మానవ జీవితమేకాక సమస్త ప్రాణులూ అరిషడ్వర్గముల చేత కప్పబడినవి. ఈ అరిషడ్వర్గములలో మొట్టమొదటివి కామ, క్రోధములు, కామక్రోధములని రెండున్నప్పటికిమొదటి పదము యొక్క పరిణామమే రెండవపదము. లోభ, మోహ, మద, మాత్సర్యములు కూడ మొదటి పదముయొక్క పరిణామములే. అరిషడ్వర్గములు కామ పరిణామములే. కామము యొక్క పరివర్తనే వీటి యొక్క స్వరూప స్వభావములకు మూలకారణం. కామము వలన అపేక్ష పెరుగుచున్నది. ఈ అపేక్ష విషయ సంబంధమైన అపేక్షగా, అది విఫలమైన క్రోధముగా మారుచున్నది. ఈక్రోధమే సమ్మోహనంగా తిరుగుచున్నది. ఈ సమ్మోహనమే పెరిగి పెరిగి కట్టకడపటికి స్మృతి భ్రష్టుని గావించుచున్నది. ఈ స్మృతి భ్రష్టునకు కష్టము వల్లబుద్ధి క్షీణించుచున్నది. ఈ బుద్ధినాశనము వలన సర్వమూ నాశనమగుచున్నది. సర్వదుఃఖములకు, సర్వనాశనము నకు, అపకీర్తికి ఈ కామమే కారణము. సర్వవాంఛలను తగినంత అదుపులో నుంచుకొని తగిన రీతిగా మీరు జీవించటానికి ప్రయత్నించాలి.
(షి.పు.25)