చందనపు కఱ్ఱను అరగదీసిన కొలది అది పరిమళం వెదజల్లుతుంది. చెఱుకును బాగా నమిలిన కొలది అది మధురమైన రసమును అందిస్తుంది. బంగారమును నిప్పులో వేసి బాగా కాల్చిన కొలది అందులోని మాలిన్యము తరిగిపోయి అది ప్రకాశవంతమైన అపరంజిగా రూపొందుతుంది. అదే విధంగా, ఉత్తమమైన మానవుడు తాను ఎన్ని కష్టనష్టములకు గురియైనప్పటికీ తన యొక్క నైతిక విలువను కోల్పోక, ఆదర్శవంతుడుగా రాణిస్తాడు.
(ప. పు.125)
(చూ|| ఆదర్శమూర్తులు, మంచివాడు)
ఉత్తమోత్తమ వ్యక్తులు
అనిశంబు నత్యంత అనురాగభోగాను
రక్తులై సుజ్ఞానసక్తులగుచు
స్వపరభేదము వీడి సర్వజీవులయందు
సమభావమును జూపు సరసులగుచు
కష్టజీవులయందు కరుణ జూపించుచు
తగిన సాయము చేయు దాతలగుచు
దాంపత్యధర్మ సత్యత్వవిలాసులై
పరుల కాదర్శ సద్భావు లగుచు
జగతి సత్కీర్తి గాంచి శ్రీ సాయి కృపతొ
సాటి మానవులందెఫ్టు మేటి యగుచు
నిత్యమును ధర్మజిజ్ఞాస నిరతులగుచు
ఉత్తమోత్తమ వ్యక్తులై యుంద్రు గాక!
(శ్రీవా మా – 2020 పు14)