ఆనందసుఖములు అందించే నిమిత్తమై, అందుకొనే నిమిత్తమై దేహేంద్రియమనోబుద్ధులు ఏర్పడినాయి. దురదృష్టవశాత్తు ఈ శరీరేంద్రియమనోబుద్ధులలో దోషములు చేరిపోవుటచే తన స్వభావమును స్వరూపమును మరచి మానవుడు విచారమగ్నుడగు తున్నాడు. దేహమున రాగద్వేషములనే మాలిన్యముకప్పినది. ఇంద్రియములను భోగభాగ్యములనే మాలిన్యము కప్పినది. మనస్సు ఈ రెండింటిచేత అనగా రాగ ద్వేషములు భోగభాగ్యముల చేత కప్పబడింది. కనుకనే మానవుడు తన స్వరూపాన్ని తాను తెలుసుకోలేక పోతున్నాడు. ఈ భౌతికమైన లౌకికమైన భోగభాగ్యములు సుఖసంతోషములే తన ఆధారములని తన స్వరూపము లని విశ్వసిస్తున్నాడు. ఇవి కేవలము కదలిపోయే మేఘములు. సుఖానందములు శాశ్వతమైనవి.
(బృత్ర, పు.105)