ఆనాడు బస్సులు, కార్లు, ఏరోప్లేన్లు లేవు కదా! శంకరులవారు కాలినడకన యావద్భారత దేశంలో కాశ్మీరు మొదలుకొని కన్యాకుమారి వరకు పర్యటించి ఆద్వైత సిద్ధాంతమును ప్రబోధించాడు. "ఏకమేవాద్వితీయం బ్రహ్మ" - "ఉన్నది ఒక్కటే, రెండు కాదు. చెఱకులోని రసమువలె భగవంతుడు అందరియందు రసస్వరూపుడై ఉంటున్నాడు. కాని మీరు కేవలం రూపనామములను ఆధారం చేసుకోవడంచేత భిన్నత్వాన్ని భ్రమిస్తున్నారు. బంగారము లేక నగలు లేవు. మట్టి లేక కుండలు లేవు. అట్లే ఈ జగత్తులోని రూపనామము లన్నింటికి మూలాధారమైన దివ్యత్వం ఒక్కటే" అని పండితులతొ వాదించి ఒప్పించాడు. మండనమిశ్రుని కర్మ సిద్ధాంతమును ఖండించి అతనిని అద్వైత సిద్ధాంతములో ప్రవేశ పెట్టాడు. క్రమేణ శంకరులవారి అద్వైత సిద్ధాంతమును అందరూ అంగీకరిస్తూ వచ్చారు. కాని 32వ ఏటనే శంకరులవారు తన శరీరాన్ని త్యజించాడు. కారణమేమిటి? తాను వచ్చిన పని అయిపోయింది గనుక, శరీరాన్ని వదిలే ముందు పూరీ. ద్వారక, కంచి, శృంగేరి, బెనారస్ క్షేత్రాలలో ఐదులింగమును పెట్టాడు. మండన మిత్రునికి సురేశుడని పేరు పెట్టి అతనిని కంచి పీఠాధిపతిగా చేశాడు. విద్యారణ్యులవారు కూడా శంకరుని శిష్యులే.. శంకరులవారు అద్వైతమతమును స్థాపించి, లోకంలో అల్లర్లను చల్లార్చి, ద్వేషాన్ని నిర్మూలించి ఏకాత్మభావముచేత ఆనందమును అభివృద్ధి పర్చడానికి కృషి చేశాడు. కాని తరువాత ఆయన శిష్యులలో ఏమాత్రము ఐకమత్యము లేకుండా పోయింది. శంకరులు చెప్పిన దానినే తాము వ్రాసినట్లుగా వ్రాసుకొని పేరు ప్రతిష్ఠల నిమిత్తమై అనేక పాట్లు పడుతూ వచ్చారు. ఒకరు చెప్పినది ఇంకొకరు అంగీకరించలేదు. క్రిష్టియన్ మతములో కూడా ఇంతే! జీసస్ పోతూనే అతని పదకొండుమంది శిష్యులలో భేదాభిప్రాయములు బయలుదేరాయి. ఒక్క మేథ్యూ మాత్రమే జీసస్ చెప్పినవి ప్రచారం చేస్తూ వచ్చాడు.
మొట్టమొదట జీసస్ శిష్యునిగా చేరిన పీటర్ కూడా అధికారులు తనను పట్టుకోవడానికి వచ్చేసరికి, "నేను క్రీస్తుఫాలోయర్ ను కాదు" అన్నాడు. ఈ విధంగా శిష్యులలో స్వార్థస్వప్రయోజనాకాంక్ష బయలు దేరడంచేత వారి ఉపదేశములన్ని ఛిన్నాభిన్నముగా మారిపోయాయి.
(స.పా.జులై 96. పు.172/173)
(చూ త్రిమత స్థాపకులు)