయితే అందరు మానవులు యీ పని చేయగలుగుతున్నారా? ఈ విధమైన ప్రయత్నము చేయని మానవుడు మా Friend అని మృగములన్ని అంగీకరించాయి. కనుక మానవునకు మృగమునకు యెక్కువ వ్యత్యాసము లేదు. మానవునియందు విజ్ఞాన ప్రజ్ఞాన సుజ్ఞానములు వుండి కూడను సరియైన రీతిలో అనుభవించుట లేదు. మహర్షి తాను అరణ్యమునకు వచ్చిన కారణమును నిరూపించాడు. మృగములు తమను హింసించినవానిని మాత్రమే హింసించగలవు. తమను హింసించనివాని జోలికి యేమాత్రము పోవు. కాని మానవుడు తనను హింసించనివాని పైన కూడ హింసకు ప్రయత్నయు చేస్తాడు. నిష్కారణమైన నిందలు మోపుతాడు. నిరపరాధులను హింసిస్తాడు. కారణములేని కార్యములో పాల్గొంటాడు. కనుకనే ఆ మానవులనుండి దూరముగా యీ సాత్వికగుణము కల్గిన మృగముల మధ్య సుఖముగా జీవించగలమని ఋషులంతా అరణ్యమునకు వస్తున్నారు. మానవుడు కేవలము స్వార్థపరుడై పోతున్నాడు. ఏది చేసినా, ఏది చూసినా, ఏది చెప్పినా తన స్వార్థమునందే ముగునుతున్నాడు. మృగమున కేమాత్రము స్వార్థము లేదు. ఈ మృగములు మనుమలను మునిమనుమలను అమెరికాకు, జపానుకు, ఫ్రాన్సుకు, ఇటలీకి, జర్మనీకి పంపించాలని డబ్బు బ్యాంకులో ఫిక్సెడ్ డిపాజిట్ చేయటం లేదు. మోసగించి, పరులను హింసించి, పరులను బాధించి తమ పొట్టను నింపుకోవటము లేదు. కొంపలు కట్టుకోవటం లేదు. మానవుడు కూడను ఒక జంతువుతో సమానమే అని ఒక నిర్ణయం చేసుకున్నాయి. అదే విధముగనే యిక్కడ కృష్ణుడు అర్జునిని నాయనా! నివు భయపడటానికి మృగము కాదు అని రెండు మృగముల తత్వమును అర్జునునికి బోధించాడు. భయపడే గొఱ్ఱె కాదు నీవు. భయపెట్టే పులికాదు నీవు. నీవు గొఱ్ఱె కాదు. పులి కాదు. నీవు మానవుడవు, -మానవునియందు యీ మృగత్వము శేషించి వుండిపోవటము వలననే మానవుడు యీవిధమైన ప్రవర్తనకు గురి అవుతున్నాడు. కనుక నీవు అభయుడవు కమ్ము, భయుడవు కాకూడదు" అన్నాడు. అప్పుడు అర్జునుడు "కరిష్యే వచనం తవ " స్వామీ! మీ ఆజ్ఞను శిరసావహిస్తాను అన్నాడు.
(శ్రీ స.గీ.పు.244/250)