(శ్రీవారు హిరణ్య గర్భ లింగమును భక్తులకు చూపిస్తూ), ఈ హిరణ్యస్వరూపం కేవలం ఈ దేహంలో మాత్రమే కాక ప్రతి ఒక్కరి హృదయమునందూ ఉన్నది. ఇది ప్రతి ఒక్కరి కుడిభాగమునందున్నది. అయితే ఇది ఈ దేహమంతా వ్యాపించి ఉంది; నేను సంకల్పించినప్పుడు ఒక స్వరూపాన్ని ధరిస్తుంది. ఇది ఆవిర్భావమయ్యే సమయంలో ఎవరు చూశారో వారికి ఇక జన్మ లేదు. వచ్చే సమయంలో దీని ఆకారం చూడాలి. మీ జీవితాలను పావనం గావించే నిమిత్తమే ఇలాంటి పవిత్రమైన దర్శవమును నేను అప్పుడప్పుడు అను గ్రహించవలసి వస్తుంది. దీనివల్ల మానవత్వంలోని దివ్యత్యం మీకు అర్థమవుతుంది. ఈ హిరణ్యగర్భ లింగం ఎక్కడ వేసినా పగిలేది కాదు. చూడండి పగలదు (హిరణ్యగర్భ లింగమును మూడు పర్యాయములు గట్టిగా క్రిందికి కొట్టి చూపించారు). ఇది ఎక్కడ వేసినా పగలదు. ఏ విధంగాను మారదు. సామాన్యమైన బంగారమైతే క్రిందికి విసిరి కొడితే ముక్కలవుతుందిగాని, ఇది ఎక్కడ కొట్టినా పగలదు. ఇదే అమృతత్వము. ఇలాంటి దివ్యత్వము జగత్తులో ఎక్కడా కానరాదు: ఇది ఒక్క దైవం దగ్గర మాత్రమే నిరూపణ అవుతుంది.
మీ చింతలెల్ల బాపుకొని మనరాదా
శివమెత్తి జగమంత తిరిగేవు
ఓ చిత్తమా, నీకెంత సిగ్గు లేదె
అవని సుఖంబుల కల్లాడెడి
మీకావలికి మిగిలే దదియేది?
గడచిన 22 సంవత్సరముల నుండి లింగోద్భవమును చూపించలేదు. కారణమేమనగా, పూర్ణచంద్రహాలు చాల చిన్నదిగా ఉన్నది. లింగోద్భవమును దర్శించాలని లక్షలాది మంది జనులు వచ్చేవారు. ఒకరి నొకరు నెట్టుకోవడంచేత తొక్కిసలాట జరిగేది. అందువల్ల, భక్తులకు ఏమాత్రము ఇబ్బంది కల్గించ కూడదనిలింగోద్భవమును చూపించడం మానివేశాను. ఇంతేకాదు,మూడు రకములైన లింగములు ఆవిర్భవిస్తాయి - "భూర్ భువస్సువః" భూర్ - అవగా మెటీరీయలైజేషన్ (దేహము): భువః - అనగా, వైబ్రేషన్ (ప్రాణము): సువః - అనగా, రేడియేషన్ (ఆత్మ). ప్రతి శివరాత్రినాడు మూడూ ఆవిర్భవించేవి. ఇప్పుడు కూడా మళ్ళీ ప్రారంభమైందిగాని, నేను అణగదొక్కాను. ఎందుకంటే, దీని విషయం మీకు ఇంకా చెప్పాలి. ముందు ముందు దీని స్వరూపాన్ని మీరు చక్కగా చూడగలరు. ఒక్క దైవత్వము దగ్గర తప్ప ఇంకెక్కడా ఈ ఆనందము ప్రాప్తించదని తెలుసుకోవాలి మీరు. ఏదో నేను మీవలె నడుస్తున్నాను. మీ వలె మాట్లాడుతున్నాను. నవ్వుతున్నాము. మీవలె తింటున్నాను, తిరుగుతున్నాను అని ఈ దేహాన్ని మాత్రమే ఆధారం చేసుకోకండి. నేను ఏది చేసినా నిస్స్వార్థమే, నిస్స్వార్థమే. ఒక వెంట్రుక మందమైనా నాలో స్వార్థం లేదు. అంతా పరార్ధమే, పరార్థమే. ఈ సత్యాన్ని మీరు దృఢంగా విశ్వసించండి. మీలో దృఢమైన విశ్వాసమే ఉంటే, మీరు అడుగనక్కరలేదు. ఎక్కడున్నా మీ అభీష్టములు నెరవేరుతూనే ఉంటాయి. సంపూర్ణ విశ్వాసం లేనివారికే కష్టములు, నష్టములు కలుతుంటాయి. కనుక మొట్టమొదట ఆత్మవిశ్వాసాన్ని పెంచుకోండి. ఇదే మీరు చేయవలసిన సాధన.
నిజంగా మీరెంతో అదృష్టవంతులు. ఈనాడు సోమవారము. ఇది సోమశేఖరుని యొక్క స్వరూపమే. ఈశ్వరునికి సోమవారం చాల ముఖ్యం. కనుకనే, ఈశ్వరుణ్ణి సోమేశ్వరా! సోమేశేఖరా!" అని వర్ణిస్తారు. ఈ దేహము పుట్టినది కూడా సోమవారమే. శివాలయంలో సోమవారంనాడు ప్రత్యేకమైన ఆరాధన సల్పుతుంటారు. సోమవారం తరువాత మంగళవారం వస్తుంది. మంగళవారంనాడు హనుమంతుణ్ణి పూజిస్తుంటారు. యుద్ధంలో రాముడు విజయం సాధించిన తరువాత హనుమంతుడు సీతవద్దకు పరుగెత్తుకొని వెళ్ళి "తల్లీ! రాముడు విజయం సాధించాడు. రావణుడు మరణించాడు"అని చెప్పాడు. ఈ ఆనందవార్త విన్న తక్షణమే సీత "హనుమంతా! ఈనాడు ఏ దినమో నాకు తెలియదుగాని, నీవు నాకు మంగళకరమైన వార్తను వినిపించావు కాబట్టి, ఈనాడు మంగళవారంగా పరిగణింపబడు గాక! ఈనాడు నీ పూజ జరుగు గాక" అని ఆశ్వీరదించింది. ఆనాడుత్రేతాయుగంలో సోమవారం, మంగళవారం - ఇలాంటివేమీ లేవు. ఈ వారాలు ఇప్పుడిప్పుడు వచ్చినవే. మన భారతీయ కల్చర్ (సంస్కృతి) ఎంతో అంతరార్థం కలిగినది. కానీ ఈనాడు భారతీయులే భారతీయ కల్చరు తెలుసుకోవడం లేదు. ఈ కల్చర్‌ను తెలుసుకోలేనివారే దీనికి అనేక పెడార్థములను కల్పించుకొని, ఆనర్థములలో మునిగిపోతున్నారు. మనకు కల్చరే ప్రధానంగాని క్యాస్ట్ (కులం) కాదు. క్యాస్ట్ మారినా, పోయినా పరవాలేదుగాని, కల్చర్‌ను లక్ష్యంలో పెట్టుకోవాలి.
(స. సా.మా.99పు.72/73)