ఓంకారమనేది దివ్యమైన ప్రథమ శబ్దము. అకార, ఉకార, మకారముల చేరికనే ఓంకారము. అకారమే లక్ష్మణుడని, ఉకారమే భరతుడని, మకారమే శత్రుఘ్నుడని ఈ మూడు శబ్దములు చేరిన ఓంకారమే రాముడని నిరూపిస్తూ. వచ్చింది. రామా అనేది ఆత్మకే సంబంధించిన నామము కాని అన్యమునకు సంబంధించినది కాదు. ఆత్మారామ అనేది భారతీయులు నిరంతరము ఉచ్చరిస్తూ ఉంటారు. రమింపచేసేది కనుకనే దీనికి రామ అని పేరు. దీనికి సంఖ్యాశాస్త్రమునందు ప్రత్యేకమైన అర్థమున్నది. నామ అనేది రెండక్షరములు కాదు. మూడక్షరములు, న. అ. మ= నామ. గణితశాస్త్రమునందు అనగా సాంఖ్య యోగమునందు దీనికి అక్షరశాస్త్రమని నిరూపిస్తూ వచ్చారు. న =0), అ=2, మ=5, న +అ+మ, 0+2+3=7 దీనినే సప్తస్వరములుగా భావిస్తూ వచ్చారు. దీనిని సంగీత శాస్త్రమునకు ఆధారముగా తీసుకుంటూ వచ్చారు. అదే స,రి,గ,మ,ప,ద, ని, ఏడు శబ్దములు. దీనిని ఆధారము చేసుకొని సప్తసముద్రములు సప్తనాళములు, సప్తఋషులు అని ఈ విధంగా సప్తదినములని, సప్తాహమని యజ్ఞమును ప్రారంభిస్తూ వచ్చారు. భగవన్నామమునుగూర్చి ఎంతైన చెప్పడానికి వీలుంటుండాది. జగత్తంతా భగవన్నామములో నిండి ఉన్నటువంటిదే. అంతయు శబ్దరూపమైన తత్త్వమే. ఆలాంటి శబ్దరూపమైన భగవత్స్వరూపాన్ని మనం ఈనాడు గుర్తించుకోలేక పోతున్నాము. భగవన్నామమును ఉచ్చరించాలంటే ఏదో అలక్ష్యంగా మనం కాలమును వ్యర్థం చేస్తున్నాము. సంకీర్తన మనేది జీవితమునకు ఆధారమైన నాదము. మన దేహమునకు వెన్నెముక ఎట్టి ఆధారమో జీవితమునకు నాదము అట్టి ఆధారము. ప్రతి శబ్దము భగవన్నామముతో కూడినదే. మన ఉచ్చ్వాసనిశ్వా సములు కూడను భగవన్నామముతో కూడినవే. సోఽహం సోఽహం అదీ భగవన్నామమే. అదే దైవత్వమునకు మూలాధారము. మానవ జీవితమంతయు దైవ శబ్దములచే ఆధారపడి ఉంటుండాది. ఐతే ఈనాటి మానవులు అనేక విధములైన మార్గములను అనుసరించి అనేక విధముగా స్మరిస్తూ వస్తున్నారు.(శ్రీస.వి.వా. పు.70/71)
"ఓం" కారము "అ" కార, "ఉ" కార, "మ" కారముల సమ్మేళనము. "అ" కార శబ్దము కంఠము నుండి మృదువుగా మొదలగును. అది ధరిత్రి. "ఉ " కారము నోటినుండి ఉచ్ఛస్వరములో వెలువడును. "మ"కారముతగ్గు స్వరములో పెదిమల నుండి వెలువడును. ప్రణవనాదములోని హెచ్చుతగ్గులను విమాన శబ్దముతో పోల్చ వచ్చును. మొదట సుదూరములో నున్న విమాన శబ్దము వలె, విమానము సమీపించు కొలది హెచ్చు శబ్ద తీవ్రత వలె, మరల విమానము దూరమగు కొలది శబ్ద తీవ్రత క్రమముగా సన్నగిల్లునట్లు ఉండును. "అ" కారము ప్రపంచము. "ఉ" కారము స్వర్గము. "మ" కారము ఇంద్రియాతీతమైన దివ్యత్వము.
