చంచలత్వము పోయి మనస్సు క్రమక్రమేణా స్థిరపడటానికి కృషిచేయాలి. అదే ఏకాగ్రత. ఈ ఏకాగ్రతకై చేయవలసిన పని యేమి? Bend the body, mend the senses, end the mind, this is the process of attaining immortality. కనక దేహము వంచి శ్రమించి కర్తవ్య కర్మలాచరించాలి. మనస్సును అదుపులో ఉంచుకోవాలి. మనస్సు దేహము, యింద్రియములను సరైన స్థితిలో పెట్టుకోవటానికి తగిన బలమును సంపాదించాలి. మనస్సును అదుపులో ఉంచుకోవాలి. మనస్సు, దేహము,యింద్రియములు మన అధీనము నందుంచుకున్నప్పుడే మనము మాస్టర్స్ అవుతాము లేకపోతే స్లేవ్స్ అవుతాము. ఇంద్రియములను వశము చేసుకున్నవాడే మాస్టర్. ఇంద్రియములకు లోబడి పెడమార్గము పట్టకూడదు. విద్యను అర్థించాలి. ఇతర చింతల పైన మనసు పెట్టకూడదు. లౌకిక, భౌతిక, ధార్మిక, రాజకీయములందు ప్రవేశించకూడదు. అప్పుడే నీవు విద్యార్థి అవుతావు, లేకపోతే విషయార్థి అవుతావు.
(బృత్ర.పు. ౮౩)
పూర్ణ ఏకాగ్రత కలుగవలెనన్న పూర్ణముగా ఆశాపాశములు దూరము కావలెను. ఎప్పుడు పూర్ణ ఏకాగ్రత కుదరలేదో తాను అన్ని ఆశాపాశములు విడువలేదనియే అర్థము. అందులకే కామ క్రోధలోభములు మానవునకు పట్టిన కఠిన రాక్షసులని అందురు. రాక్షసులు వికార ఆకారములు కలిగియుందురు కదా అని తలంతురేమో! ఆకార మాత్రమున వికార ముండిన ప్రమాదమంత వుండెడిది కాదు; దానిని వికార ఆకారమని మాత్రమే చెప్పవచ్చును.
(గీ.పు. 228)
(చూ|| అవధానము, ఆడవారు. ఏకత్వము, ధ్యానము, మనసు, మెడిటేషన్)