రాముడు, అందుకొని "స్వామీ! సరి, బ్రహ్మానుగ్రహముతో పుట్టుటచే తపశక్తినే పొందుటచే, మహర్షుల శాపముచేఘోరమయిన రాక్షసాకారము కలుగుటచే మహా బలముతో, పరాక్రమములతో స్వేచ్ఛా విహారము జరుపుచుండ వచ్చును. ఎంత బలశక్తులుండిననూ తాను అబలయే కదా? స్త్రీ హత్యా పాపము ఘోరమైనది. కదా? అందువలననే అగస్త్యుడుకూడనూ ఆమెను చంపక ఇట్టి వికార రూపముకమ్మని శాపమొసగెను. లేకున్న పతిని శపించిన మహర్షి సతిని శపించలేకపోయెనా? హత్యకు పూనుకొనుట పురుషసింహములకు తగిన సార్థకము కానేరదని వినియుంటిని. ఇందుకేమి చేయుమందురో? ఆజ్ఞ యెసగుడు" అని తనలోని సందియములను విశ్వామిత్రుని ముందు పెట్టగా, విశ్వామిత్రుడు కూడనూ సంతసించి, "రామా! స్త్రీ హత్య మహా పాతకమని నాకుమాత్రము తెలియకపోలేదు. అయితే గో, బ్రాహ్మణ సాధు సంరక్షణ అత్యంత ప్రధానములు, ధర్మము పై మూడింటిలో ఇమిడియున్నది.ధర్మరక్షణకై అధర్మమును నిర్మూలము చేయుటలోయెట్టి దోషమును రాదు. "ధర్మోరక్షతి రక్షితః". అన్న ఆర్యోక్తినీ వెరుగవా? ఇది స్వార్థమునకు సలుపు హింస. కానేరదు. లోకరక్షణకై చేయుటలో యెట్టి దోషమూ ఆంటదనియే నానుడి. అంతయేకాక, సృష్టి, స్థితి లయములు దైవ సంకల్పములు. అవి మానవమాత్రుల కల్పితములు కావేరవు. నీవు దైవాంశసంభూతుడవు.నీ కట్టి అధికారము కలదు. అగ్ని కెట్టి మాలిన్యమూ అంటనటుల, దైవమునకు ఎట్టి పాపమూ అంటదు. రక్షించుట కెంత అధికారమో, సృష్టించుట కెట్టి సంకల్పమో శిక్షించుటకూ అట్టిసంకల్ప అధికారములుండును. పాపమునకు తగిన శిక్ష యేనాటికైననూ తప్పునది కాదు. ఇంకను అనేక పాపములు చేసి పూర్తిగ హీనమగుట కంటె, ఈనాడు నీ హస్తములతో మరణించుట ఆ తాటకి పుణ్యమే అని చెప్పవచ్చును. నీవు దానికిని, దేశమునకునూ ఉపకారము చేసినవాడవే అగుదువు. కానీ, అపకారముకాని పాపముకాని చేసిన వాడవు కానేరవు. ఈనాడు నీవు దయతలచి వదలినచో, లోకమునకు తీరని లోటు ధర్మమునకు హాని కలుగుటయేకాక,ఆ తాటకి పాపమును కూడనూ అధికము గావించినవాడ వగుదువు. వేయేటికి దివ్యదృష్టితో నేనెరిగితిని.నీవు రాక్షస సంహారమునకే అవతరించితివి. ఇది నీపని. నేడు చేయునది కాని మున్ముందు చేయనవిగాని, ధర్మరక్షణ, రాక్షసమర్దన ఈ రెండూ నీ జన్మకు కారణములు, యీ సత్యమును నే తెలిసికొనియే నీ చెంతకు పరుగిడి వచ్చితిని. లేకున్న నిన్ను ఆశ్రయించవలసిన పని నాకేమున్నది. మహాఋషులు, సాధు పుంగవులు లోకక్షేమ నిమిత్తమై రాజులు నాశ్రయించు చుందురే కాని వారి స్వార్థమునకు కాదు. సర్వ సంగ పరిత్యాగులై కాయములను కంద మూలాదులతో కొంతకాలము నింపి కడకు అట్టి అహారమును కూడ నూ విసర్జించి, కాయముల నలక్ష్యపరచి కాంతిలో లీనము కానున్నవారలు పరుల రక్షణెందులకు ఆశింతురు? ఏమి జరిగిన వారి కేమి నష్టము? అయితే జ్ఞానులు, తమకు తాము తరించుటేకాక తాము తెలిసికొన్న సత్యమును, లోకులకు తెలిపి, ఆచరించి అనసరింపజేసి లోకమున జీవులను తరింపజేయ సంకల్పింతురు. లోకములో మాకేమియని జ్ఞానులు తమ మార్గమునే తాము చూచుకొన్న జీవులు భ్రష్టులయి, ధర్మమును నశింపజేతురు.
ఇట్టి పవిత్ర లక్ష్యమును పక్షమున నిడుకొనియే మహాఋషులు లోకులతో సంబంధమును కలిగియుండిరే కానీ, వారికెట్టి స్వార్ధమును ఉండదు. వారు జలములోని తామరల వంటివారు. లోకులతో కలసి మెలసి యున్ననూ లోకవాసనలను వారలలో చేర్చరు. లోకోద్గారము మాత్రమే చూతురు. ధర్మరక్షణ మాత్రమే చేతురు. దైవమున మాత్రమే చూతురు. ధర్మరక్షణ మాత్రమే చేతురు. దైవమును మాత్రమే ఆశ్రయింతురు." అని ఉన్న సత్యమును రామునికి విన్నవించగనే రాముడు యేమియు తెలియని వానివలే "స్వామీ! మహాఋషుల అంతర్ భావములు మహాపవిత్రమైన అర్థములతో కూడి యుండుట లోకులు గమనింపరు కదా? వారు తెలిసికొను నిమిత్తమై తమరిని నేనీ ప్రశ్న వేపితినే కాని, వేరు భావము
కాదు. ఏమిఎటులైననేమి? నా తండ్రి ఆజ్ఞ ననుసరించినేనడుతును. విశ్వామిత్రులవారు చెప్పినటుల నడచు కొమ్మని నాతండ్రియగు దశరథుడు తెలిపెను కనక పితృవాక్యపరిపాలనయే నా వ్రతము. తాము మహా ఋషులు, మహాతపప్పంపన్నులు, అట్టి మీరే తాటకి వధ న్యాయమని తెలుపుటచే నా తప్పేమియు నూ లేదు. అంతియేకాక గోబ్రాహ్మణ హితము కోసము, ప్రజా క్షేమము కోసము ధర్మరక్షణ కోసము, తామాజ్ఞాపించిన యే కార్యమైనమా చేయుటకు నేను సంసిద్ధుడనని, వింటిని పిడికిటితో పట్టి దశదిశలు మారు మ్రోగునట్లు టంకారము చేసను.
(రా.వా.మొ. పు.78/80)