(1970లో నవంబరు 20,21,22 తేదీలలో ప్రశాంతి నిలయంలో 4వ అఖిల భారత సేవాదళ సమ్మేళనం జరిగింది. ఆ సందర్భంలో భగవాన్ బాబావారు 4 దివ్యోపన్యాసాలను సేవాసాధకులకు అనుగ్రహించారు. సేవ అనేది ఆత్మ సాక్షాత్కార సాధనమని, దైవసందర్శన యోగమని ఆ ప్రసంగాలలో ప్రబోధించారు. భగవాన్ శ్రీ సత్యసాయి సేవాసంస్థలలో జరిగే శిక్షణ శిబిరాల్లో, సాధన శిబిరాల్లోనూ ఈనాలుగు దివ్యపన్యాసాల సారాంశాన్ని సాధకులు తెలుసుకుంటారు. ఈ దివ్యోపన్యాసాలు "సేవాసాధన" అనే పుస్తకంగా వెలువడినది. "సాయి సేవకులు ఈ ప్రసంగాలను క్షుణ్ణంగా చదవాలి. సారాన్ని గ్రహించాలి. సేవాతత్వాన్ని తెలుసుకొని ఆచరించాలి. ఇలా ఆచరించగలిగినప్పుడే సేవాసాధకులు భగవాన్ శ్రీ సత్యసాయిబాబావారి ధర్మ సంస్థాపన కార్యక్రమంలో ఉపకరణములుగా తమ పాత్రలను నిర్వహించగలరు అని శ్రీ ఎస్.కస్తూరిగారు తమ పీఠికలోవ్రాశారు.)
"సేవాసాదన" అనే దివ్యోపన్యాసముల సారాంశం యిది.
దివ్య ప్రసంగం -1
1. సేవాసాధకుడు క్రమశిక్షణ అలవరచుకోవాలి. క్రమశిక్షణ లేకపోతే ఏ సాధన ఫలించదు.
2. సేవ చేయటానికి యింద్రియ నిగ్రమం అవసరం. అనివార్యం .
3. ద్వందాలకు అతీతంగా జీవించగలిగే మానసిక సమత్వాన్ని సేవా సాధకుడు ఏర్పరచుకోవాలి.
4. శ్రీ సత్యసాయి సేవా సంస్థల్లో వివిధ మతములకు చెందినవారు సేవచేస్తారు. కనుక సకల మతములకూ సారమైన ప్రేమ అహింసలను అలవరచుకోవాలి. నిత్య జీవితంలో ఈ ప్రేమ అహింసలను ఆచరించి చూపటానికే శ్రీ సత్యసాయి సేవాసంస్థ ఆవిర్భవించింది.
5. దేహం నాహం - కోహం-సోహం (దేహాన్ని తాను, మరి ఎవరిని ఆ దివ్యత్వాన్నే నేను) అనే నాలుగు విమర్శలను ప్రతి సభ్యుడూ చేసుకోవాలి.
6. ధర్మార్థ కామమోక్షములనే నాలుగు పురుషార్థములను ప్రతి మనుజుడు సాధించాలి. ధర్మాన్ని ముందుగా పోషిస్తే మిగతా మూడు పురుషార్థాలను అదే సమకూర్చుతుంది.
7. శ్రీ సత్యసాయి సేవా సంస్థల్లోని ప్రతిసభ్యుడూ వేర్పాటు ధోరణిని పోగొట్టుకోవాలి. కుల, మత, జాతి, ధనిక, బీద మొదలగు తేడాలకు వారు చోటివ్వకుండాఅందరూ కలసి తోటి వ్యక్తుల కష్టాల్లో పాలుపంచుకోవాలి.
8. అపోహలు ఏవైనా కలిగితే వాటిని సహనంతో, ప్రేమతో తొలగించుకోవాలి. అంతేగాని చిత్త స్థయిర్యాన్ని కోల్పోయి, కోపోద్రేకాలకు చోటివ్వరాదు.