ఓం కారమును ప్రేమతో పలికినట్లయిన కచ్చితమైన ఉచ్చారణ అంత ముఖ్యము కాదు. తల్లికి, శిశువుకు మధ్య ఉన్నది ప్రేమ బంధము. శిశువు ఏడ్వ మొదలిడిన, ఆ ఏడ్పు శ్రుతి సరిగా ఉన్నదా, లేదా యనే చింత తల్లికి ఉండదు. వెనువెంటనే శిశువు వద్దకు పరుగున వెళ్ళి అక్కున చేర్చుకొనును. దివ్యమాత అన్ని ప్రదేశములలోనూ కలదు. స్వామి ఇక్కడ ఉన్నారు. కానీ, దివ్యమాత ఎల్లెడలా కలదు. కాబట్టి, ప్రతి ఒక్కరికి అవకాశమున్నది. ఒక వ్యక్తిలో భగవంతుని కొరకై ఆవేదన ప్రారంభమయిన వెంటనే అనుగ్రహముతో ప్రతిస్పందించుటకు దివ్యమాత కలదు. ఈ విషయములన్నిటిలో ప్రేమ అత్యావశ్యకమైనది. భగవంతుని ప్రేమించుటయే భగవంతుని పట్ల భక్తిని ప్రదర్శించుట. ఇక యథార్థమైన ప్రణవ నాదము సహజ సిద్ధమైనది; అది నాశికారంధ్రముల ద్వారా ప్రవేశించి ఫాల భాగములో కేంద్ర స్థానమును చేరి చెవుల ద్వారా ప్రపంచములోకి వచ్చును. రేడియో కేంద్రము నుండి వచ్చు ప్రసారము వలె.(ప. పు. 176/177)
21 పర్యాయములు ఎందుకు ఓంకారము చెయ్యాలి. మనయొక్క జీవితము 21 తత్త్వములతో కూడినటువంటిది. కర్మేంద్రియములు ఐదు. జ్ఞానేంద్రియములు ఐదు. పంచ ప్రాణములు, పంచకోశములు ఈ 20 తత్త్యములతో మనదేహము మిశ్రమమై ఉంటుండాది. దాని పైన జీవతత్త్యము అనేటువంటిది సవారి చేస్తుండాలి. అనగా ఈ 20 గుఱ్ఱాల పైన జీవి అనేటటువంటి రథసారధి గుఱ్ఱాలను నడుపుతూ వస్తున్నాడు. కనుక ఈ జీవ తత్త్వమును పరమ తత్యానికి మరలింపజేసే నిమిత్తమై, ఈ జీవతత్వములన్నిటిని కూడను శబ్దస్వరూపంగా మార్చుకుని తద్వారా జీవతత్త్వమును పరతత్త్వము లోపల ప్రవేశింప జేసుకునే నిమిత్తమై 21 పర్యాయములు మనం ఓంకారము చేయటం. కట్టకడపటికి శాంతి శాంతి శ్శాంతి: అంటున్నాము. అవి మీరు వ్రాయలేదు. మూడు పర్యాయములే మనము శాంతి ఎందుకు చెయ్యాలి? నాలుగు పర్యాయములు ఎందుకు చేయకూడదు? లేక ఒకే పర్యాయము శాంతి ఎందుకు చెప్పకూడదు? ఈ కర్మేంద్రియ, జ్ఞానేంద్రియ, పంచకోశ, పంచ ప్రాణములలోను ఈ శబ్దము మిళితం చేసి ఆ శబ్దం పైననే Concentration చేసినప్పుడు అవి కూడను కొంత తర్ఫీదైపోయి. తద్వారా మన సాధనకు కొంత సహాయకారులుగా ఉంటాయి. జీవతత్యాన్ని పవిత్రం గావించుకునే అంతరార్థం కూడను యిందులో ఉంటుండాది. Work will be transformed into worship. మన ఇంద్రియములు మన కర్మలన్నీ భగవంతుని వైపున మరల్చే నిమిత్తము ఆచరించే ఉపాధి యొక్క తత్త్యము ఈ ఓంకారము. దీని తరువాత శాంతి శ్శాంతి శాంతిః(భ. స..బా.గు. శి.బృపు. 53/54)
