వేదాంతము తరువాత స్మృతులు బయలుదేరెను. అవి పవిత్ర తపశ్శక్తి సంపన్నులైన, అనుభవజ్ఞులైన ఋషుల విరచితములే. అయితే వేదాంతమునకు వుండునంతటి, ప్రమాణిక స్మృతులకు లేదనే చెప్పవచ్చును. తక్కిన మతములవారికి, వారి శాస్త్రములకును యెట్టి సంబంధము వున్నదో అటులనే స్మృతుతభారతీయులకునూ అట్టి సంబంధము కలదు. వారి వారి శాస్త్రములు యెట్లు మహాపురుషుల నిర్మితములో అటులనే భారతీముల స్మృతులు కూడనూ మహాపురుషుల నిర్మితములే అని అంగీకరించక తప్పదు. అంగీకరించవలెను. ఇతర మతములకునూ, భారతీయ మతములకును వున్న సామ్యమిదియే. అయితే ఈ ఋషి నిర్మితములైన స్మృతులు కాలక్రమమున మారుతూ వచ్చినవి. ఒక స్మృతి కృతయుగమునకును, ఒక స్మృతి త్రేతాయుగమునకునూ, మరొకటి ద్వాపరయుగమునకు, కొన్ని స్మృతులు కలియుగమునకును ప్రమాణికములై యుండవలెనని చెప్పబడియున్నవి. కాలగతులు మారగా, పలువిధములగు, కొత్త సందర్భములు జాతిని యెదుర్కొనగా ఆయా జాతి యొక్క మర్యాదలు, ఆచారములూ, మార్పుచెందు కొంటూ, చెందవలసి వచ్చుచుండెను. దానికి అనుసారముగా ఈ స్మృతులను కూడా ముఖ్యముగా జాతియొక్క ఆచార, మర్యాద వ్యవహారములను గుర్చినవే కనుక అప్పుడప్పుడు మార్చుచుండుట అవసరమయ్యెను.
(స.వా.పు.67/68)