ఇవి విద్యావివేకాదులచే సాధించగలిగినవి. సాధించ దగినవి. ఇవి ధర్మార్థ కామమోక్షములను నాలుగు పురుషార్థములతో కూడినవి. విద్యలలో కూడా పరవిద్య అని, అపరవిద్య అని రెండుగలవు. నాలుగు వేదములు అపరవిద్యలే. అందులో మూడు అనగా ధర్మ, అర్థ కామములవలన పురుషార్ధములు సాధించుకొనవచ్చును. ఉపనిషత్తులలో చెప్పిన పరవిద్య ద్వారా, నాలుగవదయిన మోక్షము సాధ్యము.
(లీ. వా, పు. 7)
"కాండ త్రయాత్మకం వేదం" అన్నట్లు వేదమువలెనే ఉపనిషత్తులు కూడా కాండత్రయాత్మకమై యున్నవి. జ్ఞాన కాండ, ఉపాసనాకాండ, కర్మకాండములు ఇందులో కూడా కలవు. ఈ మూడు పవిత్ర కాండములూ ఒక్కొక్కటి దృష్ట్యా అద్వైత విశిష్టాద్వైత మతాలను సమన్వయించుచున్నవి. "ఉపనిషత్తు" తో స్థితిరూప నిష్ఠను. "బ్రహ్మవిద్య" లో నిదిధ్యాసమును, "యోగశాస్త్రము" లో మననమును గ్రహింపవలెను. ఇన్నింటిమూలమున చేయునదేది? తెలిసికొనునదేది? అది తన నిజస్థితినే. తన స్వరూపమునకు ఏయే ప్రాప్తిని చేకూర్చునో, యెట్లు చేకూర్చునో సంపూర్ణ అర్థములో ఇచ్చుటవలన, ఉపనిషత్ అని పేరు వచ్చినది. అసలు ఉపనిషత్ యొక్క అర్థము కడు సారవంతము. "ఉప" అనగా సమీపములో, "ని" అనగా నిష్ఠతో శ్రవణము చేసినవారి అజ్ఞానమును శిథిలముచేసి, షత్ అనగా పరమాత్మ ప్రాప్తిని చేకూర్చుట. ఈ కారణములను పట్టి ఉపనిషత్తులని పేరు వచ్చినది. ఉపనిషత్ కేవలము విద్యను బోధించుటే కాక ఆ విద్యను ఆచరణలో పెట్టే ప్రక్రియను కూడా బోధించుచున్నది. ఏకర్మ విధిధర్మముగా చేయవలెనో తెలుపుటే కాక, యే కర్మ చేయదగినదో, యే కర్మ చేయరానిదో అను విషయమునుకూడా తెలుపుచున్నది. అసలు గీతను తీసికొన్న ఉపనిషత్ సారమే కదా? ఉపనిషత్ శ్రవణముద్వారా కలుగవలసిన ఫలితము గీతాబోధ ద్వారా అర్జునునకు కలిగినది. ఉపనిషత్తులలోని "తత్త్వమసి" గీతలో "పాండవానాం ధనంజయ" అను వాక్యముగా బోధింపబడినది. అనగా పాండవులలో ధనంజయుడవైన నీవే నేను అని కృష్ణ పరమాత్మ జీవేశ్వర ఐక్యాన్ని తెలిపెను.
(ఉ. వా. పు.2/3)
(చూ॥ధర్మము, నాదబిందు కళలు, బుద్ధి, భగవద్గీత, విద్య, వేదము, వేదాంతము, సంపర్కము, స్వస్థానము)