నిష్కామ సేవయే సర్వోత్కృష్టమైన సాధన…
పరమాత్మ ప్రేమను ధరణిలో జనులకు
ప్రవహింపజేయుటే పరమభక్తి
ప్రతి మానవుండును బ్రతికి తానుండుట
స్వార్థంబునకు కాదు, సంఘసేవ
చేయుటకే యన్న శ్రేష్ఠభావంబుతో
మెలగుచునుండిన మేలు కలుగు
మరచియు తను తాను మానవసేవకు
అంకితమగుటయే ఆత్మతృప్తి
నిష్కళంకపు ప్రేమను నిలిపి హృదిని
సకల జీవుల కుపకృతి సలుపకున్న
పుట్టి ఫలమేమి నరుడుగా పుడమియందు?!
ఇంతకన్నను వేరెద్ది ఎఱుకపరతు?!
సాయి అర్థించు మీనుండి సద్గుణములు
సర్వమానవ సోదర సఖ్యబుద్ధి
స్వార్థత్యాగంబు పరిశుద్ధ సంఘసేవ
సాయికిచ్చెడి ధనమిదె సత్యముగను
ప్రేమస్వరూపులైన సత్యసాయి సేవాదళ్ సభ్యులారా!
మీరు కేవలము కొన్ని మంచి కార్యములు జరిపినంత మాత్రమున అది భక్తి అనిపించుకోదు.
“డ్యూటీ విధౌట్ లవ్ ఈజ్ డిప్లోరబుల్,
డ్యూటీ విత్ లవ్ ఈజ్ డిజైరబుల్,
లవ్ విడౌట్ డ్యూటీ ఈజ్ డివైన్” |
(ప్రేమరహితమైనటువంటి కర్తవ్యపాలన గర్హనీయం.ప్రేమతో కూడిన కర్తవ్యపాలన అభిలషణీయం. కర్తవ్యంతో నిమిత్తం లేకుండా సర్వులను ప్రేమించడం దైవలక్షణం)
ఇలాంటి పవిత్రమైన ప్రేమతత్త్వాన్ని గుర్తించక ఏవో | మంచి కార్యములు చేస్తున్నామని భావించటం వెట్టితనము.
మన సేవాదళ్ సభ్యులు నిష్కామకర్మలు అభివృద్ధి పరచుకొనే ప్రయత్నమును ప్రధానంగా లక్ష్యమునందు ఉంచుకోవాలి. ఎట్టి కోరికలూ లేకుండా కర్మలో పాల్గొనటము చాలా కష్టతరమైన విషయముకదా యని మీరు చింతించవచ్చు. కానీ, కర్మఫలముకంటె కర్మల యందే మనకు ఆనందము ఎక్కువగా ఉంటున్నది. కర్మను ఆచరించు నిమిత్తమై జన్మము ప్రాప్తించిందిగాని, కర్మఫల నిమిత్తమై ప్రాప్తించలేదు. ఎట్టి కర్మకు అట్టి ఫలితమును అనుభవించక తప్పదు. విత్తనము ఉండినంత వరకు అది మొక్కయి, వృక్షమై, ఫలములందించక తప్పదు. విత్తనము లేకుండా చేసుకొనే ప్రయత్నమే ఈ ఆధ్యాత్మికమార్గము. కనుక, ఫలాపేక్ష లేకుండా నిష్కామ సేవయందు సేవాదళ్ సభ్యులందరూ పాల్గొని తద్ద్వారా మన అనాది _వేదవిహితమైన సంస్కృతిని నిలబెట్టటానికి ప్రయత్నం చేయాలి.
- సేవాదళ్ కన్వీనర్లు (తమ ప్రసంగాలలో) ఆయా రాష్ట్రాలలో జరుగుతున్న సేవలగురించి అనేకరకములుగా వర్ణించారు. ఒక రాష్ట్రము మరొక రాష్ట్రమును, ఒక వ్యక్తి మరొక వ్యక్తిని అనుకరించటం కేవలం గ్రుడ్డిమార్గమనే చెప్పవచ్చును. ఈరకమైన అనుకరణ కాదు మనకు కావలసినది. కేవలం మన మనసుయందు తృప్తిపడటమే కాకుండా ఎదుటి వ్యక్తి యొక్క సంతృప్తిని లక్ష్యమునందు ఉంచుకొని సేవలు ఆచరించాలి. ఇటువంటి సేవయే మానవుని మాధవునిగా మారుస్తుంది. స్వార్థరహితమైన సేవ ఆధ్యాత్మికమార్గములో ప్రయాణమయ్యేవానిని దిగజారనివ్వక రక్షించటానికి సంసిద్ధముగా ఉంటుంది. అనేకరకములైన ధనలన్నింటికంటెను నిష్కామ సేవ అనే పవిత్రమైన సాధన భగవంతుని సన్నిధికి చేరుస్తుంది; భగవత్ప్రేమను సాధ్యము గావిస్తుంది.