9.విశాల భావాన్ని అలవరచుకొని ప్రేమభావంలో మీజీవితాన్ని సర్వేశ్వరుని పాదలచెంత సమర్పించుకోవటమే జీవిత లక్ష్యంగా గుర్తుంచుకోవాలి.
10. సహనం, ప్రేమ, విశ్వాసం. వినయం వీటితో ఎదుటివారిని గౌరవించాలి.
11. కల్లోలాలతో, భయాందోళనలతో నిండిన నేటిప్రపంచంలో శ్రీ సత్యసాయి సేవా సంస్థలు సభ్యులు, తమ వ్యక్తిగతమైన ప్రభావంచేత ప్రేమద్వారా, సమాజంలోని వ్యక్తులలో ప్రశాంతిని వ్యాపింపజేయాలి.
12. ప్రపంచాన్ని రక్షించాలంటే అది ఆత్మశక్తిలతోనే సాధ్యం అవుతుంది. ఆత్మశక్తిని ప్రతి ఒక్కరూ సాధనద్వారా మేల్కొల్పాలి. ప్రేమద్వారా భగవత్ కృపను పొందాలి. పవిత్రత, ప్రేమ ఈ రెండూ లోపించిన చోట ప్రళయం తథ్యం .
13. ఇంట్లో చూస్తే తండ్రికి కొడుక్కూ భార్యకూ, అన్నకూ తమ్ముడికి మధ్య ప్రేమభావన కనిపించదు. అలా జరగటానికి వీల్లేదు. మీ ప్రవర్తన ద్వారా, ఆత్మజ్ఞాన జనితమైన ప్రేమభావాన్ని మీరు ప్రదర్శించక తప్పదు. ఇదే ప్రపంచ సమస్యలన్నింటికీ కూడా పరిష్కార మార్గం. మరుక్షణంలో ఏం జరుగుతుందో వూహించలేక భయంతో మనుష్యులు బ్రతుకుతున్నారు. వారికి దోవ చూపించే దీపాలుగా మీరు ప్రవర్తించాలి. అదే నెరవేరితే యింకా మీకు జపతపాలతో పని లేదు. ప్రేమభావంతో నరరూప నారాయణులను సేవించటం ద్వారా తప్పక భగవత్ కటాక్షం మీకు లభిస్తుంది. కాబట్టి ఈనాడే మీరంత ఒక నిర్ణయం తీసుకొండి ప్రేమతత్వాన్ని మీ హృదయాల్లో ఆవిష్కరించండి. దాన్ని విశ్వవ్యాప్తం చేయండి. మీరంతాస్వార్థ సంకల్పాలు విడనాడి ప్రేమ స్వరూపులు కావాలి.
14. నాకు ఏ జిల్లాలో అధిక సంఖ్యలో సమితులున్నాయనేది ముఖ్యంకాదు. ప్రేమగల హృదయంతో ఎక్కడ నిస్వార్థ సేవ జరుగుతుందో అదే నేను గమనిస్తాను. పేరుకోసం వందలకొలది సేవాదళ్ యూనిట్లు నెలకొల్పటం కాదు కావలసింది. ఒకటి, రెండు యూనిట్లలో అలాటి సేవ జరిగినా చాలు.
15. మీలో తొలగించుకోవలసిన దుర్గుణాలున్నాయి. ఆలాగే అలవరచుకోవలసిన సుగుణాలూ వున్నాయి. ఈనాడే మీరు ప్రతిజ్ఞ తీసుకొని మిమ్మల్ని మీరు సరి చేసుకొని ముందుకు నడవండి.
దివ్య ప్రసంగం -2
1. విజ్ఞానానికే మరొక పేరు వేదం, ఈ నాడు మానవజాతి ఎదుర్కొనే సమస్యలకు పరిష్కారం ‘విజ్ఞత ద్వారాపొందాలి. శ్రీ సత్యసాయి సంస్థల ఆదర్శం కూడా పవిత్రమైన ఈ సంస్కృతిని పోషించటమే.
