అధర్వ వేదమునకు అనేక పేర్లు ఉన్నవి. అంగిరోవేదము, అధర్వాంగిరోవేదము. భృంగిరోవేదము, క్షత్రవేదము, బైషజ్య వేదము అని ప్రసిద్ధం.
కాళిదాసు వశిష్ఠుల వారిని అధర్వనిధి అని కీర్తించినాడు. అట్లు కీర్తించుట ద్వారా ఋగ్వేద యజుః సామవిదుడే కాక అధర్వ వేదాభిజ్జ్ఞడు కూడ నగువాడే పౌరోహిత్య కుశలుడు. కర్మ నిర్వహణ సమర్ధుడు, రాజగురు పదమునకు అర్హుడు అని తెలియజెప్పెను..
అధర్వ మంత్రములకు సిద్ధమంత్రములని ప్రసిద్ధి. గాయత్రి దేవికి ఋగ్యజుస్సా మములు పాదములు, మీమాంసా శాస్త్రము తటస్థ లక్షణము. అధర్వవేదము చేష్ట అని
అర్థము .
అధర్వము ఒక వృక్షము వంటిది. ఋగ్వేద, యజుర్వేద, సామవేదాలు స్కంద శాఖలు, స్మృతి పురాణములు వర్ణములు. ఒక ఆదిత్యుడు యజుర్వేదమున యజా: అనియు, సామవేదమున సామ అనియు, ఋగ్వేదమున ఊర్ధ్వమనియు, అధర్వవేదమున యాతు:
అనియు ఉపాసింపబడుచున్నాడు.
అధర్వుడనగా నిశ్చలుడు లేక స్థిర ప్రకృతి కలవాడు అని అర్థము. అధర్వమునకు ప్రాణాత్మ లేక ప్రజాపతి అని వేద ప్రసిద్ధము. ప్రాణాత్మ అగు ప్రజాపతి అధర్వుడని కీర్తింపబడినాడు. ఈ ప్రజాపతియే మొదటి అగ్నిని మధించెను. ప్రతి వేదమంత్రమునకు ఆదియందును అంత్యమందును ఉచ్చరింపబడే ప్రణవము అభివ్యక్తము చేయునది అధర్వ వేదము.
యాతో రుద్ర శివాతనొరఘోర పాప నాశిని అని పరమేశ్వరునకు శాంతము, ఘోరము అని రెండు రూపములున్న ట్లు తెలిపెను.
ఉదాహరణ! స్తంభమునుండి వెడలి ప్రత్యక్షమైన నరసింహుని రూపము భక్తాగ్రేసరుడగు ప్రహ్లాదునకు శాంతరూపమున అఘోర రూపమున సాక్షాత్కరించెను.ప్రబల ద్వేషియైన హిరణ్య కశిపునకు ఘోర రూపమున గన్ప ట్టినట్లు ప్రసిద్ధి కదా!
పరమేశ్వరుని శక్తి రూపమగు ప్రకృతియు, శాంత, ఘోర రూపము జీవులకు ఉపభోగ్యమైన జలము జీవన హేతు వగునపుడు భేషజమగును. అదియే మృత్యు హేతు వగునప్పుడు ఘోరము అగును.
సర్వ ప్రాణులకు జీవన హేతువు అన్నము. అది శాస్త్రము ఉపదేశించినటుల సాత్విక, రాజసిక, తామసి కాద్య ఘోర భేదములను గుర్తించి పరిమితముగా సేవించినచో అది జీవన హేతువు, సుఖప్రదమగు భేషణమగును. అట్లుగాక అధికంగా సేవించునపుడు వ్యాధి హేతువై అది దుఃఖ ప్రదమగును. ఘోర రూపమగును.
దీనినే అన్న శబ్ద నిర్వచనము ద్వారా శ్రుతి వివరించింది. అద్ (తినుట) అను ధాతువు నుండి అన్న శబ్దము నిష్పన్నమైనది. తినబడున ది (అద్యతే) కావున అన్నము. తినునది (అత్తి) కావున అన్నము అని అర్థము. అన్నమునకు గల శాంత ఘోర రూపములను సంరక్షింపచేయుట శాంత ఘోర రూపములగును. అధర్వాంగిరో మంత్రముల దర్శించిన ఋషులే అధర్వాంగీరసులు దృష్టి భేదములేక అధికార భేదముల ననుసరించి శాంత, ఘోర రూపములుగా భిన్నముగా కన్పట్టినను మొత్తం మీద - పరమార్థమున ఈ మంత్రములన్నియు ఆత్మవిచికిత్స కొరకే, లోకకళ్యాణమునకే యేర్పడినవి. ,
(లీ.వా.పు 24, 25)
జపాన్ వారు, జర్మనీ వారు ఈనాడు అధర్వణ వేదమును అనేక విధములుగ పరిశోధిస్తూ ఉన్నారు. గొప్ప సైంటిస్టు అయిన విశ్వామిత్రుడు గాయత్రి మంత్రమును ఈ వేదము నుండియే ఆవిర్భవింపవేశాడు. ఇంతే గాకుండా ఆదిత్య తేజస్సును పరిశోధించి, గొప్ప అస్త్ర శస్త్రములను కనిపెట్టారు. ఇది ఎన్నో వేల సంవత్సరములకు పూర్వం జరిగినటువంటిది. కనుక భారతీయులు విజ్ఞాన శాస్త్రము నందు వెనుకబడిన వారు కాదు. భారతీయులు శోధించి సాధించి విడిచి పెట్టిన దానినే. ఈనాడు విదేశీయులు ఆధారంగా చేసుకుంటున్నారు. ఇంత మాత్రమే కాదు. గణితశాస్త్రము కూడా భారతదేశం నుండి వచ్చినదే. ఇంక వైద్య శాస్త్రంలో ఈనాటి శస్త్ర చికిత్సలను భారద్వాజ మహర్షి ఆనాడే కని పెట్టాడు ధర్మశాస్త్రమును మనుచక్రవర్తి వ్రాశాడు. న్యాయ శాస్త్రమును గౌతముడు, అర్థశాస్త్రమును చాణక్యుడు వ్రాశారు. ఈనాడు చాణక్యుని అర్థశాస్త్రాన్ని అనుసరించకపోవడం చేతనే దేశం ఇన్ని అవస్థలకు గురి అవుతున్నది. ఈ విధంగా విచారణ చేస్తే అన్నింటిలోను భారతదేశమే ముందంజ వేసిందని స్పష్టమవుతుంది. కాని, దురదృష్టవశాత్తు భారతీయులలో ఐకమత్యం లేక పోవడం చేతను, అసూయ పెరిగి పోవడం చేతను దీనిని సరియైన రీతిలో ప్రచార ప్రబోధలు సలుపలేక పోయారు.
(దే.యు. పు.54/55)