ప్రేమస్వరూపులారా! కేవలం పనే ప్రధానమనే - లక్ష్యంతో మీరు చేయకూడదు. క్వాన్టిటీ కాదు, క్వాలిటీ ప్రధానమైనదిగా మీరు లక్ష్యమునందుంచుకోవాలి. ఎట్టి ఘనకార్యాన్ని మనం సాధించాము, ఎట్టి కార్యములందు నడుమువంచి పనిచేశాము అనే విచారణకంటే, ఎట్టి
భావముతో, ఎట్టి హృదయముతో చేశాము అనేదాన్ని పరీక్ష | చేసుకోవటం సత్యసాయి సేవాదళ్ సభ్యులకు ప్రధానమైన కర్తవ్యము.
భక్తి - కర్తవ్యపాలన – క్రమశిక్షణ
ఆరోగము గలవాడు కేవలం ఔషధము సేవించినంత - మాత్రమున రోగనివారణ కానేరదు. దీనికి పథ్యము కూడను అత్యవసరము. అట్లే భవరోగమునందు మునిగిన వారు భగవంతుని యొక్క నామస్మరణ అనే ఔషధము సేవిస్తూ, దానికి క్రమశిక్షణ అనే పథ్యము పాటించటం అత్యవసరం. "నశ్రేయో నియమం వినా” నియమమే లేకపోతే మన జీవితము పెడమార్గము పట్టి, గమ్యమునకు దూరమైపోతుంది. పాటకు భావరాగతాళములు యెంత ఆధారమో సాధనకు భక్తి ప్రేమలు, ప్రపత్తి కర్మలు, దాని నిబంధనలు కూడను అత్యవసరము. ఈనాడు నిబంధనలు ఎంత కఠినముగా ఆచరిస్తామో అంత త్వరగా మనము రోగము నివారణ చేసుకోగలము. కనుక, మన సత్యసాయి సంస్థలయందు నియమించిన నిబంధనలు తూ.చ. తప్పక నడచుకోవలసిన అవసరమున్నది. వీటిని అలక్ష్యము చేయటంవలన రోగాభివృద్ధి మాత్రమే తప్ప రోగనివారణ ఏమాత్రము కలుగనేరదు.
సేవాదళ్ సభ్యులు కొన్ని నిబంధనలను ఆచరించక తప్పదు. మన ఆధ్యాత్మిక సాధన మొక్కదశలో ఉన్నంత వరకు ఈ క్రమశిక్షణ అనే కంచె కట్టుకోక తప్పదు. - డిసిప్లిన్, డివోషన్, డ్యూటీ (క్రమశిక్షణ, భక్తి, కర్తవ్యపాలన) - ఈ డకారత్రయము వేదవాక్యము, ఉపనిషద్వాక్యము. ఈనాడు మీరు డివోషన్ లో ఉన్నా మంటున్నారు. కానీ, డివోషన్ (భక్తి)లో ఉన్నారో, లేక డీప్ - ఓషన్ (భవజలధి)లో ఉన్నారో తెలియటం లేదు. అనేకమంది డ్యూటీ ఈజ్ గాడ్ (కర్తవ్యపాలనే దైవం) అని చెబుతున్నారేగాని, గాడ్ శబ్దము డ్యూటీ లో కనిపించటం లేదు; డాగ్ శబ్దమే వినిపిస్తున్నది! ఇక్కడ డ్యూటీ కి డివోషన్ , డిసిప్లిన్ రెండును బాడీగార్డ్స్ (అంగరక్షకులు)గా పోవాలి. అప్పుడే డ్యూటీ ఈజ్ గాడ్ అనేది సార్థకము చేసినవారమవుతాము. అంతేకాదు, మన సేవాదళ్ సభ్యులు వర్క్ ఈజ్ వర్షిప్ (పనియే పూజ) అంటున్నారు. కానీ, వర్షిప్ (పూజ) భావముతో నీవు వర్క్ (పని) చేస్తున్నావా? లేదు. నేను, నేను అనే భావముతో చేస్తున్నావు. నేను అనే సంకుచితత్వము పోయినప్పుడే నీవు చేసే వర్క్ నిజంగా వర్షిప్ గా మారుతుంది. అహంకారమును రూపుమాపుకోవాలి. సర్వకర్మ భగవత్ ప్రీత్యర్థం అనే భావనతో మనం ఆచరించాలి.
