ఒక నాడు రామలక్ష్మణులు సీతను పర్ణశాలలో వదిలిపెట్టి చుట్టుప్రక్కల ప్రాంతాలలో సంచరిస్తున్నారు. రామచరణమే తనకు శరణమని భావించుకున్న లక్ష్మణుడు ఒక ప్రదేశమునకు వెళ్ళేసరికి "అన్నా! నేనింక ఈ ఆడవిలో ఉండలేను. ఈ బాధలను భరించలేను. తక్షణమే అయోధ్యకు వెళ్ళిపోతాను అన్నాడు.
రాముడు నవ్వుతూ లక్ష్మణా! తొందర పడకు, తొందరపడకు. పర్గశాలకు పోయిన తరువాత ఈ విషయం ఆలోచిద్దాము అన్నాడు. కొంతదూరం నడచి ఇరువురూ ఒక చెట్టు క్రింద చల్లని ఛాయలో కూర్చున్నారు. అప్పటికి లక్ష్మణుని మనస్సు మారి పోయింది.
రాముడు లక్ష్మణా! ఎప్పుడు వెళతావు అయోధ్యకు? అని ప్రశ్నించాడు. లక్ష్మణుడు నిర్ఘాంతపోయి రామా! ఆయోధ్యతో నాకేమి పని ఉంది? నీవే నా సర్వస్వము. నిన్ను వదలి అయోధ్యకు వెళ్ళాలనేభావం నాకు కలలో కూడా లేదు" అన్నాడు. “మరి కొద్ది సేపటి క్రితం అయోధ్యకు వెళ్ళిపోతానని చెప్పావు కదా!" అన్నాడు రాముడు. ఆవిధంగా ఎందుకు అన్నానో నాకు తెలియదు అన్నాడు లక్ష్మణుడు,అప్పుడు రాముడు చెపుతున్నాడు: లక్ష్మణా! దీనికి కారణం స్థల ప్రభావమే. ఇంతకు ముందు మనం శూర్పణఖ సంచరించిన ప్రదేశంలో సంచరించాము. కాబట్టి ఆ శూర్పణఖ భావాలే నీలో ఆవిర్భవించాయి. ఆ ప్రదేశం దాటి ఇప్పుడు మనం చిత్రకూట పర్వతంపైకి వచ్చాము. ఇది మహర్షులు నివసించిన ప్రదేశము. కాబట్టి ఇక్కడకు వచ్చేసరికి నీలో మహర్షుల భావాలు ఆవిర్భవించాయి."
మీరు సంచిరంచే ప్రదేశం కూడా పవిత్ర మైనదిగా ఉండాలి. దుష్టులు, దుర్మార్గులు సంచరించే ప్రదేశంలో మీరు ఉండకూడదు. త్యజ: దుర్జన సంసర్గం ,చెడు ఉన్నదంటే దాని నుండి బయటికి పోవాలి. ‘భజ సాదు సమాగమం . మంచితో సంబంధము నేర్పర్చుకోవాలి. కురు పుణ్య మ హోరాత్రం . నిరంతరము మంచినే చేస్తూ జీవించాలి. "స్మర్మ నిత్య మనిత్యతాం . ఏది నిత్యము ? ఏది అసత్యము? అనే విచారణ చేయాలి. ఇవే మీరు చేయవలసిన సాధనలు. కంటికి కనిపించేదంతా అనిత్యమే. నిత్యసత్యమైనది ఆత్మతత్వ మొక్కటే. దానినిఆశ్రయించడమే శరణాగతి. కనుక ఆత్మ భావాన్నిపెంచుకొని. ఆత్మచింతనతో మీ జీవితాన్ని సార్థకం గావించుకోండి. ఈ విధమైన సాధన చేసినప్పుడు దైవంమీ ఇంటనే, వెంటనే, జంటనే ఉండి మిమ్మల్ని అన్ని విధాలుగా కాపాడుతాడు.
(స. సా.ఆ.98పు.280)