జ్యోతికి ప్రమిద నూనె వత్తి అగ్గిపెట్టె అవసరమైనట్లే అంతర్ట్యోతిని వెలిగించుటకు వైరాగ్య మనే ప్రమిద, భక్తి అనే తైలము, చిత్తైకాగ్రత అనే వత్తి తత్వజ్ఞానమనే అగ్గి పెట్టి కావాలి. ఈ నాల్గింటిలో ఏ ఒక శక్తిని కోల్పోయినను ఆత్మజ్యోతిని వెలిగించుకోలేము. పరమాత్మతత్వం ఎక్కడున్న దనగా అశాంతి లోనే ఉన్నది; అజ్ఞానమునందే ఉన్నది; అశాంతిలో ప్రశాంతి, ప్రశాంతిలో ప్రకాంతి. ప్రకాంతిలో పరంజ్యోతి. పరంజ్యోతియే పరమాత్మ స్వరూపము. అజ్ఞానము ప్రత్యేకంగా ఉండేది కాదు. జ్ఞానము అభావమే అజ్ఞానము. వెలుతురు అభావమే చీకటి. రెండింటియందున్న ఏకత్వాన్ని గుర్తించి వర్తించడమే మన ప్రధానకర్తవ్యము.
(స.సా. 87 పు.210)