భగవంతునికి చెల్లించవలసిన పన్ను
మానవుడు నిరంతరము స్వార్థములోనే జీవితమును వ్యర్థము గావించుకొంటే యింక పరమార్థమును తాను యేనాడు చేబట్టేది?! నిరంతరము ప్రకృతినుండి మనము పుచ్చుకోవటానికి సిద్ధంగా ఉంటే యింక యిచ్చుకొనేది ఎప్పుడు?! ఈ ప్రకృతిద్వారా మనము అనుభవిస్తున్న అనుకూలములకు, ఆనందమునకు ప్రకృతిపట్ల కొంత కృతజ్ఞత చూపనక్కరలేదా?! మనము ఇల్లు కట్టుకొంటే మున్సిపాల్టీవారు యింటికి ట్యాక్స్ వేస్తున్నారు. నీటికి ట్యాక్స్ వేస్తున్నారు. కరెంటు పెట్టుకొంటే దానికి బిల్లు పంపుతున్నారు. మరి ఇంత ప్రపంచమునకు వెలుతురు, నీరు ఇచ్చిన భగవంతునకు, ఇంత ప్రపంచమును సృష్టించిన భగవంతునకు ఏమి ట్యాక్స్ కడుతున్నాము?
దేవునికి ఇవ్వవలసిన ట్యాక్స్ కు వేదము "బలి” అని | పేరు పెట్టినది. బలి అంటే ప్రాణులను చంపి దేవునికి అర్పించటం కాదు; బలి అంటే సుంకము, పన్ను. పాపభీతితో, దైవప్రీతితో జీవిస్తూ తోటిమానవులను ప్రేమతో చూచి, దయతో ఆదరించటమే మానవులు ఈయవలసిన పన్ను.
సేవలోని పవిత్రతను చాటిన కృష్ణ పరమాత్మ
మానవుడు అనేక ఋణములతో జన్మిస్తున్నాడు. అట్టి ఋణముల పరిహారార్థం సేవలు సల్పడం తన ప్రధానమైన కర్తవ్యంగా మానవుడు గుర్తించాలి. ధర్మజుడు రాజసూయ యాగము సల్పుచున్న సమయములో కృష్ణుడు ప్రవేశించి, “ధర్మరాజా! ఈ రాజసూయ యాగములో నాకు కూడను ఏదైనా సేవ చేసే అవకాశం అందించు” అని కోరాడు. అప్పుడు ధర్మరాజు, "స్వామీ! తాము ఈ యాగములో చేయగల కార్యములేమిటో తెల్పిన తప్పక అట్టి కార్యములో మీరు పాల్గొనుటకు ఎట్టి అభ్యంతరమూ ఉండదు” అన్నాడు. అప్పుడు కృష్ణుడు, “నా డిగ్రీ ఎమ్.ఎ. కాబట్టి, నా డిగ్రీకి తగిన పని నీవే అందించు” అని కోరాడు. ధర్మరాజుకు ఈ పలుకులు ఏమాత్రము అర్థము కాలేదు. స్వామీ! ఎమ్.ఎ. అంటే ఏమిటి? దాని ఘనత ఏమిటి?” అని ప్రశ్నించాడు. “ఎమ్ - అనగా, ఎంగిలాకులు; ఎ అనగా ఎత్తివేయటం” అన్నాడు కృష్ణుడు. --
సర్వజ్ఞుడు, సర్వశక్తిమయుడు అయిన కృష్ణుడు రాజసూయ యాగములో అతిథులు భుజించిన తర్వాత ఎంగిలాకులు ఎత్తివేసే సేవలో పాల్గొన్నాడు. యుద్ధములో అర్జునునికి కేవలము రథసారథిగా తాను కూర్చొన్నాడు. దీని అంతరార్థము ఏమిటి? సేవయందు ఘనమైన పవిత్రత ఉన్నదనే సత్యాన్ని లోకానికి చాటాడు. నిష్కామ సేవయే యోగమని పిలువబడింది. కనుక, ఇట్టి - నిష్కామ సేవయందు పాల్గొని తద్ద్వారా పరమాత్మతో సన్నిహిత సంబంధం ఏర్పర్చుకోవడం మానవుని ప్రధాన కర్తవ్యం .
