రామలక్ష్మణులు సీతాన్వేషణ సల్పుతూ సుగ్రీవుణ్ణ కలుసుకున్నారు. అప్పుడు సుగ్రీవుడు ఒక నగల మూటను తెచ్చి, "రామా ! కొద్ది రోజుల క్రిందట ఎవరో ఈ మూటను ఇక్కడ పడవేశారు. ఇందులో సీతమ్మవారి నగలేమైనా ఉన్నాయేమో చూడు" అన్నాడు. రామునికి తెలియదు పాపం ! అందుచేత "లక్ష్మణా ఇందులో మీ వదినగారి నగలేమైనా ఉన్నాయేమో, చూడు" అన్నాడు. లక్ష్మణుడు వాటిని చూసి, "అన్నా! ఈ కుండలాలు, కంకణాలు ఎవరివో నాకు తెలియదుగాని, ఈ కాలి అందెలు మాత్రం సీతమ్మవే" అన్నాడు. "ఇవి మాత్రం నీకెట్లా తెలుసు?" అని రాముడు అడుగగా, "ఆన్నా ప్రతి రో జూ నిద్ర లేచిన తక్షణమే సీతమ్మ పాదాలకు నమస్కారం చేసుకోవటం నా వాడుక. ఆ తల్లికి నమస్కారం చేసుకునే సమయంలో ఈ అందాలను చూశాను" అన్నాడు. అందుచేతనే, ఒకానొక సమయంలో రాముడు "ఈ ప్రపంచంలో వెతికితే నాకు సీతవంటి భార్య, కౌసల్యవంటి తల్లి అయినా లభించవచ్చుగాని, లక్ష్మణునివంటి సోదరుడు లభించడు. అలాంటి సోదరుడు ఉండటంచేతనే నేను రావణుని హతమార్చి సీతను అయోధ్యకు తేగలిగాను.ఇది నా శక్తి కాదు. లక్ష్మణుని యొక్క భక్తి ప్రపత్తుల శక్తియే" అన్నాడు.
పవిత్రమైన రామాయణమును ఎన్ని పర్యాయములు విన్నా తనివి తీరదు. ఇంకా వినాలనే ఆశ పుడుతుంది. భారతీయులు అనాది కాలము నుండి రామచరితమును స్మరిస్తూనే ఉన్నారు. అయితే, అందులో ఉన్న అమూల్యమైన విషయాలను గుర్తించి ఆచరణలో పెట్టటానికి ప్రయత్నించాలి. పితృవాక్య పరిపాలన చేయాలి. తల్లిదండ్రులను గౌరవించాలి. సోదరులలో ఐకమత్యం ఉండాలి. స్త్రీలను గౌరవించాలి. గుణసంపత్తిని అభివృద్ధి పర్చుకోవాలి. వీటిని మీరు ఆచరణలో పెట్టినప్పుడు ఇంక రామాయణమును చదువనక్కరలేదు. మీ జీవితమే రామాయణంగా రూపొందుతుంది.
(స.పా.మే.99పు 117/118)
లక్ష్మణుడు సీతారాములవెంట అరణ్యానికి వెళ్ళే సమయంలో అతని తల్లి సుమిత్ర, “లక్ష్మణా! నీవు అరణ్యానికి వెళుతున్నావని భావించవద్దు. సీతారాములు లేని ఈ అయోధ్యయే మాకు అరణ్యము. సీతారాములున్న ఆ అరణ్యమే నీకు అయోధ్య. కనుక, వారిని నీ. తల్లిదండ్రులుగా భావించి, సేవించు. వారికి ఎట్టి లోపమూ రాకుండా చూసుకో” అని కుమారుణ్ణి ఆశీర్వదించి చెప్పింది. ఆమె పేరే సుమిత్ర. అనగా, మంచి మిత్రురాలు. సుమిత్రవంటి తల్లులు, సీతవంటి భార్యలు, లక్ష్మణునివంటి సోదరులు ఈనాడు తయారు కావాలి. ఐకమత్యం అభివృద్ధి కావాలి. ఐకమత్యంవల్లనే జగత్తు సంరక్షింపబడుతుంది. (ది 25-3-99న సాయిరమేశ్ హాల్, బృందావనంలో శ్రీవారు అనుగ్రహించిన దివ్యసందేశము నుండి) (శ్రీ వాణి ఏ ప్రియల్ 2022 పు 8)