"ఓ భగవంతుడా! నీవే నా తల్లి, నీవే నా తండ్రి, నీవే నా మిత్రుడు, నీవే నా బంధువు..." అని మీరు ప్రార్థిస్తున్నారు.
"త్వమేవ మాతా చ పితా త్వమేవ
త్వమేవ బంధుశ్చ సఖా త్వమేవ
త్వమేవ విద్యా ద్రవిణం త్వమేవ
త్వమేవ సర్వం మమ దేవదేవ”
ఈ ప్రార్థన సరియైనది కాదు. ఇది మీకు, భగవంతునికి భిన్నత్వము కల్పిస్తున్నది. లౌకికమైన బంధుత్వాలను నిత్యమూ మీరు అనుభవిస్తూనే ఉన్నారు. ఇంక దైవంతో కూడా ఈ విధమైన బంధుత్వం ఎందుకు పెట్టుకోవాలి? బంధుత్వము చేత బంధింపబడిపోతారు. "తత్ త్వం అసి." నీవే నేను. నేనే నీవు అనే ప్రార్థన చాల ఉత్తమమైనది. ఇదే ఏకాత్మ భావం..
ఉన్నది ఒక్కటే కాని, ఉపాధి భేధము చేత అనేకత్వాన్ని అభివృద్ధి పర్చుకుంటున్నారు. అందరిలోను ఉన్నది ఒకే భగవంతుడు. అన్ని రూపములూ తానే, అన్ని నామములూ తనవే. దేవాలయాలలో కేశవ నామాలు చెబుతుంటారు. ఎన్ని నామాలు చెప్పినా ఉన్నది ఒకే విగ్రహము కదా! ఇట్టి దివ్యత్వమనే ఏకత్వము వల్లనే జగత్తులోని భిన్నత్వమునకు విలువ వస్తుంది. ఒక చిన్న ఉదాహరణ: ఒకటి ప్రక్కన సున్నా పెడితే పదవుతుంది. ఇంకొక సున్నా పెడితే వందవుతుంది. ఇంకొక జీరో పెడితే వేయి అవుతుంది.
ఈ జీరోలకు ఇంత విలువ దేని వల్ల వచ్చింది? ఒకటి వల్లనే. "వన్ ఈజ్ హీరో, వరల్డ్ ఈజ్ జీరో, దైవ మొక్కని వల్లనే అన్నింటికీ విలువ వస్తుంది. దైవము లేక జగత్తే లేదు.
(స.పా. అ. 96 పుట 260)