మనమేదైనా క్షేత్రమునకు వెళ్ళినపుడు మనవెంట తీసికొని వెళ్ళిన ధనమును కాపాడుకునే నిమిత్తమై అనేక విధాలుగా ప్రయత్నిస్తాము. కడపటికి మనకొక నమ్మకమైన మిత్రుడు చిక్కితే అతనివద్ద మన ధనమును దాచి పెట్టి హాయిగా క్షేత్రదర్శనం చేసుకుంటాము. అదే విధముగా ప్రతిమానవుడు జన్మించినప్పుడు తనతో పాటు ప్రేమధనమును కూడా తీసుకునివస్తున్నాడు.
ఇది పుట్టిన తరువాత లభ్యమయ్యేది కాదు, మానవునితో పాటు కూడా జన్మిస్తుంది. అయితే, ఈ కర్మక్షేత్రంలో ప్రేమ ధనము కాపాడుకోవటం చాలా కష్టంగా ఉంటుంది. కనుక, మానవుడు ఒక నమ్మకమైన మిత్రునికోసం వెదకాలి. ఆ మిత్రుడే దేవుడు. తన ప్రేమధనమును అతని చేతికిచ్చినపుడే మానవుడు సుఖశాంతులతో జీవించడానికి వీలవుతుంది. మానవునికి హృదయమే నిజమైన బోధకుడు, కాలమే నిజమైన గురువు, ప్రపంచమే పెద్ద గ్రంథము, భగవంతుడే గొప్ప మిత్రుడు. ఈ నాలుగింటిని విశ్వసించి ఈ జగత్తనే కర్మక్షేత్రంలో మానవుడు తన జీవయాత్రను సాగించాలి. (పిల్లల పెంపకం రీటా బ్రూస్ పు 32)