భారతీయ సనాతన సంప్రదాయములన్నీ అంతరార్థము కలిగినట్టివి. అనాదిగా వస్తున్న ఆచార విధులన్నీ మానవునికి దైవానుభూతిని అందించునట్టివే. కానీ, కాలానుగతిన వానిని విస్మరించి, బాహ్యాడంబరములకు లోనై లక్ష్యానికి దూరమవుతున్నారు. నేటి ఆస్తికులు. కనుకనే కరువులన్నీ యాంత్రికములైనవి. వీనిని సరియైన పద్ధతిలో బోధించే వారు తెలిసినవారు, ఆచరించేవారు చాల అరుదు. మనిషి కాదు మారవలసినది, మనస్సు మారాలి. నీవు దూర ప్రదేశానికి ప్రయాణమైనప్పుడు దారిలో భోజన సదుపాయం లేక పస్తున్నావనుకో. అది ఉపవాస మవుతుందా? అనారోగ్య కారణంగా నీవు భోజనం చేయలేదనుకో, అది ఉపవాస మవుతుందా? ఆధ్యాత్మిక ప్రయోజనాన్నందిస్తుందా? భగవంతుడు నీలోనే ఉన్నాడని భావించడమే విజమైన ఉపవాసము. ఉప అనగా, సమీపము: వాసము" అనగా నివసించుట. కనుక, అనునిత్యము భగవద్భావనలో, ఆత్మచింతనలో ఉండుటయే ఉపవాసము. కొంతమంది ఏకాదశి రోజున ఉపవాసముంటారు. ఆ రోజున ఉమ్మిని కూడా మింగరు. తరువాత రోజు తినేదానికంటే రెట్టింపు భుజిస్తారు. మరి కొందరు ఏకాదశి ఉపవాసం ఉండాలని నలభై దొసెలకు సరిపడా పిండి కలుపుతారు. ఇంకా జాగరణ. దేనికి ఈ జాగరణ? ఎందుకు?విషయములపై, ప్రాపంచిక సుఖములపై నిర్లప్తునివై నిద్రించి ఆత్మానుభవంపై జాగరూకతతో వర్తించడమే నిజమైన జాగరణ.ఆత్మ విషయంలో మేల్కొని ఉండు. నిత్య సత్యమైనదైవవిషయంలో సదా అప్రమత్తుడవై ఉండు. ఇదే జాగరణ. అంతేగాని, నిద్ర మానుకుని రాత్రంతా మేలుకొని ఉండడం జాగరణ కానేరదు. రాత్రంతా పేకాట ఆడుతూ, సినిమాలు చూస్తూ మేలుకోవడం జాగరణ అవుతుందా? వాచ్ మెన్లు హాస్పిటల్ లో పని చేసే నర్సులు, రైల్వే స్టేషన్ మాస్టర్లు రాత్రంతా మేల్కొని డ్యూటీ చేస్తుంటారు. అది జాగరణ అవుతుందా? కానే కాదు. భగవద్విషయంలో జాగరూకతతో వర్తించడమే నిజమైన జాగరణ. ఈ రకంగా అర్థం చేసుకొనక బాహ్యచారంగా పాటించడంచేత మన క్రతువులు, ఆచారాలు హాస్యాస్పదములైనాయి.
(స. సా.న..99పు 342)