ఇతరుల స్వాధీనంలో ఉండటం పరతంత్రం. దేనియందుకూడా వశంలో లేకుండా ఉండటం స్వతంత్రం. కాబట్టి, స్వతంత్రమనగా ఆత్మతత్త్వమును అనుసరించటం. ఆత్మాధీనం కావటమే స్వతంత్రమని దీని అర్థము. “పరాధీనం దుఃఖం, ఆత్మాధీనం సుఖం” అన్నారు. ఆత్మాధీనమే స్వాతంత్ర్యము అన్నారు. నీ హృదయాన్ని నీవు అనుసరించడమే స్వాతంత్య్రము. స్వరాజ్యము కాదు మనకు ముఖ్యం; స్వారాజ్యముకోసం పాటుపడండి. స్వా అంటే ఆత్మ. అదే మన స్వంతరాజ్యము. అన్నింటినీ మార్చవచ్చునుకాని, ఆత్మను ఎవ్వరూ మార్చలేరు. అటువంటి మార్పులేని ఆత్మసామ్రాజ్యాన్ని మీరు సంపాదించండి. ఆత్మవిశ్వాసాన్ని పెట్టుకోండి. ప్రతి మానవునికి ఆత్మవిశ్వాసమే ప్రధానము. అదే నిత్యము, సత్యము అయినటువంటి స్థానము. అటువంటి స్వారాజ్యమును మీరు సంపాదించి గొప్ప కీర్తిని గడించాలని నేను ఆశిస్తూ ఆశీర్వదిస్తున్నాను. (శ్రీవారి దివ్యోపన్యాసములనుండి) (సనాతన సారథి, ఆగస్టు 2022 పు11)