హిరణ్యకశిపుడు గొప్ప సైంటిస్టు. పంచ భూతములను అన్ని విధముల పరిశీలించినాడు. అంతేకాదు-ప్రకృతి వైపరీత్యములకు కారణం ఏమిటి? ఈ ప్రకృతి ఏ విధంగా నడుస్తుంది? అనే మూల సూత్రములను గుర్తించటానికి ప్రయత్నించినవాడు. ఈ నాటి ప్రపచంము ఋతువులు రాత్రింబవళ్ళు ఏ విధంగా సంభవిస్తున్నవనే రహస్యములు గుర్తించటానికి సూర్యమండలం వెళ్ళటానికి ప్రయత్నించాడు. ధ్రువనక్షత్రమునకు అతి సమీపమునందే (23.5°) భూమి వాలిందని చూచాడు. ఆ విధముగా వాలటంచేత రాత్రింబవళ్ళు జరుగుతున్నవి. అనేక సంపదలు ఉద్భవిస్తున్నాయి. జీవరాసులు పోషింప బడుతున్నాయి, అని తెలుసుకొని సంతోషించాడు. ఇంకా కొంచెం వాలిన ఏమి జరుగనోయని మరింత వంచటానికి ప్రయత్నించాడు. కానీ ప్రళయం సంభవిస్తూ వచ్చింది. అది చాలా ప్రమాదమని దానిని విరమించుకున్నాడు. సూర్యాచంద్రాదులను వశము గావించుకున్నాను. భగవంతునికి ఏ శక్తులు లేవు. సర్వ శక్తులునాయందే ఉంటున్నది. సర్వము జయించానని చెప్పేటప్పటికి ప్రహ్లాదుడు ఫక్కున నవ్వాడు. నాన్నా! అన్ని జయించావు గాని ఇంద్రియములను జయించలేక పోతున్నావు. ఇంద్రియములను జయించలేనివాడవు బయటి ప్రపంచమును జయించటమేమిటి?
లోని శత్రువులకు లొంగిపోయినవాడు
బయటి రిపులనెట్లు పట్టగలడు?...
నీలోనున్న ఇంద్రియములనే సాధించలేనివాడపు బయటి శక్తులను ఏవిధంగా సాధించగలవు? నాన్నా! ఇది కేవలము అహంకారముతో పలికే పలుకులు. మొట్టమొదట నాన్నా నీ అహంకారమును నిర్మూలము చేసుకో. దైవము పైన ప్రేమను పెంచుకో, నీ జీవితమే కాదు, నీ రాజ్యమేకాదు, నీ సంపదలన్నీ అభివృద్ధి అవుతాయి.
(భ.మ.పు.125/126)
(చూ|| కామక్రోధలోభములు, బుద్ధిదోషము, భావములు, మంచతనము.)