దాహంగా ఉన్నప్పుడు ఒక కప్పు నీరు తీసుకొంటే చాలు. కానీ, మానవుడు గంగాజలమంతా కావాలని ఆశిస్తున్నాడు. ఇట్టి అమితమైన ఆశలచేతనే నిరాశకు గురౌతున్నాడు. ప్రతి ఒక్కటీ ఒక limit (పరిమితి)లో ఉండాలి. మన బ్లడ్ ప్రెషర్ 120/80 మాత్రమే ఉండాలి. అది ఏమాత్రము పెరిగినా రోగం ప్రారంభమవుతుంది. మన దేహం యొక్క టెంపరేచర్ 98.4°C ఉండాలి. అది perfect normal అది 99కి వస్తే జ్వరం ప్రారంభమవుతుంది. అదే విధంగా, మన కండ్లు పరిమితమైన కాంతిని మాత్రమే చూడగలవు. మితిమీరిన కాంతిని చూస్తే రెటీనా కాలిపోతుంది. అట్లే, మన చెవులు కూడా పరిమితమైన శబ్దమును మాత్రమే వినగలవు. మితిమీరిన శబ్దం వింటే Ear drum (కర్ణభేరి) పగిలిపోతుంది. కనుక, ప్రతి ఒక్కటి ఒక లిమిట్లో ఉండాలి. మానవ జీవితమే ఒక లిమిటెడ్ కంపెనీ! దీనికి తగినట్లుగా మన జీవితాన్ని కూడా నడుపుకోవాలి.కానీ, ఈనాడు మానవుని కోరికలు ఆకాశాన్నంటుతున్నాయి. మానవునికి తృప్తియే లేదు. ఎంత సంపాదించినా ఇంకా కావాలి. ఇంకా కావాలని ఆశిస్తున్నాడు. తృప్తి లేనివాడే నిరంతరము దుఃఖానికి గురి అవుతున్నాడు.Who is the richest man in this world? He who has much satisfaction is the richest man. Who is the poorest man in this world? He who has more desires is the poorest man.( తృప్తి గలవాడే ఈ ప్రపంచంలో అందరికంటే ధనవంతుడు. మితిమీరిన కోరికలు గలవాడే అందరికంటే బీదవాడు)
(సా.శు.పు.109)
M.B.A. Master of Business Administration" అంటారు. కాని ఏ విధమైన వ్యాపారం? ఫైనాన్షియల్ మేనేజ్మెంట్, మార్కెటింగ్ మేనేజ్మెంటు, ఇంకా అనేక మేనేజ్ మెంట్లు చేస్తున్నారు. ఈనాటి మానవుడు లౌకికముగా, భౌతికముగా, వైజ్ఞానికముగా ఎంతో అభివృద్ధి గాంచాడు. కాని మానసిక పరిణామము లేకుండా ఎంత అభివృద్ధి చెందినప్పటికీ ప్రయోజనము లేదు. కనుక అన్ని మేనేజ్మెంట్ల కంటే Man Management అత్యవసరము. తనకు తాను సంపూర్ణముగా గుర్తించినప్పుడే అన్ని రంగములందు దానిని చక్కగా అర్థము చేసుకోగలడు. అందునా నీవు భారతీయుడవు. మన యొక్క తత్త్వము హిందూత్యము. అమెరికన్, రష్యన్, జర్మన్, జపాన్ ఇత్యాది వ్యాపారములందు అనేక విధములైన సమస్యలుంటున్నవి. ఇవన్నీ కేవలము ఇమిటేషన్, కాంపిటీషన్తో కూడుకొన్నవి. కాని ఒకానొక కంపెనీ చాలా అద్భుతమైన కంపెనీ, అపూర్వమైన కంపెనీ ఒక్కటి ఉన్నది. దానిని మనము గుర్తించినప్పుడు సర్వము గుర్తించిన వారమవుతాము. అదియే మానవుని లిమిటెడ్ కంపెనీ.
(శ్రీవ.1990 పు 16)