2. మానవజాతి పురోగతికి నైతిక సంపద, శీల సంపద ప్రధానం. కనుక వీటిని మీరు అలవరచుకోండి. ముందు ఆత్మదృష్టి అలవడినపుడే శీల సంపద, నైతికదృష్టి పెంపొందుతాయి. కేవలం భౌతికదృష్టి పశుప్రవృత్తిని, పశువాంఛలను పోషిస్తుంది.
3. ఇమిటేషన్ (అనుకరణ) పనికిరాదు.
4. WATCH అనే మాటలో గల అంతరార్థాన్ని మీరు తెలుసుకోవాలి.
W - watch your words
A-watch your actions
T - watch your thoughts
C-watch your character
H-watch your heart
5 మీలో గల సత్వరజస్తమో గుణాల ప్రభావాన్ని గుర్తించండి. సాత్వికంగా వున్నారా, మీ ఆత్మయే పర బ్రహ్మగా గోచరిస్తుంది. రజోగుణంతో వున్నారా, మీ ఆత్మే మీకు జీవుడుగా కనిపించుతుంది. తమస్సులో ఉన్నారా దేహమే మీరుగా భావిస్తారు.
దివ్య ప్రసంగం - 3
1. జీవితాన్ని భగవత్ ప్రేమతో నింపుకోవటంలోనూ, ఆప్రేమను మానవరూపంలోని మాధవునికి అంకితం చేయటంలోనూ జన్మసాఫల్యం వుంది. ప్రేమలేని జీవితం భూమికి భారం.
2. ముందుగా మానసిక పరిశుద్ధత పొందాలి. అప్పుడే ఆ మనస్సు అజ్ఞానపుపొరను చీల్చగలుగుతుంది. శరీరానికి ఆరోగ్యం ఎంత అవసరమో మనస్సుకు పరిశుద్ధత అంత అవసరం.
3. ఆహార శుద్ధివలనే మనశ్శుద్ధి ఏర్పడుతుంది. శరీరం ఒక టార్చిలైటు. కళ్ళు బల్బులు, బుద్ధి స్విచ్, మనస్సు అనేది సెల్ వంటిది.
4. జాగ్రతావస్థ, స్వప్నావస్థ, సుషుప్తి అవస్థ- ఈ మూడు అవస్థలకు గల తారతమ్యాలు తెలుసుకోవాలి. వీటికి మూల ప్రాయమైనది దివ్య చైతన్య స్థితి. దీనినే భూమాఅంటాయి. ఉపనిషత్తులు. ఈ భూమాయే నేను ఇది దేశానికి, కాలానికి ఆతీత మైనది. అయితే సూర్యుని నుంచి పుట్టిన మబ్బు సూర్యుని ఆవరించినట్లు ఈ భూమా నుంచి నేను నుంచి అజ్ఞానం పుట్టి ఆత్మ స్వరూపమైన నేనును ఆవరిస్తోంది. సాధనవల్ల ఈ ఆవరణ తొలగిపోతుంది. ఈనాడు మీరు చేసే సాధన ప్రేమలో కూడిన సేవా సాధన. ఈ సేవ దేవునికోసం కాదు, నీ కోసం.
5. ఎవరో నగరసంకీర్తనలు వారానికి రెండుసార్లు చేస్తున్నారు. కనుక మనం వారానికి మూడుసార్లు నగర సంకీర్తన చేయాలి. అప్పుడు వారికంటే గొప్ప సేవకులం అనిపించుకుందాం. అని కొందరు చేస్తూ వుంటారు. అది తప్పు కొందరు హఠయోగము, రాజయోగము, క్రియాయోగమూ సాధన చేయాలని అనుకుంటారు. అవన్నీ భౌతికమైన కొన్ని ప్రయోజనాలు నెరవేర్చేవే. మీరు సాధించవలసింది ఈయోగాలు కావు, ప్రేమతో కూడిన సేవాయోగాన్ని సాధన చేయాలి.