ఓంకారము మూడు పర్యాయములే ఎందుకు చెప్పాలి? శ్శాం తి: శ్శాంతి శ్శాంతి: అని మూడు పర్యాయములే ఎందుకు చెబుతారు? రెండు లేక నాలుగు పర్యాయములు ఎందుకు చెప్పుటలేదు? అనే సందేహం చాలామందికి సహజంగా వస్తుంటుంది. ‘ప్రణవము ఆధారశబ్దం. సర్వశబ్దములకు మూలాధారము. ప్రణవంలేని మంత్రం మందులేని తుపాకి వంటిది. దేహముగన్ను, ఓం బుల్లెట్. మూడు పర్యాయాలెందు కంటే - ఆది భౌతిక, ఆధిదైవిక, ఆధ్యాత్మిక శాంతి నిమిత్తం. దేహశాంతి, మానసిక శాంతి, ఆత్మశాంతి నిమిత్తం. ఆత్మశాంతిలేనిదే, దేహశాంతి ఉండి లాభం లేదు. నీవనుకునే నీవు. ఇతరులనుకునే నీవు, నీవైన నీవు. (The one you think you are, The one others think you are, The one you really are) నీవనుకునే నీవు దేహం - ఆది భౌతికం. ఇతరులనుకునే నీవు - ఇది మానసికం. ఆది దైవికం. నీ వైన నీవు నీ ఆత్మస్వరూపం. ఇది ఆధ్మాత్మికం. ఈ మూడు స్థితులలోనూ శాంతి కావాలని మూడుసార్లు శాంతి పాఠం చెబుతున్నాం. త్రికాల త్రిమూర్తులవలె మూడు స్థానాలలో ఓంకారము నిలిచి ఉంటుంది. త్రికాలముల పవిత్రతను, త్రిలోకముల దివ్యత్వమును ఉచ్చరించడానికి ప్రణవం చేర్చాలి. ప్రణవం పవిత్ర జ్యోతివంటిది. దీనిని శ్రద్దావిశ్వాసాలతో చేయడం ముఖ్యం.(శ్రీన.2000 పు.65)
శబ్దము ప్రతిచోట వ్యాపించి వున్నది. అన్ని శబ్దములు ఒక దానిలో ఒకటి కొన్ని చోట్ల కలుసుకుంటాయి. పురాతనమయినటువంటి (ప్రథమ) తొలి శబ్దము ఓంకారము. మిగిలిన అన్ని శబ్దములు ఆ ప్రథమ శబ్దము నుండి వేరైన వికారములు. శబ్దము మూడు విభిన్న ప్రకృతులలో వుంటుంది. ఈ మూడు ఏకత్వంలో విలీనమైపోతాయి. ఈ మూడు దశలు.:-.
1. సృష్టి 2. స్థితి 3. లయ’
1.సృష్టించుట, కాపాడుట, నశింపచేయుట
ఈ మూడు బ్రహ్మ, విష్ణు, మహేశ్వరుల కార్యములను తెలుపుతాయి. ఈ మూడు ఆకార ఉకార మకారములను శబ్దములలో యిమిడినవి. ఈ మూడు శబ్దముల ఐక్యతే ఓంకారము. ఆకార శబ్దము కంఠము నుండి తగ్గు స్వరములో మొదలు పెడుతుంది. ఉకారము నాలుక నుండి మొదలు పెట్టి క్రమముగా ఎక్కువ అవుతుంది. మకార శబ్దము పెదవుల నుండి మొదలయి నెమ్మదిగా తగ్గిపోతుంది. మనము ఉచ్చరించునపుడు ఆకారము దూరమున ఉన్న విమాన శబ్దము ఉకారము దగ్గరకు వస్తున్న విమాన శబ్దము. మకారము తిరిగి దూరముగా వెళుతున్న విమాన శబ్దమువలే ఉంటుంది. ఈ మూడు శబ్దములు ఒక దానితో ఒకటి కలిసినపుడు ఒకే శబ్దమయిన ఓంకారము నాభి స్థానము నుండి వస్తుంది. మనము ఓంకారము -21 సార్లు ఉచ్చరిస్తాము. ఎందుకంటే మన శరీరము "21" తత్వములతో చేరినటువంటిది. అవి"5"జ్ఞానేంద్రియములు"5"కర్మేంద్రియములు, పంచ ప్రాణాలు, పంచకోశములుఇవి"20" మనస్సుతో చేరి21 తత్వములతో మన జీవితము ఏర్పడినది. చివర మనము 3 సార్లు శాంతి అని చెప్తాము.
1. ఆది భౌతిక (ఆత్మ)
2. ఆధి దైవిక (మనస్సు)
3. ఆధ్యాత్మిక (ఆత్మ)
శాంతి ఇవ్వమని ప్రార్థిస్తాము.
(శ్రీ స.ప్ర.పు.32/33)