స్త్రీ ధర్మము

సుగుణమే తన సౌందర్యమువలె, శీలమే తన శ్వాసమువలె, లజ్ఞనే తన ప్రాణమువలె, సత్య ప్రవర్తనే తన నిత్య కర్తవ్య కృత్యమువలె తలంచి పాపభీతి, దైవభీతిని తన హృదయమున మొలకలుగా నాటుకొని పెంచి స్త్రీ నిజాయితిని నిలబెట్టి, స్త్రీ ధర్మమును ధార్మిక, నైతిక, భౌతిక మార్గములందుకూడనూ, మానసిక, శారీరక వాక్కులందు సహితము, తన సత్య ధర్మమును నడిపించి సర్వవిద్యలలోని సారము అదియేనని గ్రహించి, మాన మర్యాదలతో ప్రాణము వొడ్డి, పతివ్రత ధర్మమును పాటించుటే స్త్రీల యొక్క అతి ముఖ్య ధర్మము. వారి జన్మమునకు కారణమే ధర్మము.

(శ్రీ.. సనూ. పు.110)

 

 మీ స్వభావము సహజముగా మృదువు. ఆ మృదుత్వము నభివృద్ధి చేసికొనుడు. దానివలన మీ భాషణములు మధురము లగును. మీ ప్రతి వాక్యమును, హృదయమునుండి, శుద్ధముగా - సూటిగా - వెలువడవలెగాని, కోపము-ద్వేషము-కృత్రిమత్వము-లోకాచారము-ఇచ్చకము అను దుర్గుణములతో కలుషితమై, వక్రమార్గమున వెలువడగూడదు. అట్లెన " మీరందరి హృదయములలోను, సంతోషమును-ప్రేమను వ్యాపింపజేసిన వారగుదురు.  మీ తల్లిదండ్రులు, మీరు కోరు వెలగల దుస్తులను, ఆడంబరపు వస్తువులను కొనియివ్వ శక్తి లేక, ఆసంగతి మీతో చెప్పినప్పుడు, మీరు వారిమీద ఉగ్రులు కాకూడదు. తగవులాడగూడదు. లోకములోని మూకమెప్పుకొరకు, వేషములు వేయవలెనను ఉబలాటమును నిగ్రహింపగల నిబ్బరము మీకుండవలె.  దేహాపోషణ మెంత ముఖ్యమో గుణపోషణమును-అంత ముఖ్యము; జ్ఞప్తి యందుంచుకొనుడు. మీరు చూపరుల నాకర్షించు వస్త్రములు ధరించి, పుస్తకముల పేర్పులతో బస్సు లలంకరించి, పోవుచూ - వచ్చుచూ ఉందురు. కాని, స్త్రీకి శీలమే-నిరాడంబరమైన సద్వర్తనమే - గొప్పయందము. అదే స్త్రీకి రక్షకము. ప్రాధాన్యమియ్యవలసినది పవిత్రవర్తనమునకుగాని, పైవేషమునకు కాదు. నేటినుండియైనను మీరట్టి వర్తనము నలవాటు చేసికొనుడు. అది మీకు కవచమై, అన్ని యాపదల నుండియు మిమ్ము కాపాడును. మీరు ప్రతిదినమును, ఏదో యెక నిర్ణీత సమయమున, నియమముగా, భగవంతుని ప్రార్థింపుడు; భగవన్నామము జపింపుడు; భగవన్మహిమను ధ్యానింపుడు.  అందువలన గలుగు ఫలము, అనుభవముమీద మీకే తెలియును.  ఆఫలము రుచి యెట్లుండునో, కొంచెము తెలిసినచో, తరువాత సాధన కుపక్రమింతు మనగూడదు. సాధన చేయక ఫలము రాదు; ఫలము రానిదే రుచిచూచుట కుదురదు. మీరు సాధన చేయుడు. వెంటనే ఫల మనుభవమునకు వచ్చును. వచ్చి తీరవలె.

ఈ కళాశాలకు మహారాణి కళాశాల యని పేరు. కావున మీరీ కళాశాలలో కళాశోభితులై, పిమ్మట నుత్తమ గృహిణులై, గృహరాజ్య వ్యవహారనిర్వహణమున మహా రాణులుగా విరాజిల్లవలెనని నా యాశాస్యము. మహారాణులు భవనములనుండి బయటికి రాక, అంతః పురములలోనే యుండి, గవాక్షములనుండియు, అవరోధములనుండియు తిలకించుచు, ప్రజల యోగ క్షేమములు విచారించుచుందురు. వారితరుల కంటబడరు. అదియే శాస్త్రములలో చెప్పబడియున్న, ఉత్తమ స్త్రీ ధర్మము .. మీరును విచ్చలవిడిగా తిరుగుచు, పరుల దృష్టిలో పడగూడదు. మిమ్ము గురించి ముచ్చటించుకొనుటకు వారి కవకాశ మియ్యగూడదు. మీ గృహములలో నుండియే, మీ పురుషులతో పాటు అన్ని కార్యములలోను, పాల్గొనుచుండవలెను. -

నీ వితరుల వలన గౌరవము పొందగోరుదువేని, నీవును వారిని గౌరవింపవలెను. ఇతరులు నిన్ను సేవింప నభిలషింతువేని, మొదట నీవు వారిని సేవింపవలెను. ప్రేమ ప్రేమను పుట్టించును. నమ్మకము నమ్మకమును కలిగించును. స్వాతిశయమూ, స్వార్థపరత్వమూ-విపత్తిని వెంటబెట్టుకొని వచ్చును. ఇతరుల నుపచరించుటవలన గలుగు సంతోషముతో, మరి యే సంతోషము తులతూగదు. మీరీ గడియారము వలె, సర్వసమదృష్టి కలిగియుండవలెను. ఇది, గొప్పవారు కొద్దివారను భేదము లేక, యెవరు కోరినను సరియైన కాలమునే చూపుచుండును. దీనికి ప్రియము, అప్రియము - అనునవి లేవు. (శ్రీ సత్య సాయి వచనా మృ తము 1964 పు 82-83)


About Us

Sri Tumuluru Krishna Murty and his late wife, Smt. Tumuluru Prabha are ardent devotees of Bhagavan Sri Sathya Sai Baba

Read More

Reach Me

Sri Tumuluru Krishna Murty

E-mail : hello@srisathyasaidigest.com

Subscribe For Contemplate Massage