6. సోహం భావనే నిజమైన ధ్యానం. దానిని సాధించి రూపధ్యానం చేయాలి. కనీసం 15 నిమిషాలు సోహం భావనలో రూపధ్యానం చేయాలి. అప్పుడు మీ యిష్టదైవంయొక్క స్వరూపాన్నే సర్వత్ర దర్శిస్తారు.
దివ్య ప్రసంగం – 4
1. ఆలోచనలు, మాటలు, చేతలు, అలవాట్లు, శీలం (వీటికి గల క్రమ పరిణామాన్ని భగవాన్ బాబా వివరించారు.) అన్నింటికీ మూలం మీ ఆలోచనలు. కనుక మీ ఆలోచనలను ముందుగా ప్రేమతో నింపుకోవాలి.
2. సేవాదళం శిక్షణ శిబిరం ఒక మిష మాత్రమే (Pre- text) దీనిద్వారా భగవాన్ శ్రీ సత్యసాయిబాబా తమ అనుగ్రహాన్ని వర్షిస్తున్నారు. అందుకే సేవాదళంలోకి మిమ్మల్ని భగవాన్ ఆకర్షించారు.
3. మీరు చేసే సేవద్వారా మీకు దైవ కృప ప్రాప్తిస్తుంది. మానవసేవే మాధవ సేవ, దైవం మానవ రూపంలో అవతరించి సేవచేయటానికి నడుం కట్టగా, మానవులందరూ కూడా ఈ సేవాసాధన స్వీకరించటం భగవంతునికి ఎంత ప్రీతికరమో యోచించండి.
4. ఈ సేవ చేస్తున్నందుకు మీరు గర్వించనవసరం లేదు. మీ సంపద, శక్తి, పదవి, భగవంతుని చేత మీకు అనుగ్రహించబడినవే. భగవంతుని అనుగ్రహించినదానినేసేవద్వారా మీరు భగవంతునికి అర్పించుతున్నారు. గంగా జలాన్ని గంగలోనే కలుపుతున్నారు. సర్వే సర్వత్రా మీరు దైవాన్ని సందర్శించండి. కష్టసుఖాల్లో, జయాప జయాల్లో దైవాన్ని చూడండి.
5. మీ మనో చాంచల్యంవల్ల మీలో ద్వంద్వభావాలు కలుగుతున్నాయి. ఏకత్వాన్ని దర్శించలేక మీ మనస్సు అనేకత్వాన్ని, వైవిధ్యాన్ని చూస్తోంది. ఇట్టి మనస్సుకు మీరు శాశ్వతమైన విలువలు చూడటంతో శిక్షణ యివ్వాలి. మొదట్లో ఈ సాధన కష్టంగానే వుంటుంది. కానీ చివరకు ఈ సాధన ద్వారా దేశాతీతమూ, కాలాతీతమూ, కార్యకారణ సంబంధముల కతీతము అయిన తత్వాన్ని మీరు గ్రహించాలి. మొట్టమొదటగా యిందుకు సగుణ స్వరూపాన్ని, ఏదో ఒక నామాన్ని, రూపాన్ని అనురక్తితో ధ్యానించాలి తర్వాత నిర్గుణ నిరాకారతత్వాన్ని అందు కోవాలి. ఈ సాధనలోని వివిధ దశలే భజనలు, ధ్యానము సంకీర్తనం, నగర సంకీర్తనం.
6. మానవుని పట్టి పీడించే నిజమైన వ్యాధులు నివారించే మందులు
అనేకత్వం, భిన్నత్వం - ఏకత్వ సాధన
ద్వేషం అనే రోగానికి మందు - ప్రేమసాధన
అహంకారం అనే రోగానికి మందు. నిరహంకార సాధన Attachment అనే రోగానికి మందు – జపధ్యానాలు
మందులు తీసుకున్నంత మాత్రాన రోగం తగ్గదు. మందు తీసుకొనేవారు అపథ్యం చేస్తే రోగం తగ్గదు. చిల్లిపడిన పాత్రలో నీరు పోస్తే నిలవదు. అలాగే శాంతి కావాలనుకుంటూ ఆశాంతి కలిగించే పనులు, ఆలోచనలూ చేయరాదు. సర్వత్రా వ్యాపించిన సర్వేశ్వరుణ్ణి చూడలేకపోతే అది దృష్టి దోషం.
