ప్రతి మానవుని యందునూ స్వర్ణం (Gold) ఉంటున్నది. లోహములన్నీ ఉంటున్నాయి. ఇవి బయట నుంచిరావు, అన్ని లోహములు దేహమునందే ఇమిడి వుంటున్నాయి. రసోవైస రసముతో కూడినటువంటిదే ఈ దేహము.ఈ లింగోద్భవం అనేటటువంటిది ప్రత్యేకంగా వచ్చినటువంటిది కాదు. భగవంతుడు హిరణ్యగర్చుడు. తన ఉదరమంతయూ హిరణ్యమయం. కాబట్టి ఈ రసమయమైనటువంటి హిరణ్యం తిరిగి... తిరిగి... రసమంతమా ఒక చోట చేరిపోతుంది. దానినే లింగము అన్నారు. లింగము అనగా చిహ్నం అని పేరు. ఒక గుర్తు" అని పేరు. దీనికి కన్ను, ముఖము, నోరు లేదు. ఏది తల? ఏవి కాళ్ళు? అని చెప్పడానికి కూడా వీలుకాదు. దీనికి ప్రత్యేకంగా ఆకారము లేదు. అదే లింగము" అన్నారు. లింగం అనగా "లీయతే, గమ్యతే ఇతి లింగ” అన్నారు. ఇదియే గమ్యం. ఇదియే లీనం. కనుకనే సర్వత్వమునకు లింగమే మూలకారణమన్నారు. ఈ లింగాకారం లోపల తయారై పోయి బహిరముఖంగా బయలుదేరుతుంది. ఇది బయటకు వచ్చేటప్పుడు కలిగే బాధలే, స్వామికి బాధ అని మీరు భావిస్తుంటారు. ఇది బాధ కాదు, మీకొక బోధ. తల్లి గర్భమున వున్న శిశువు బయటకు వచ్చేటప్పుడు తల్లి బాధపడుతుంది గదా! బాధపడుతూ, ఈ పాడుబడ్డ, నన్నింత బాధపెడుతుందా? అని ఏ తల్లి అయినా తిట్టుకుంటుందా? నా బిడ్డ సుక్షేమంగా వుండాలని కోరుకుంటుంది. అదే విధముగనే నా నుండి లింగం బయటకు వచ్చేటప్పుడు, ఎంత బాధ వుండినప్పటికీ, ఇది నాకు బాధ అని నేను భావించుకోను. ఇంతమందికి నేను బోధ గావిస్తున్నాననే ఆనందమే నాకు. Reflection, Reaction, Resound మాత్రమే. కనుక దైవత్వమునకు ఎట్టి బాధలూ వుండవు,ఎట్టి విచారములు వుండవు. ఎట్టి కష్టములు కలుగవు. అయితే స్వామికి ఇంత కష్టమా? ఇన్ని బాధలా? ఇన్ని నొప్పులా?" అని అనుకుంటారు. మానవులు. గత రెండు దినములుగాఈ లింగం తయారు కావటానికి నా శరీరమంతా మాగ్నెట్ గా తయారైపోయింది. అందువలన నా కాళ్ళు భూమికి కరచుకొని (అంటుకొని) పోతున్నాయి. ఆ కరచుకున్న కాళ్ళు ఎత్తడానికి కొంచెం కష్టమైపోతున్నది. ఎక్కడ నడిస్తే, అక్కడ కరచుకొని పోతున్నాయి. అది ఈ మాగ్నెట్ ప్రభావం. ఈ మాగ్నెట్ అందరియందూ వుంటుంది గాని ఈ విధంగా ఉండదు. కేవలం ఒక దివ్యత్వమునందు మాత్రమే ఈ మాగ్నెట్ ఇంత శక్తివంతంగా వుంటుంది. కనుక గత మూడు దినముల నుంచి కాళ్ళు నడవటానికి వీలులేకుండా పోయింది. ఆయితే అది నాకేమీ కష్టము కాదు. అది దాని సహజలక్షణం. ఎందుకంటే నా దేహమంతా మాగ్నెట్ మారిపోయింది. నేను టంబ్లర్ ను ముట్టుకుంటే టంబ్లర్ కూడా కరుచుకొనేది. ఇవన్నీ ఇతరులకు చెప్పేటటువంటివి కావు. ఇటువంటి దివ్యత్వమైన అయస్కాంతం ప్రతి మానవుని యందు ఉంటుంది. అయితే అది సామాన్య మానవునిలో పరిమితంగా వుంటుంది. దివ్యత్వమునకు పరిమితమే లేదు. మానవుని శక్తి పరిమితం, దైవశక్తి అపరిమితం. విస్మరించకండి.
(శ్రీ.ఏ. 2002 పు. 8/9)
(చూ॥ లింగము)