రామాయణతత్త్వమంతా అద్వైతత్త్వంగా నిరూపిస్తూ వచ్చింది. మానవజీవితములో సాధించవలసినది ఏమిటి? విసర్జించవలసినది ఏమిటి?అనే సత్యాన్ని రామాయణం చక్కగా ప్రబోధిస్తూ వచ్చింది. స్త్రీ పురుషుల ఉపాధి భేదములే తప్ప మానసిక సంబంధమైన పరిస్థితలు ఇరువురకు సమానమే. దుఃఖమొస్తే వీరు బాధపడతారు, వారు బాధపడతారు. క్రోధముచేత వీరు ఉగ్రులౌతారు. వారు ఉగ్రులౌతారు. ఆకలి వేస్తే మీరు తింటారు, వారు తింటారు. బాధలు వస్తే వీరు బాధపడతారు. వారుబాధపడతారు. ఇందులో ఒక విధమై వ్యత్యాసమున్నది? ఒకరు నిగ్రహించుకోవచ్చు. ఒకరు నిగ్రహించుకోలేక పోవచ్చు. నిగ్రహానుగ్రహములు రెండు మనస్సుప్రతిబింబములే కాని అన్యము కాదు. కనుక దివ్యత్వాన్ని సమత్వంగా భావించుకోవటమే అత్యవసరమైన ఆధ్యాత్మికం. వ్యక్తిత్వాన్ని ఆధారం చేసుకొని మానవులు అహంకారంతో మిడిసిపడుతుంటారు. ఇది సరికాదు. ఒకానొక సమయము లో పురుషులము అధికారులమని పురుషులకన్న శక్తి స్త్రీలకు లేదని పురుషులు అన్నింటియందు ముందంజవేసే ధీరులని, వీరులని, గంభీరులని భావిస్తుంటారు. స్త్రీలుబలహీనులని వారికి అధికారము లేదని, వారు దీనిని సాధించలేరని వారి శక్తి సామర్థ్యములు చాలవని ఊహిస్తుంటాము. ఇది కూడ వారి భావములలో భేదము తప్ప అన్యము కాదు. ఒక ఇంటికి కొత్తగా అల్లుడై వచ్చాడు. ఆ యింటిలో చక్కగా విందును ఆరగించి తాంబూలములు వేసుకోవటానికి కూర్చున్నారు. అతను మహాతేజో వంతుడని గొప్ప తెలివి తేటలు కలవాడని మహాత్యాగి అని అనేక రకములుగా వర్ణించుకుంటూ పోతున్నాడు. ఇంతటి మేధాశక్తి కలిగిన అల్లుడు తనకు లభించాడని మామకూడను వెర్రివాడై విర్రవీగుతూ వచ్చాడు. ఈ మేధాశక్తి యందు కవిత్వము కూడను తెలుసునని తన పిత్తము ప్రకటించినది. తాంబూలము నకు తగిన పదార్థములన్ని తట్టలోనే ఉన్నాయి. తాంబూలము నకు కావలసినవేమిటి? వక్క ఆకు సున్ననము - ఈ మూడు కావాలి. ఇవన్నీ ఉండినప్పటికి తన శక్తిసామర్థ్యముల అహంకారముచేత ఏదో ఒకటి ప్రశ్నించాలని మరదలిని ఆగౌరపరచాలని సంకల్పించుకున్నాడు.
"పర్వత శ్రేష్ట పుత్రిక పతివిరోధి
అన్న పెండ్లాము అ త్త ను గన్న తండ్రి
ప్రేమ మీరంగ నాతని పెద్దబిడ్డ
సున్న మిప్పుడు తేగదే సన్ను తాంగి"
అన్నాడట. దీని అర్థమేమనగా పర్వత శ్రేష్ఠపుత్రి = పార్వతి. పతివిరోధి అన్న పెండ్లాము అత్తనుగన్న తండ్రి. పత్రి ఎవరు? ఈశ్వరుడు. ఈశ్వరునికి ఎవరు విరోధి? మన్మధుడు. అతని అన్న బ్రహ్మ. ఆయన పెండ్లాము అత్తను గన్న తండ్రి. ఆయన పెండ్లాము సరస్వతి. ఆసరస్వతి అత్త లక్ష్మి ప్రేమ మీరంగ అతని పెద్దబిడ్డ. ఆమె తండ్రి పేరు సముద్రుడు. ఆయన పెద్దబిడ్డ దరిద్రదేవత. కనుక ఓ దరిద్రదేవతా! సున్నము తీసుకొనిరా అన్నాడు. కవిత్వములో ఆమె ఈయనకంటె గొప్ప తెలివితేటలు గలిగిన స్త్రీ . ఆమె లోపలికి పోయి సున్నం తీసుకొని వచ్చింది. చేతిలో పట్టుకుంది. బావగారి కందించలేదు.
"శత పత్రంబుల మిత్రుని
సుతు చంపినవాని బావ మానుని మామన్
సతరము దాల్చెడు అతని
సుతు వాహన వైరివైరి సున్నం బిదిగో!
అనిందట ఆయమ్మ. శత పత్రంబుల మిత్రుని. శతపత్రమనగా కమలము. ఈ కమలము మిత్రుడైనవాడు సూర్యుడు. ఈ సూర్యుని చూస్తే కమలము విచ్చుకుంది. సుతు డెవడు? కర్ణుడు. కర్ణుని చంపిందెవరు? అర్జునుడు. అతనియొక్క బావ కృష్ణుడు. అతని కుమారుడు మన్మధుడు. "మదనో మన్మ ధొ మార: ప్రద్యుమ్నో మీనకేత నఃకంద ర్పో దర్శకోఽనంగ: కామ: పంచశరః స్మరః " మన్మధునకి ప్రద్యుమ్నుడని పేరు. ఈ మన్మధుడు కృష్ణుని కుమారుడు. అతని మామ చంద్రుడు. చంద్రుని ఎప్పుడు తల పైన పెట్టుకునేవాడు ఈశ్వరుడు. అతని కుమారుడెవరు? గణపతి. ఆతని వాహనమేమిటి? ఎలుక. ఆ ఎలుకకు వైరి ఎవరు? పిల్లి. ఆ పిల్లికి వైరి ఎవరు? కుక్క. ఓ కుక్కా! ఇదిగో సున్నము అనింది. చూచారా! మగవారి అహంకారం ఎంతట్లో అణగిపోయింది. పురుషుడు శక్తిసామర్థ్యములు గలిగిన వ్యక్తిగా మనం భావిస్తున్నాము కాని అంతకంటే శక్తి సామర్థ్యములు కలిగిన స్త్రీలు లేక పోలేదు. ఉపాధిభేదములచేత జగత్తునందు శ్రీపురుషభేదములు భావించవచ్చుగాని దైవతత్త్వము నందు సర్వులు ఒక్కటే. దరిద్రదేవత అని చెప్పనక్కరలేదు. చెప్పకుండా ఉంటే కుక్కా అనిపించుకోనక్కరలేదు. ఇదే విధముగనే మానవుడు ప్రాకృతమైన భావములను అభివృద్ధి పరచుకొని ప్రాకృత చర్యలయందే తన జీవితాన్ని వ్యర్థం గావించుకుంటున్నాడు.
(శ్రీ స.వి.వా. పు.99/101)