రాధ తన బంధువుల పైగాని, అక్కచెల్లెండ్ర పైగాని, అన్నదమ్ముల పైగాని ఎవ్వరిపై ఆధారపడలేదు. నిరంతరం కృష్ణచింతనలో కాలం గడిపింది.
"నిలువ నీడలేని బ్రతుకు నీ కొరకని మోయుదాన
నిలువదురా నా మనసు నీ నగవులు దూరమైన
కలలోనైనా కనులకు కానగరారా కృష్ణా!
నిన్ను విడచి నిలువలేనురా, కానగరారా"
భక్తునికోసం భగవంతుడు ఏమైనా చేస్తాడు. తన ప్రాణమునైనా అర్పిస్తాడు. ఇంతటి త్యాగం జగత్తులో మరే వ్యక్తియందు కనిపించదు. రాధ దేహం వదిలే ముందు కృష్ణుడు ప్రత్యక్షమయ్యాడు. "రాధా!నీ తుది కోరిక ఏదైనా ఉంటే చెప్పు" అన్నాడు. "కృష్ణా ! నాకేమీ వద్దు, ఒక్కసారి నీ వేణుగానాన్ని వినాలని ఉంది" అన్నది.
“వేదసారమంత తీసి నాద బ్రహ్మముగను మార్చి
వేణువందు తిరుగ బోసి గానరూపముగము మార్చి
పాటపాడుమా కృష్ణా! పలుకు తేనె లొలుకునటుల
మాటలాడుమా ముకుంద మనసు తీరగా"
రాధ కోరిక మేరకు కృష్ణుడే వేణుగానాన్ని వినిపించాడు. తరువాత ఈ వేణువును అక్కడే పారవేశాడు. ఆనాటి నుండి ఈనాటి వరకు తిరిగి ఆ వేణువును ముట్టలేదు. కృష్ణుని తత్వము, కృష్ణుని లీలలు ఇట్టివి. అట్టివి అని వర్ణించడానికి వీలుకాదు. స్త్రీలలో స్త్రీవలె ఉన్నాడు; పురుషులలో పురుషునివలె ఉన్నాడు. చిన్న పిల్లలలో పిల్లవానివలె ఉన్నాడు. ఈనాడు గోకులాష్టమి, కృష్ణుడు పుట్టినదినము. అనగా, ఇది బాహ్యస్వరూపానికి పుట్టినదినమే కాని, కృష్ణుడు పుట్టడమేమిటి! కృష్ణుని ఆదేశాలను శిరసావహించండి. కృష్ణుడు వేరు, కృష్ణునివాణి వేరు కాదు. అట్లే స్వామి వేరు, స్వామివాణి వేరు కాదు. కనుక మీరు భేదమునకు అవకాశం ఇవ్వకండి.
(స.హ.ఆ.96 పు.256)
(చూ॥ మురళి, సగుణోపాసన, హృదయవాసి)