యంత్రము దేహము, మంత్రము శ్వాసము, తంత్రము హృదయము. యంత్ర మంత్ర తంత్రముల సమ్మిళిత స్వరూపమే మానవత్వము. ఈనాడు పరదేశీయుల పరిపాలననుండి మాత్రమే మనము విముక్తిని పొందగలిగాము. విదేశీయుల బంధన మాత్రమే బంధన కాదు. స్వదేశీయుల బంధననుండి విముక్తి పొంది, స్వబంధననుండి కూడా విముక్తి పొందాలి. ఇంద్రియముల అధీనములో ఉండటమే స్వబంధన. మానవుడు స్వబంధననుండి విముక్తు డైనప్పుడే తాను స్వతంత్రుడవుతాడు. బాహ్యంగా స్వరాజ్యము, అంతర్ముఖంగా స్వా రాజ్యము. ఈ రెండింటిని పొందినవాడే నిజమైన మానవుడు.
దైవము బయట లోపలకూడా ఉన్నవాడు గనుక లోపల వెలుపలకూడా మనము నిజమైన స్వాతంత్య్రాన్ని అనుభవించాలి. “అంతర్బహిశ్చ తత్సర్వం వ్యాప్య నారాయణ స్థితః" - మానవుడు స్వాతంత్ర్యమును పొందాలనుకుంటే ఇంద్రియ నిగ్రహ ప్రాధాన్యాన్ని, దైవ సత్యత్వాన్ని, మానవత్వ విశాలత్వాన్ని గుర్తించడానికి ప్రయత్నించాలి. దీనినే పతంజలి తన యోగశాస్త్ర సూత్రములలో యోగ: చిత్తవృత్తి నిరోధః అని చెప్పాడు. మనస్సును నిగ్రహించవలెనని అందరూ చెప్పవచ్చును. కాని, నిగ్రహించి అనుభవించే శక్తి అందరికీ ఉండదు.
ఏకత్వాన్ని ఒక్క ఆధ్యాత్మికంలో తప్ప అన్య మార్గంలో మనం సాధించలేము. అన్నీ మార్పుచెందేవే కాని ఒక్క దైవత్వం మాత్రమే ఎప్పటికీ మార్పు చెందనిది. మార్పుచెందని ఆత్మను అనుసరించినప్పుడే దేశమంతా క్షేమంగా ఉంటుంది... శ్రీసత్యసాయి దివ్య ప్రసంగముల నుండి. (శ్రీవాణి ఆగష్టు - 2022సంపుటి-38 సంచిక -8)