కేవలం మానవులకు మాత్రమే కాదు, సర్వజీవులకు అవసరమైన సమయంలో సేవలు చేయటం అత్యవసరం. ఈశ్వర స్సర్వభూతానామ్ సర్వభూతములయందు ఈశ్వరత్వమే ఆత్మస్వరూపములో ఉన్నది అనే సత్యాన్ని మొట్టమొదట మీరు విశ్వసించాలి. అట్టి పవిత్రమైన
భావము మీ హృదయమందు స్థిరపడినప్పుడే సేవ | సార్థకము కాగలదు. అట్టి ఆత్మవిశ్వాసము లేక కేవలము మీరు పేరుప్రతిష్ఠల నిమిత్తము సేవలలో పాల్గొనిన జన్మ సార్థకము కానేరదు. కనుక, మొట్టమొదట ఆత్మవిశ్వాసాన్ని బలపరచుకోండి. అప్పుడే మీరు అందుకోవలసిన ఆనందానికి అర్హులవుతారు. అట్టి ఆనందస్థితిలో మీరు కష్టసుఖములను ఏమాత్రము లెక్కచేయక త్యాగానికి పూనుకొంటారు. నకర్మణా నప్రజయా ధనేన త్యాగేనైకే అమృతత్వమానశుః అమృతత్వాన్ని మనం అందుకోవా లనుకొన్నప్పుడు నిరంతరం త్యాగానికి సంసిద్ధులుగా ఉంటుండాలి.
మీకు సేవకునిగా ఉండటమే నాకు ఆనందం
వినయము, విధేయత, త్యాగము - ఈ మూడూ ప్రధానమైనవి సేవకు. కనుక, మనము త్యాగము చేయక సేవలో పాల్గొన్నప్పుడు సేవకు విరుద్ధమైన ఫలితమే అందుకోవలసివస్తుంది. ఇది కేవలము మాటలతో చెప్పే పనికాదు. చెప్పవచ్చు కోటి, చెయ్యరు ఒక్కటీ! కనుక, నీవు కేవలం మాటలు చెప్పి నీ నాలుకను నొప్పించేదాని కంటే ఒక్కటి చేసి చూపించి నీ జన్మను సార్థకం గావించుకోవాలి. ఆధ్యాత్మిక మార్గము కేవలం ప్లాట్ ఫాం స్పీచ్ కాదు; అది ప్రాక్టికల్ సైన్స్! ఈనాడు ఆచరణలో లేని భాషణలు సల్పటంచేతనే మన భారతదేశములో ఆధ్యాత్మికత కొంతవరకు క్షీణించిపోయినది.
మన దేశమునందుగాని, ఇతర దేశములందుగాని నాయకులు లేకపోలేదు; కావలసినంతమంది గురువులు ఉంటున్నారు; గ్రంథములు ఉంటున్నాయి. కానీ, ఈ నాటికి కూడను మన లక్ష్యాన్ని మనం సాధించటం లేదంటే దీని అంతరార్థము ఏమిటి? కేవలం చెప్పటమేగాని చెప్పింది చేయటానికి ఏమాత్రము సంసిద్ధముగా ఉండటం లేదు. ఎవరు చూచినా ఉపన్యాసములు ఇచ్చేవారే! ఎవరు చూచినా గురువులుగా తయారయ్యేవారే! ఎవరు చూచినా నాయకులుగా తయారయ్యేవారే! నేడు శిష్యుడుగా ఉంటాడు, రేపటి దినం గురుస్థానము అలంకరిస్తుంటాడు!
" అలాంటి గురువులు అధికం కావటంచేతనే ఈనాడు ఆ గురుత్వమే క్షీణించిపోయింది.
