ఉపనిషత్తులు మానవుణ్ణి ‘ఆనంద పిపాసి అంటున్నాయి. కారణం ఏమిటి? ఏ పని చేసినా నాకు ఆనందము కావాలి అంటున్నాడు. తాను ఆనందము నుండి పుట్టినవాడు కనుకనే తన స్వస్థానమును కోరుతున్నాడు. జలములో పుట్టిన చేపను తెచ్చి వజ్రవైడూర్య గోమేధిక పుష్య రాగములలో పొదగబడిన బంగారు కప్పులో వేస్తే దానికేమైనా ఆనందం కలుగుతుందా? కలుగదు. దానిని తిరిగి జలములో విడిచి పెట్టినప్పుడే ఆనందమును అ నుభవిస్తుంది. అదేవిధంగా, ఆనందము నుండి ఉద్భవించిన మానవుడు తన స్వస్థానమున తాను చేరేంత వరకు అనేక విధాలుగా పరితపిస్తున్నాడు. నిజంగా ఈ లౌకిక విషయాలలో ఆనందమే ఉంటే ఎందుకీ పరితాపం? భగవద్గీత " అనిత్యం అనుఖం లోకం" అని చెప్పింది. ఏదో మీ పొట్టను పోషించుకొనే నిమిత్తమై మీరీ ప్రపంచంలో వచ్చి పడ్డారు. కనుక, జీవనోపాధి సంబంధమైన పనులు మీరు చేసుకోవచ్చు. కాని, మనస్సును దైవంపై ఉంచుకోండి. అప్పుడే మీకు శాంతిసుఖములు లభిస్తాయి. ఆనందము ప్రాపంచిక విషయాలలో లభించదు. ఒక్క దైవచింతనలోనే లభిస్తుంది. నిజంగా ఆ ఆనందము ఎవ్వరికీ తెలియదు. "చెలగి మధువు గ్రోల చేదురుచించునా?" నిజంగా ఆ ఆనందమునే అనుభవిస్తే ఈ ప్రాపంచిక విషయాలపై మనస్సు పోదు.
(స.. సా.ఏ.99 పు.101)
ఆధ్యాత్మిక సాధనలో మొట్టమొదటి మెట్టు- ఇచ్ఛను అరికట్టుట. ఇచ్చనరికట్టకున్నచో, ఆది, విషయముల ననుసరించుటకు ఇంద్రియములను పురికొల్పును, విషయవాసన మానవుడు చేయుకర్మను నీచపరచును, భగవద్వాసన ఆ కర్మను పవిత్రీకరించును.
భక్తి, జబ్బునపడ్డవాడు - పథ్యపుతిండితో - నిమ్మకాయ ఊరగాయను వాడుకొన్నట్లు. ఎప్పుడో అరుదుగా వాడుకోవలసినది కాదు. ప్రధానాహారమువలె నిత్య సేవ్యము. అదే ఆత్మకు బలమునిచ్చు మంచి ఆహారము. నీ పుట్టుక యొక్కడ నో యెక్కడినుండి
దారితప్పి నీ ఎక్కడికి వచ్చితివో, యెప్పుడైనను తెలిసికొనుము.ఇట్లెంత కాలము తిరుగగలవు? నూరు జన్మలెత్తినను, తుదకు నీవు నీ స్వస్థానమును చేరుకొనవలసినదే. దానికి భగవధ్యానమే మార్గము. కానీ, నీ మనసు, లౌకిక విషయములమీద నిల్చినట్లు భగవద్విషయమున నిలువదు. భగవచ్చింతనకు పూనుకొనగనే, అది చపల చేష్టలు ప్రారంభించును. నీవు దానిని నామస్మరణముచేత మచ్చిక చేసుకొని, భగవంతుని వైపు నకు మరలింపుము. ఈ సందేశ మిచ్చుటకే నే నిచ్చటికి వచ్చినది. భగవంతుని నామమును నాలుకమీదను, రూపమును కన్నులలోను, మహిమను మనసులోను స్థిరముగా నిలుపుకొనుము. అప్పుడు నీ ధ్యానమునకు భంగముండదు. పిడుగులు పడినను నీ మనసు చలింపదు.
(ఆ.. శా. పు 21/22)