నేను పిల్లలకు ఎప్పుడూ చెబుతుంటాను. మొదటిది: “ఫాలో ది మాస్టర్. ఎవరీ మాస్టర్? కాలేజిలో పాఠాలు బోధించే మాస్టర్ కాదు. ధర్మమే. కనుక ధర్మాన్ని అనుసరించు. అన్నింటికీ ధర్మం ప్రధానమైయుండాలి. నీ కర్మలన్నీ ధర్మపరమైయుండాలి. నీవు ధర్మాన్ని రక్షిస్తే ఆ ధర్మమే నిన్ను రక్షిస్తుంది. అందుకే “ధర్మో రక్షతి రక్షితః " అన్నారు. ఇంక రెండవది; ఫేస్ ది డెవిల్, ఏది డెవిల్ అంటే? ‘అర్థమే డెఎల్’ ఈ అర్థంకోసమే మానవులు నానా యాతనలు పడుతున్నారు. అన్యాయ అక్రమ అనాచారాలన్నీ చేస్తున్నారు. ధనం మూల మిదం జగత్’ అనుకుంటున్నారు. ఇది తప్పు. ధనం కాదు, ధర్మమే జగత్తుకు మూలం. అందుకనే ‘వేదోఖిల్ ధర్మమూలమ్ అన్నారు. ధనార్జన ధర్మపరంగా ఉండాలి, అన్యాయార్జన తగదు. ఇక మూడవది: ఫైట్ టు ది ఎన్డ్’ చివరి వరకు పోరాడు. దేనితో? నీలో కామము లేదా కోరిక పూర్తిగా నశించేంతవరకు దానితో పోరాడు. ఒకనాడు దక్షిణా మూర్తి సముద్రపు టొడ్డున నడుస్తుండగా సముద్రుడు అలలతో ఒక గడ్డిపోచను ఒడ్డుకు నెట్టివేయడం కనిపించింది. అప్పుడాయన అనుకున్నాడు. ఓ సముద్రుడా! నీకెంత అహంకారం! అనంతమై అగాథమైయున్న నీవు ఒక చిన్న గడ్డిపోచపై నీ ప్రతాపం చూపిస్తున్నావా?!" అనుకున్నాడు. తక్షణమే సముద్రుడు ప్రత్యక్షమై, "స్వామీ! నా పైన గడ్డిపోచపై కళంకాన్ని భరించలేక నెట్టినాను కాని, గడ్డిపోచపై కినుకతో కాదు"అన్నాడు. అలాగే మనిషి కూడా తనలో గడ్డిపోచ ప్రమాణం కల కామమునకు కూడా చోటివ్వకూడదు. ఇది ఫైట్ టు ది ఎన్ట్ అంటే! ఇంక నాలవది: ‘ఫినిష్ ది గేమ్ మోక్ష ప్రాప్తితో ఈ జీవితమనే గేమ్ పూర్తవుతుంది. ఇదే లక్ష్యం. చతుర్విధ పురుషార్థాలలో నాల్గవదైన మోక్షమిదే. ఇందులో ఒక ముఖ్యమైన అంశమును గమనించాలి. పురుషార్థల్లో మొదటిది ధర్మం , నాల్గవది మోక్షం. మధ్యలో అర్థ కామాలున్నాయి. ఈ అర్థకామాలు రెండూ ధర్మపరమైనప్పుడే మోక్షం సిద్ధిస్తుంది. సహజంగా అయితే పంచమ పురుషార్థం కూడా ఒకటున్నది. దాన్ని ప్రేమ అంటారు. అదే దైవం. ప్రేమతో సాధించలేనిది లేదు.
(స.సా.ఫి. 98 పు.53/54)
(చూ॥ మహాభాగ్యం, సోహం తత్వము)