దివ్యాత్మస్వరూపులారా! మన సత్యసాయి సంస్థల | యందు అట్టి ప్రయత్నాలకు ఏమాత్రము పూనుకొనక,
మీరు సరియైనరీతిలో నిరంతరము సేవకులుగా ఉండే | ప్రయత్నానికి సంకల్పించుకోండి. జీవితమంతా సేవకుడుగా ఉన్నవాడే సరియైన నాయకుడు. జీవిత మంతా కింకరుడుగా ఉన్నవాడే శంకరుడు. మనము - నిరంతరం సేవకులుగా ఉంటూ లోకానికి సేవచేయటం ద్వారా సాక్షాత్తు ఈశ్వరుని సేవించినవారమవుతాము.
అనేకమంది నన్ను అడుగుతుంటారు, "స్వామికి సెక్రెటరీ ఎవరైనా ఉన్నారా? లేక, ఇంకెవరైనా అసిస్టెంటు ఉంటున్నాడా?” అని. ఎవరికి సెక్రెటరీ కావాలి? సీక్రెట్ + ఉన్నవారికే సెక్రెటరీ కావాలి. నాకు సీక్రెట్ లేదు కనుక, సెక్రెటరీ అనవసరం. నా జీవితమంతా నేను మీకు ఆ సేవకునిగా ఉండటమే నాకు ఆనందంగా ఉంటుంటాది. * అదియే నిజమైన ఐశ్వర్యం.
దివ్యాత్మస్వరూపులారా! “సత్యసాయి సేవాసంస్థ, సత్యసాయి సేవాదళము, సత్యసాయి సేవాసమితి” -
అంతా సేవ, సేవ అనే పదముతో కూర్చబడినటువంటిది. * కనుక, మీరు నిరంతరము సేవకులుగా ఉంటూ ఆ నాయకుణ్ణి పొందే ప్రయత్నమునకు పూనుకోవడం * అవసరం. అంతేగాని, నాయకులు కావటానికి మాత్రం ఆ ప్రయత్నం చేయకండి. పాశ్చాత్య దేశాల్లో నేడు సేవకుడుగా ఉండి, రేపటికి లీడరుగా మారి, తరువాత గురువుగా తయారైపోతున్నారు. ఇలాంటి గురువులవల్ల ఎంత - ప్రమాదమో మీరు యోచించుకోవచ్చును. గురువులుగా తయారుకావటానికి సంకల్పించుకోకండి. నిరంతరం సేవకులుగా ఉండే సత్సంకల్పాన్ని అభివృద్ధిపరచుకోండి.
మూతలున్న ఇంద్రియాలను ముఖ్యంగా అరికట్టుకో!
సేవాదళ్ సభ్యులారా! మరొక విషయాన్ని కూడను చక్కగా గుర్తించవలసిన అవసరం ఉంది. మనకు ఐదు ఇంద్రియములు ఉంటున్నవి. ఇందులో కంటికి, నోటికి మాత్రమే మూతలు ఉంటున్నవి. మీరు ఇందులోనున్న
అంతరార్థమును చక్కగా విచారించాలి. కన్ను అనేక దృశ్యాలను చూస్తుంది. చూడటంతో దీని కార్యము నెరవేరదు; వాటిని మనస్సునందు చేర్చి అనేక దోషాల్ని అభివృద్ధిపరుస్తుంది. నోరు ఊరకే ఉండదు. తాళము వేసినా పగులగొట్టుకొని మాట్లాడుతుంది. ఈ దృష్టి దోషము, వాగ్గేషములు చాలా ప్రమాదకరమైనవి కనుక వీటిని హద్దులోనుంచుకొమ్మని రెండింటికీ మూత పెట్టాడు భగవంతుడు. కనుక, మీరు భగవత్ వరప్రసాదంగా అందుకొన్న కన్నులను చెడును చూడటంలో వినియోగపరచకండి. చెడ్డచూపులు మీ కన్నులకు చేర్చకండి. చెడ్డ పలుకులు మీ నాలుకతో పలుకకండి. మీరు సేవచేసే సమయమందు మృదుమధురమైన పలుకులతో మీ సేవ ప్రారంభించండి. కఠిన వాక్కులతో ఎదుటి వారి హృదయాన్ని గాయపరచకండి. కాలు జారితే కలుగదు నష్టము, నాలుక జారితే నరకమెరా అన్నారు. ఇతరుల హృదయాన్ని మనము గాయపరచినప్పుడు ఆ గాయమును మాన్పే డాక్టరు ఎక్కడా ఉండడు. మనము
ఏమి చేస్తామో దానియొక్క ఫలితము లభించటము తథ్యం. | కాబట్టి, మంచిని చేసి మంచిని అనుభవించటానికి మీరు సంసిద్ధులుగా ఉండండి.
