"ఓ స్వామి! నీవు సకలగుణసంపన్నుడవు. సత్పురుషులకు దుర్మార్గులకు గల తారతమ్యమును వివరించి చెప్పుము" అని ప్రార్థించెను.
"ఓ తమ్ముడా! వేదపురాణములలో చెప్పిన విధమున సత్పురుషుల గుణములు అనంతములు. చందన తరుపునకును గొడ్డలికిని యెట్టి సంబంధము కలదో సత్పురుషులకు దుర్మార్గులకు అట్టి సంబంధము కలదు. చూడుము. గొడ్డలి చందనతరువును నరికినకును దాని సుగంధమును గొడ్డలికిచ్చును కదా! ప్రాణమును దీసుకొన వచ్చినదానికి సహితము అది సుగంధము నిచ్చును. అందుచేత శ్రీగంధము సర్వజననమ్మతము. దేవతలు దానిని శిరస్సుపై ధరింతురు. హితవు చేసిన వృక్షమున కపకారము చేయుటవలన గొడ్డలికి వచ్చిన పాట్లు చూడుము. దానిని నిప్పులో కాల్చి సుత్తితో కొట్టుచుందురు కదా. ఈ ప్రకారమే ఖలులు సత్పురుషులకు దుఃఖము నిచ్చెదరు. అయినను సజ్జనులెప్పుడు వారికి ఉపకారమే చేయుచుందురు. దీని ఫలమేమి? సజ్జనులు స్వర్గమునకు పోదురు. అనగా నిరంతర మానందముగనుందురు. దుర్జనులు నిరంతరము సంతృప్తితో, దుఃఖములతో కుములుచుందురు. వారలు నరకయాతనల ననుభవించుదురు. నిందలు నిష్ణూరములతో పైకి ఉల్లాసముగా కనిపించినను లోలోన కృశించుచుందురు.
సత్పురుషుల గుణములను చెప్పెదను వినుము. వారు విషయాసక్తులు కారు. సకలగుణశీలసంపన్నులు. ఇతరుల సుఖమును చూచి సంతసించి వారల దుఃఖములను చూచి దు:ఖింతురు వారు సమదర్శనులు! వారికి శత్రువులు లేరు. వారికి శత్రుబాధలే లేవు. వారు జ్ఞానవిజ్ఞానవైరాగ్య సంపన్నులు. వారల చిత్తములు కోమలములు, దీనులయందు వారికి దయ మెండు. త్రికరణశుద్ధిగా వారు నా పాదములను సేవింతురు. వారికి మానభిమానములన్నవి ఉండవు. వారు నిరంతరము పరోపకారమును చేతురే కాని స్వార్థమును కలయందైనను కోరరు. వారల ప్రవర్తన సరళము. వారల హృదయములు శీతలములు, వారు త్యాగశీలులు ఎల్లప్పుడూ వారు సంతోషముగనే యుందురు. తమ్ముడా యా లక్షణముల నెవ్వడు కలిగియుండునో అతడు ఆత్మస్వరూపుడు అని తెలిసికొనుము. ఆత్మస్వరూపుడేమిటి. నేను వారు వారేనేను అని గ్రహింపుము. వారలకు దూషణ భూషణములు సమానము.
