ఉత్తరాయణమంటే భౌతిక సంప్రదాయార్థమే వేరు, అంతర్ముఖమైన సూక్ష్మధర్మమే వేరు. అయిన, అంతరార్థమే ఇప్పుడు ముఖ్యము. ఉత్తర మార్గమంటే హిమాలయమును చేరు మార్గము. శివుని కైలాస పర్వతానికి యాత్రపోయే మార్గము. తపోభూమికి వెళ్ళే మార్గము అనేదే అర్థము. అయితే,ఆ హిమాలయమును మీ హృదయభూమిలోనే చేర్చుకొనవలయును. హిమము వంటి నిర్మలమైన భావాలు, చల్లదనముతో అందరినీ ప్రేమించే భావాలు పెంచితే, హృదయమే తపోభూమి. అదే శివుని నివాస స్థలమైన కైలాసము.
ఉత్తరాయణములో మరణించినవారు మంచి సద్గతిని పొందెదరు. దక్షిణాయనములో మరణించినవారికి అట్టి సద్గతి దొరుకదు అనేది తప్పు అభిప్రాయము. మంచి సద్గతి దొరికేది మరణించినవాండ్ల గుణమునుబట్టికాని మరణించిన కాలమునుబట్టి కాదు. కేవలము ఈ ఆరు నెలలకు అట్టి మాహాత్మ్యమేమియు లేదు. ఉత్తమ గుణాలను సంపాదించి ఉత్తమ మార్గములో తమ నిత్య జీవనమును గడుపుటయే ఉత్తమ గతికి ముఖ్య కారణము.
దక్షిణాయనము పితృయానమని, ఉత్తరాయణము దేవయానమని భేదాలను పెట్టుకొని మీ సాధనలకు ఆటంకము చేసుకొనకూడదు. సాధనను ఎప్పుడైననూ, దక్షిణాయనమైననూ ప్రారంభించవచ్చును. దానిని నిరంతరము పట్టుదలతో సాధించవలయును. ఉత్తమ గుణములను ఆచరించేవారి దగ్గరకు ఉత్తరాయణమే పరుగెత్తివస్తుంది. సాధనను ప్రారంభము చేసే సుముహూర్తమే ఉత్తరాయణ పుణ్యకాలము.
అసత్ నుంచి సత్ నకు, తమస్సునుండి జ్యోతికి, మృత్యువునుండి అమృతత్వానికి ప్రయాణము చేసేదే ఉత్తరాయణం. జీవ-శివ, దృశ్య-ద్రష్ట, ప్రకృతి-పరమాత్మ, ఇవే ఉండేది. ఈ శాస్త్ర దృష్టిని నేత్రదృష్టిలో ఉంచుకొని, ధర్మమార్గముతో బ్రహ్మమార్గమును ఆశ్రయించేదే మానవుడు చేయవలసిన ప్రయాణం. ఇదే వేదసారం. (సనాతన సారథి 1962 ఫిబ్రవరి సంచికనుండి) సనాతన సారథి, ఫిబ్రవరి 2022 పు40)