వెనుకనుండి తోయడం కాదు, ముందుండి నడిపించు!
దివ్యాత్మస్వరూపులారా! మన ఆత్మసంతృప్తి నిమిత్తమై | మనము సేవలు ఆచరిస్తున్నామేగాని, పదిమందికి ప్రకటించే నిమిత్తమై కాదు. ఇన్ని సంవత్సరములనుండి | మనం యిన్ని సేవలు చేస్తున్నాం. ఎన్ని సేవలు చేశాము, ఎట్టి సేవలు చేశాము అనే ఈ క్వాన్టిటీ కంటె కూడను, ఈ సేవల ద్వారా సమాజమునందు దీనియొక్క ప్రభావము యేరీతిగా రూపొందినదనే సత్యాన్ని తెలుసుకోవడం అత్యవసరం. మన సేవల ద్వారా మొట్టమొదట మనము చేసి, ఆ తరువాతనే పరులకు చెప్పాలి. అప్పుడే దీనియొక్క ప్రభావము సమాజమునందు, దేశమునందు కొంతవరకు ప్రకటింపబడుతుంది. కేవలము చెబుతూ, చేయకుండిన యితరులు దీనిని సరించటంలోగాని, ఆచరించటంలోగాని ఏమాత్రము ఉత్సాహము చూపరు. “పాస్ట్ ఈజ్ పాస్ట్” గడచినదానికి మనము విచారించనక్కరలేదు. ముందు జరుగబోవు దానికైనా కొంత జాగ్రత్తగా పెద్దలు, అధికారస్థానము చేబట్టినవారు, కార్యకర్తలు ఆచరించుటకు సంసిద్ధులుగా ఉంటారని ఆశిస్తున్నాను. మనము ప్రజలను వెనుకనుండి తోయటం సులభం కానీ, ముందుండి లీడ్ చేయటం కష్టం. మనము అధికార స్థానాన్ని చేపట్టినప్పుడు కొంత శ్రమపడి అయినా అలాంటి దానిని సాధించటానికి పూనుకోవాలి. మన కార్యకర్తలు నగరసంకీర్తనలయందు అప్పుడప్పుడైనా ముందంజవేసి, వెనుక వచ్చేవారికి ఉత్సాహప్రోత్సాహములందించే ప్రయత్నానికి సంసిద్ధంగా ఉంటుండాలి. ఎవరికోసము ఈ నిబంధనలు? - స్వామికోసం కాదు, ప్రపంచంకోసం కాదు; మీ ధన్యత - కోసం. పవిత్రమైన భారతీయ సంస్కృతిని నిలబెట్టేకోసం.