ఇక దుర్జనుల లక్షణాలను చెప్పెదను వినుము. వారల సాంగత్యమును అన్ని విధములా విడిచి పెట్టవలెను. వారల సహవాసము వలన దుఃఖము ప్రాప్తించును. పరుల సంపదలను చూచి వారి హృదయము లెప్పుడును పరితపించును. పరదూషణ విని వారు సంపద వచ్చినట్లు తలంచి సంతసింతురు. అరిషడ్వర్గములు వారిని ఆశ్రయించియుండును. ఆశ్రితులు చెప్పినట్లు వారు సంచరింతురు. వారికి దయాదాక్షిణ్యములు శూన్యము. కుటిలులు, కారణము లేకయే పరులతో కలహింతురు. ఉపకారము చేసిన వారితోసహా వారు నిరోధించెదరు. వారి మాటలు వారి కార్యములు, వారిబోధనములు, యిచ్చిపుచ్చుకొనుటయు సర్వమూ అసత్యములు. వారి హృదయములు కఠోరములు. నెమలి పైకి చూచుటకు చక్కగా నుండును. దానికేక విన సొంపుగా నుండును.అయిననది. పాములను భక్షించును కదా! అటులనే దుర్జనులని తెలిసికొనుము. పరహింసాపరాయణులు, పరదారాసక్తులు, పరనిందారతులు, పాపకర్మలు పాపాత్ములు మనుజాధములు. వారికి యముని భయము లేదు. ఇతరుల అభివృద్ధినొందుట చూచి, విని, పసిపట్టినట్లు వారు తలనొప్పిచే బాధపడుచుందురు. ఇతరుల విపత్తుల జూచి వారు సంతసింతురు. పరుల కష్టములను చూచి దేశమునకు రాజయినట్లు వారు సంతోషింతురు. వారలకు స్వార్థము తప్ప పరోపకారమన్నది స్వప్న ముందైనను వుండదు. వారి హృదయము కామ క్రోధాదులకు పుట్టినిల్లు, వీరికి తల్లిదండ్రులని, గురువులని, పెద్దలని, లక్ష్యములేదు. సత్పురుషులన్నను, భగవంతుడన్నను, వారలకు తలనొప్పి వచ్చును. వారు మందమతులు, అవగుణధాములు, కామాంధులు. వీరిని అధికముగా కలియుగములో చూడవచ్చును. ఓ తమ్ముడా! పరోపకారముకంటే ధర్మము మరొకటి లేదు. పరహింసకంటే అధికమగు పాపము లేదు. ఇదియే వేదపురాణముల సారము. ఇదియే సత్పురుషుల మతము. మనుజాలై పుట్టి పరహింసచేయువారు నీచ యోనులయందు పుట్టి చచ్చుచుందురు. మనుజులు అజ్ఞానాంధకారమునబడి అనేక పాపములు చేయుచుందురు. ఇట్టివారికి నేనుప్రారబ్ధ కర్మస్వరూపుడవై కాలాంతరమున ప్రత్యక్షమగు చుందును. అట్టివారిని సంసారములో పడత్రోసి వారిని శుభ, అశుభకర్మలననుభవింప చేయుదును.
ఓ భరతా! దేవతలును మునులును మహాత్ములును శుభాశుభముల నిచ్చునట్టి కర్మలను విడిచి పెట్టి సదా వారు నన్ను భక్తితో భజించెదరు. వారునిష్కామ్యముగ కర్మల నాచరించెదరు.కామ్య తపస్సులను, కామ్యకర్మలను చేసినయెడల వాటి శుభాశుభఫలముల ననుభవించుటకు దేహమును ధరించ జీవులు సంసారములోనికి రావలెను.ఏ కర్మలు చేసినను వాటిఫలము నపేక్షింపక వాటి నొనరించినయెడల మనుజునకు జ్ఞానము కలుగును. భక్తిప్రపత్తులు అభివృద్ధిగాంచును. వాటి మూలమున వాడు ముక్తిని సామీప్యమున అనుభవించును. ఈ విధముగా సజ్జన దుర్జన లక్షణములను మీకు విశదపరచితిని. ఈ లక్షణములను తెలుసుకొనినవాడు సంసారసాగరములో బడి మునిగియుండడు. "తమ్ముడా! అనేక విధములగు సుగుణదుర్గుణములన్నియూ మాయా సంకల్పితములని తెలిసికొనుము. ఈ రెండు గుణములను లక్ష్యము చేయనివాడు సజ్జనుడు, మహాత్యుడు, అతనే ఆత్మ స్వరూపుడు. ఈ గుణముల రెండింటికి వశుడగువాడుమూర్ఖుడు. అదియే అజ్ఞాన” మని ఈ ప్రకారము రాముడు తమ్ములకు వివరించెను. శ్రీరామునియుపదేశములు వారు విని స్వాస్థ్యము పొందిరి. వారి హృదయములు ప్రేమతో ఉప్పొంగెను. మాటిమాటికి వారు రామునకు శిరస్సులువంచి నమస్కరించిరి. అందరికంటే అధికముగా హనుమంతుడు బ్రహ్మానంద మొందెను. ఆనంతరము తమ్ములతో కూడి హనుమంతునితో సహా శ్రీరాముడు రాజమందిరిమునకు పోయెను.
(రా.వా.రె.పు.221/225)