. నేను స్వామికి 20 సంవత్సరాలు దగ్గరగా వున్నాను. అతడు గత 2 సంవత్సరాలు మాత్రమే దగ్గరగా వున్నాడు. అతని మీద స్వామికి అనుగ్రహం కలిగింది. నా పైన అనుగ్రహం కలుగలేదు, అనుకుంటారు కొందరు. అతడు 20 దెబ్బలు గత జన్మలో వేశాడు. ఈ జన్మలో 2 దెబ్బలతోనే అతనికి ఒక నిధి దొరికింది కాబట్టి కృపాసిద్ధి కోరేముందు మీ మనస్సును మీ ఆలోచనలనూ సరియైన తీరుగా మలచుకోండి. యద్భావం తద్భవతి.
7.పచ్చిగా వున్న పిందె పక్వం అయి మధురఫలం అవుతుంది. అలాగే యింద్రియాలతోటిగల సంపర్కాని విడదీసి మీ మనస్సుకు పరమేశ్వరుని తోటి సాంగత్యాన్ని అలవరచండి. దివ్యమైన ఆనందం లభిస్తుంది. ఒకసారి ఈ దివ్యానందం రుచిచేసే మీ యింద్రియాలన్నీ ఆనందాన్ని చూస్తాయి. ఆనందాన్నే వింటాయి. ఆనందాన్నే గ్రహిస్తాయి.
8. పాలలో వెన్నవలె భగవంతుడు సర్వత్రా వున్నాడు. సాధనచేసి వెన్నను వేరు చేసినట్లే. భగవంతునికూడా సాధన ద్వారా దర్శించగలరు. చాతకపక్షి ఆకాశంలో వున్న నీటి బొట్టునే గ్రహిస్తుంది. నేలమీద పడిన నీటిని గ్రహించదు. అలాగే ధైర్యంతో మానవుడు సాధన చేయాలి. దివ్యానుభవం అనే అమృత బిందువులు పొందాలి..
9. నామస్మరణ నగర సంకీర్తనల మహిమను (స్వామి వివరించినవి) మననం చేసుకొని ఆచరణలో వుంచాలి.
10. ఎంతో సాహసంతో ఆధ్యాత్మిక సాధనలో పురోగ మించాలి. లోకాన్నంతటిని నీవు జయించగలిగినా నిన్ను నీవు జయించుకోవటం చాలా కష్టం, ఈ కష్టతరమైన సాహసమే చీకటినుండి వెలుగులోకి, అసత్యం నుంచి సత్యంలోకి, మరణం నుంచి అమరత్యంలోకి జరిపే ప్రయాణం. ఈ ప్రయాణానికి స్త్రీలు, పురుషులు అనే తేడాలు లేవు,
11. నేను ఎల్లెడలా ఉన్నానని, అంతటినీ చూస్తున్నాననీ మీరు గ్రహించితే మీ సాధనలో నిజాయితీ, చిత్తశుద్దీ క్రమశిక్షలు అలవడుతాయి. సేవా సమితిలో మీరందరూఆనందోత్సాహంతో ఉప్పొంగుతూ వుండాలి. చేసిన కృషికి మించినటువంటి సేవలను చేయటం కోసం మీరు భవిష్యత్తు కార్యక్రమాలను రూపొందించుకోవాలి. ఇందుకుప్రేమభావన సద్భావన పరస్పర సహకారం, సహనం అనేవి ఎల్లప్పుడూ మీ హృదయాల్లో ప్రవహించాలి.
12. ఈ సేవాదళ్ లోని వివిధమైన యూనిట్లు సాయి స్వరూపంలోని వివిధమైన అంగాలుగా మీరు భావించాలి.
(సే.యో.పు.67/73)