నా పనులకు ఎవరూ అడ్డు పెట్టడానికి వీలు కాదు. అవి జరిగి పోతూనే ఉంటాయి. పోయిన నవంబర్ 19వ తేదీన మహిళా దినోత్సవ సందర్భంగా ఇక్కడకు స్త్రీలందరూ వచ్చి చేరారు. స్వామీ! ఈ 19వ తేదిని మీరు స్త్రీల పర్వదినంగా నిర్ణయించారు. మేమంతా మీరిచ్చిన చీరలు కట్టు కున్నాము. ఆనందము ననుభవిస్తున్నాము. ఈ సందర్భంగా మేమేమి సేవ చేయాలి?" అని అడిగారు. "మీరేమీ చేయనక్కర లేదు. ఆనందము ననుభవించండి. అంతే చాలు” అన్నాను. కానీ ఒకరిద్దరు మాత్రం "స్వామీ! ఇక్కడికి చాలమంది సేవాదళంవారు వస్తున్నారు. వారికి భోజన సౌకర్యం కల్పించే అవకాశాన్ని మాకు అనుగ్రహించండి" అన్నారు. "రాబోయే సంవత్సరం నుండి ఇది జరుగు తుంది. నేను ముందే సంకల్పించుకున్నాను. దీని గురించి మీరేమీ యోచన పెట్టుకోవద్దు" అన్నాను. రేపటి నుండి సంవత్సరం పొడవునా ప్రతి దినము సేవాదళంవారికి చక్కని భోజనం పెట్టాలని సంకల్పించు కున్నాను. షెడ్లు వేయించాను. ఈ సంగతి ఎవ్వరికీ తెలియదు. "సత్యసాయి సైలెంట్ వర్కర్" గ్యాస్ సిలిండర్లు తెప్పించాము. పెద్ద పెద్ద పాత్రలను తెప్పించాము. తట్టలు, స్పూములు, బియ్యము, బేడలు తదితర వంట సామాగ్రి సర్వమూ సంసిద్ధమైపోయాయి.
సేవకు వచ్చేవారిలో బీదవారున్నారు. మద్యరకం వారున్నారు. ఉన్నత స్థాయి వారు కూడా ఉన్నారు. అన్ని రకాలవారూ సేవకు వస్తున్నారు. భోజనం మేము ఉచితంగా పెట్టవచ్చును గాని రైల్వేవారు ఊరికే విడుస్తారా? రైల్వే ఛార్జీలు రోజురోజుకీ పెరిగిపోతున్నాయి. పూర్వం కేవలం 20 రూపాయలతో ఇక్కడి నుండి మాద్రాసుకు వెళ్ళడానికి వీలయ్యేది. కాని ఇప్పుడు 200 రూపాయలు కూడా చాలవు, ఇంతగా పెరిగి పోయాయి రైల్వే ఛార్జీలు. కనుక రైల్వే అధికారులతో మాట్లాడి, సేవాదళ్ వారికి కన్సెషన్ ఇప్పించవలసిందిగా నేను సెంట్రల్ ట్రస్ట్ సభ్యులకు చెప్పాను. కొంతమంది సభ్యులు ఢిల్లీలో ఉంటున్నారు “మేము పల్లెలో ఉన్నాం, మీరు ఢిల్లీలో ఉన్నారు. ఈ పని చేయలేకపోతే మీరు ఢిల్లీలో ఉండి ప్రయోజనమేమిటి? ఈ పని చేస్తే చేయండి, లేకపోతే రిజైన్ చేసి పొండి" అని కఠినంగా చెప్పాను. నేను మాట్లాడేటప్పుడు మధురంగా మాట్లాడుతానుగాని, డ్యూటీ విషయంలో మాత్రం కఠినంగా వ్యవహరిస్తాను. ఏదైనా కఠినమైనది జరిగినప్పుడే మనిషి కొంచెం కదులుతాడు. సెంట్రల్ ట్రస్ట్ సభ్యులు వెళ్ళి రైల్వే అధికారులతో మాట్లాడారు. వెంటనే సేవాదళ్ వారికి రైల్వే కన్సెషన్ సేంక్షన్ అయిపోయింది. రైల్వేవారు ఎంతో - ఆనందించారు. "స్వామీ ! భక్తులకు సేవ చేసే మహద్భాగ్యం మాకు లభించింది. ధన్యవాదములు" అన్నారు.
(స.సా.ఫి..99పు 35/36)
(చూ. రైల్వేస్టేషన్)