చందాలు పోగేయడం సంస్థ నిబంధనలకు విరుద్ధం
సత్యసాయికి ధనముతో సంబంధము లేదు; మీ - గుణముతోనే సంబంధము. మనము భజనమండలి అని - స్థాపించాము. సత్సంగములని స్థాపించాము. స్టడీ సర్కిల్ - అని స్థాపించాము. అన్నియుకూడను కొన్నిరకములైన - సాధనామార్గములు. మనం భజన చేస్తున్నాము. నగర సంకీర్తన చేస్తున్నాము. భజనలు చేయటానికి, నగర సంకీర్తన చేయటానికి డబ్బు ఎందుకు?! బాలవికాస్ మనం స్థాపించాం. బాలవికాస్ బాలురు సిద్ధముగా ఉంటున్నారు. ఉపాధ్యాయులు సిద్ధంగా ఉంటున్నారు. దీనికి ధనముతో అవసరం ఏముంది?! కనుక, చిన్న విషయాలకంతా ధనము ప్రోగుచేసుకోవడం, సత్యసాయి సంస్థల పేరుకు అప్రతిష్ఠ తెప్పించటము, యిది భక్తులకు సరియైన మార్గము కాదు. ఈ ధనముకోసం మనము ఆధ్యాత్మిక ధనమును కోల్పోతున్నాము. మన నిజమైన | ఐశ్వర్యము సద్గుణములే. మనయొక్క సంపద సత్ప్రవర్తనే. మనయొక్క సిరి సదాచారమే. ఈ మూడింటిని మనము హస్తగతము చేసుకొన్నప్పుడు లక్ష్మి మన హృదయ స్థానములోనే నిల్చిపోతుంది. “పక్షివాహన హరికి లక్ష్మి వక్షమందేయుండ బిక్షమెత్తుట ఏల?” ఏమి బిక్షమెత్తాడు? ప్రేమ, ప్రేమ, ప్రేమ! కనుక, మనం ప్రేమను యిచ్చి పుచ్చుకొనటానికి సిద్ధముగా ఉండాలి. ఒకవేళ భజనమండళ్లుగాని, సమితులుగాని ప్రత్యేకంగా బహిరంగ సభలు జరపాలని ఆశించినప్పుడు ఆ రాష్ట్రములోనున్న సత్యసాయి ట్రస్టును సంప్రదించండి. అంతేగాని చందాలకు మీరు ఏమాత్రము పూనుకోకూడదని ఈ సమావేశములో గట్టిగా నిర్ణయించుకొనవలసిన అవసరము ఉన్నది. ఈ విధమైన నిబంధనలతో మీకు కూడ అధిక భారము ఉండదు. మానసిక అశాంతి చెలరేగదు.
కార్యసాధనకు ఐదు వేళ్ళూ కలసి పనిచేయాలి
ఇక్కడ సత్యసాయి సేవాసమితి ఒకటి ఉంటున్నాది. సత్యసాయి మహిళా విభాగము ఉంటున్నాది. సత్యసాయి భజనమండలి ఉంటున్నాది. సత్యసాయి సేవాదళము | ఒకటి ఉంటున్నాది. సత్యసాయి బాలవికాస్ ఉంటున్నాది.
ఈ ఐదు వ్రేళ్లలో ఏది ముఖ్యమైనదని ఎవరు నిర్ణయింప గలరు! ఐదుకూడను అవసరమే. ఐదుకూడను చేరినప్పుడే ఏ కార్యాన్నైనా సాధించగలము. కాబట్టి, ఏ సమావేశము జరిగినప్పటికిని, అందరుకూడను ఏకమైయుండాలి. భజనవారు ఉండాలి, సేవాదళము ఉండాలి, మహిళా విభాగము ఉండాలి, సమితివారు ఉంటుండాలి. అందరు చేరినప్పుడే చక్కగా, మంగళకరముగా, పవిత్రమైన రీతిగా కార్యము ఫలవంతము కాగలదు. అహంకారమునకు యేవిధమైన అవకాశము యివ్వకుండా చూచుకోవాలి. ఈ అహంకారమనే కిరీటము ను మనము ఏమాత్రము ఆశించకూడదు. నిరంతరము మనము సేవకులుగా ఉండాలి. అందరూ ఏకోన్ముఖులైపోయి కార్యసాధనకు | కంకణము కట్టుకోవాలి. ముఖ్యంగా యిందులో శ్రద్ధతో, భక్తితో పాల్గొనేవారు అత్యవసరంగా ముందంజవేయాలి.
