ఈనాటి మానవుడు "అందరినీ ప్రేమిస్తున్నాను" అని పలుకులలో ఉచ్చరిస్తుంటాడు. కానీ, నిజంగా ప్రేమ అంటే ఏమిటో అర్థం చేసుకోవటం లేదు. మా పిల్లలు కూడా స్వామికి వ్రాస్తుంటారు - 1 Love You… l love you."అని. కాని, ఏమిటీ ప్రేమ? తెల్లవారినది మొదలు రాత్రి వరకు కనిపించే ప్రక్కింటి వానిని ప్రేమించకుండా, కనిపించని భగవంతుని ప్రేమిస్తున్నామంటే-ఇది ఏమైనా నమ్మదగిన విషయమేనా? కంటికి కనిపించే వ్యక్తులనే నీవు ప్రేమించటం లేదు. వ్యక్తిని ప్రేమించి నప్పుడే శక్తిని ప్రేమించిన వాడవవుతావు. అందరి యందు అంతర్భూతముగా ఉన్నది దివ్యత్వ మొక్కటే? పరిపూర్ణమైన దివ్యత్వాన్ని గుర్తించాలంటే, అనుభవించా లంటే, మీరు కూడా పరిపూర్ణ హృదయులు కావాలి. అదే నిజమైన భక్తి ప్రపత్తుల యొక్క ప్రభావము. కాని, ఈనాడు మన భక్తి పరిపూర్ణంగా లేదు. ఐతే ఏ విధంగా ఉంది? ఏదో కొంత కొరత కలిగియున్నది. "C" అనే అక్షరం మాదిరిగా ఒకచోట ప్రారంభమై మరొక చోట నిలిచిపోతున్నది. మధ్యలో పెద్ద అగాధమైన, అర్థరహితమైన లోయ ఉంటున్నది. కనుకనే, పరిపూర్ణము కానిదానికి ఫలితంగా పరిపూర్ణంగా ఉండదు. పరిపూర్ణహృదయులకు ఫలితం పరిపూర్ణంగానే ఉంటుంది. పరిపూర్ణ హృదయంలో ఆఫీసులో "Day and Night పని చేసే వారికి నెలసరి జీతం ఇస్తారు; వారికి Pension కూడా ఇస్తారు; వారికి Dearness allowance కూడా ఇస్తారు కాని, Part time భక్తులకు, Part time workers కు పూర్తి జీతం రాదు; ఇంత మాత్రమే కాదు. వారికి Pension ఇవ్వరు; Dearness allowance కూడా ఇవ్వరు. అనగా పూర్ణమైన హృదయము కలవారికే భగవదనుగ్రహము పరిపూర్ణంగా ఉంటుంది.
(శ్రీ..భ.ఉ.పు.151)