స్వరూపలక్షణము సత్య లక్షణము. అదే సత్యజ్ఞాన మనంతం బ్రహ్మ. బ్రహ్మ స్వరూపము సత్యమైనది. జ్ఞాన స్వరూపమైనది. ఆనంతమైనది. ప్రపంచములోని ప్రతి వస్తువునందును ఈ లక్షణములు ఇమిడియున్నవి. తటస్థ లక్షణమనగా తాత్కాలికముగా ఉన్న గుర్తుకు ఆధారము చేసుకొని అనగా ఇతర వస్తువులకు లేక ఇతర వ్యక్తులకు ప్రత్యేకముగా తాత్కాలిక గుర్తులను చూపి నిరూపించునట్టి దానిని తటస్థ లక్షణమందురు. ఉదాహరణకు అందని చందమామను వేలితో చూపినట్లు. అదిగో ఆ చెట్టు కొసకొమ్మ పైనన్ను నక్షత్రము ఫలానా నక్షత్రము అని అందుము. చెట్టు ఎక్కడ నక్షత్ర మెక్కడ? అది తాత్కాలికముగా ఆ కొమ్మ దగ్గర ఉన్నట్లు కనుపించును. తదుపరి ఆది మార్పు చెందును. మనము చూచునప్పుడు అప్పటికప్పుడు ప్రమాణమును నిరూపించును, కాని అది శాశ్వత ప్రమాణము కాదు. అట్టి దానిని తటస్థ లక్షణమని అందురు.
స్వరూప లక్షణము అట్టిదికాదు. ప్రతిదానియందు శాశ్వతమైనదై ఉండును. రూపనామములు మారినను, దేశకాలములు మారినను స్వరూప లక్షణములు మారవు. వాటినే ఆస్తి, భాతి, ప్రియమని కూడా వేదాంత పరిభాషలోప్రయోగింతురు. వస్తువు ఉన్నది. ఎట్లు ఉన్నది. అని కాదు. ఏమి ఉన్నది అని కాదు. ఒక వస్తువు ఉన్నది ఆమనది ఆస్తి, అయితే ఆ వస్తువు ఉన్నట్లు మనకు తెలుపును. అది ప్రకాశము ద్వారా నిరూపించును. ప్రకాశమే లేకున్న ఆ వస్తువు ఉన్నట్లు మనకు తెలియదు. కాన తెలుపునట్టి ప్రకాశమే భాతి అని. అట్టి వస్తువును మన ప్రయోజన నిమిత్తము ప్రీతింతుము. ఇష్టపడుదుము. ఆఇష్టమునే ప్రియమని అందుము. పై తెలిపిన ఆస్తి భాతి ప్రియము - ఈ మూడు భగవంతుని లక్షణములు, వీటిని ఆధారము చేసుకొని రూపములు ఏర్పడును. రూపమును ఆధారము చేసుకొని నామము. ఈ రూప నామములు మారునవి. కనుక వీటిని మాయాతత్వములని పిలుతురు. అన్నింటికి ఆధారము పరమాత్మయే. మిగిలిన పన్నియు ఆధేయములు.
ఆధేయములు మార్పు చెందు రూప నామములు. ఇవి తటస్థలక్షణములు. మారని పరమాత్మ స్వరూప లక్షణము. స్వరూప లక్షణముల ద్వారానే తెలిసికొనవలెను. దీనినే బ్రహ్మవిద్ బ్రహ్మైవ భవతి" అని శ్రుతి తెలుపుచున్నది. అయితే ఆధార ఆధేయములకు రెండింటికీ పరబ్రహ్మయే కారణము. బ్రహ్మను జిజ్ఞాన ద్వారా అవగతము చేసుకొన్న జీవితము ధన్యము.
“సత్యం జ్ఞాన మనంతం బ్రహ్మ . ఈ మూడు లోకాల్లో నిలువగలిగిన అనంతమైన జ్ఞానము బ్రహ్మ. బ్రహ్మము నుండి ఆకాశము, ఆకాశమునుండి వాయువు, వాయువు నుండి అగ్ని, అగ్ని నుండి జలము, జలము నుండి పృధ్వి, పృధ్వినుండి ఓషధులు, ఓషధులనుండి అన్నము, అన్నము నుండి పురుషుడు. ఈ విధముగా సృష్టి క్రమమే కొనసాగివచ్చియున్నది. మొదటిది. బ్రహ్మ. చివరిది పురుషుడు. పురుషునకు బ్రహ్మకు సంబంధం సన్నిహితమై ఉన్నది.
(సూ.వా. పు 21/23)