కొన్ని నిమిషాల క్రితం కస్తూరి చెప్పాడు ఒక కథ. పూణెలో మనుమడు ఉండటము, అంతలో అతని మామగారు మరణించడం, అయితే ప్రక్కింటి వారికే ఆవిషయము తెలియనట్లుగా చెప్పాడు. దీనికి ఏది కారణం? మనం మన ప్రక్కింటి వారిని విచారించామా? లేదు. కనుకనే ప్రక్కింటివారు మనలను విచారించటంలేదు
ఇచ్చుకొనే వారికే ఉంటుంది పుచ్చుకొనే అర్హత
మనం ప్రక్కింటి వారిని, లేక సహచరులను, సన్నిహితులను, వారి క్షేమసమాచారములను విచారిస్తూ, వారి మంచిచెడులను కొంతవరకు గమనిస్తున్నప్పుడు మన మంచిచెడులను ఇతరులు గమనిస్తారు. ఇతరులు ఎరుగకున్న ఈశ్వరుండెరుగడా?! కాబట్టి, ఈశ్వరుడైనా మనయొక్క మంచిచెడ్డలు గమనించడానికి ప్రయత్నిస్తాడు. మనము ఇతరుల బాగోగులు పట్టించుకోకుండా ఒకరు మన బాగోగులు విచారించలేదని బాధపడుట సరియైనటు వంటిది కాదు. మనలోనే ఉన్నది. లోపము. “నావారు, పరాయివారు” అనే భేదభావము ఉండటంచేతనే మనలో ఇన్నివిధములైన ద్వంద్వావస్థలు అభివృద్ధి అవుతున్నవి. దీనివల్లనే అనేకరకములైన బాధలకు కానీ, కయ్యానికి గానీ, అశాంతికిగానీ గురికావడానికి అవకాశం ఏర్పడుతున్నది.
మనయొక్క తత్త్వమును ఏకత్వముగా పెట్టుకుని, ఈశ్వరత్వాన్ని సమష్టిస్వరూపంగా భావించుకున్నపుడే మనము నిజమైన సేవాతత్త్వమును అనుభవించిన వారమవుతాము. యద్భావం తద్భవతి , ఈనాడు నేను యిచ్చుకున్నపుడు రేపు పుచ్చుకోవడానికి అర్హుడనవుతాను. కనుకనే మన భారతదేశంలో చెపుతుంటారు, పెట్టి పుట్టాలి అని. ఈనాడు మనం ఒకరికి సేవ చేయకపోతే రేపు మనకు ఎవరూ చేయరు. బయటివారే కాదు, ఇంట్లో వారు కూడా చేయరు. “పిండి కొద్దీ రొట్టె, విత్తనము బట్టి మొక్క” కనుక, మన భావాన్ని సరిచేసుకుని, హృదయాన్ని నిర్మలం గావించుకుని దివ్యమైన ప్రేమతో సమాజసేవలో ముందంజ వేయడానికి మనం సంసిద్ధులుగా ఉండాలి. ఈ విధమైన కార్యంలో ప్రవేశిస్తే దైవమే మనకు తోడుగావుండి అండదండలు తానందిస్తూ వస్తూంటాడు.
(“దివ్యసారథ్యంలో శ్రీ సత్యసాయి సేవాసంస్థలు" నుండి సంకలితము) ((సనాతన సారథి, జూన్ 2019…7 – 12)
‘ఆపరేషన్ కాదు; కోఆపరేషన్ అవసరం
త్రోవలో ఒక ముల్లు కనపడినది కన్నులకు. తక్షణమే కాళ్ళు ఆ ముల్లును దాటును. కన్నుండేది పైన, కాళ్ళుండేది క్రింద. కన్ను కాళ్ళకేమైనా చెప్పిందా? కాళ్ళు కన్నులనేమైనా అడిగినాయా? లేదు. కన్నులకూ కాళ్ళకూ లోలోన ఆంతరంగికమైన సంబంధమున్నది. ఆ సంబంధము వలన కన్ను చూచినదేమిటో కాళ్ళకు తక్షణమే తెలిసినది. చెప్పకుండా అవి జాగ్రత్త పడినవి.
మన సంస్థలలో మెంబర్లకూ అధ్యక్షులకూ జిల్లా అధ్యక్షులకూ స్టేట్ ప్రెసిడెంట్లకూ ఈరీతి ఆంతరంగికమైన సంబంధమొకటున్నది. అదే సాయిసంబంధము. స్వామి సర్వాంతర్యామి, సర్వజ్ఞుడు, సకల హృదయవాసి అనే నమ్మకమును దృఢపరచుకొని మీమీ కర్తవ్యాలను భక్తిశ్రద్ధలతో, దివ్య ప్రేమతో నెరవేర్చండి. పదవులకుగాని, పేరుప్రతిష్ఠలకుగాని ప్రయత్నించక స్వామియొక్క ప్రేమప్రసాదమును అందుకొనే ప్రయత్నమును సలుపండి. కో ఆపరేషన్ కావలెనుగాని, ఆపరేషన్ లోనికి దిగవద్దు. (సనాతన సారథి, జూన్ 2019… 12)