స్థితప్రజ్ఞాని లక్షణములను తెలుపుమని కేశవునిప్రార్థించగా! "పార్థా! మనోగతాలైన సర్వవాంఛలను సంపూర్ణముగా యెపుడు వదలి ఆత్మయందు ఆత్మలో సంతోషించువాడై యున్నాడో అట్టివాడే స్థిత ప్రజ్ఞుడు" అని చెప్పి ఈ విధముగా విశదీకరించెను. "ఇందులో రెండు పద్ధతులున్నవి. ఒకటి విధ్వంసక పద్ధతి. రెండవది విధాయకపద్దతి. మనసునందుకల సర్వఆశలూ వదలుట విధ్వంసకము, అంతఃకరణములో సంతోషముగా ఉండుట విధాయకము! హృదయ భూమిలో మొలిచిన మలినపు మొక్కలను పెరికి వేయుట-హృదయమును నిర్మలముచేయుట - విద్వంసకము! నిర్మలమైన హృదయభూమిలో భగవత్ రతిని నాటుట - విధాయకము! కావలసిన పంటను పెంచుకొనుట విధాయకము. అవసరములేని మలినపు మొక్కలను పెరికివేయుట విధ్వంసకము! ఇందులో విషయ వాసనలు అవసరములేని మొక్కలు: భగవత్రతి అవసరమయిన మొక్క అని భావించవలెను. కోర్కెల యొక్క మూటే మనసు, ఎప్పుడు కోర్కెలు పోవునో అప్పుడు మనసు వుండదుకదా!
(గీ.పు.37/38)
కోరికలేకపోయిన మనసుకు రూపమేలేదు. యెప్పుడు మనసే లేకుండునో అప్పుడే స్లిత ప్రజ్ఞుడు; కాన, కామముల నిగ్రహము సాధించవలెను!
(గీ.పు.38)
స్థితప్రజ్ఞుని ఆత్మానందమునకు బాహ్య వస్తువులు వినియోగ పడవు.
(గీ.పు.39)
సుఖములు కాని దుఃఖములు కానీ మూడు విధములు. ఒకటి ఆధ్యాత్మికము, రెండవది అధిభౌతికము, మూడవది అధి దైవికము. సుఖ దుఃఖములు పాప పుణ్యముల సంబంధములు. పాపములను చేయవద్దని చెప్పుటకే దుఃఖములు వచ్చుచున్నవనియు, పుణ్యములు చెయ్యమని చెప్పుటకే సుఖములు వచ్చుచున్నవనియు తలంచవలెను.
కానీ స్థితప్రజ్ఞుని యేదు:ఖమూ బాధించదు; యే సుఖమూఆకర్షించదు! కష్టములకు కలతపడడు! సుఖములకు లొట్టలువేయడు. ఆత్మ విషయము తెలియనివారే ఈ రెంటికీ పొంగి కృంగేది.
స్థిత ప్రజ్ఞుడు మనవశీలుడు. అనగా ముని అందురు. స్థితబుద్ధి కలవాడే స్థితప్రజ్ఞుడు. ఇంద్రియ నిగ్రహం సాధకునకు అగత్యం, అయితే అదే సర్వస్వము కాదు అని తెలిసికొనవలెను. విషయానికి మనస్సును శేషించి యున్నంతవరకూ ఇంద్రియ నిగ్రహం పూర్ణత్వము పాందదు. అందుకనే ఆర్జునునకు. "బావా! ఇంద్రియము లను నిగ్రహించుము; అపుడు నీవు కోరలు పెరికిన పాముయెడలవలె భయము లేక ఉందువు. విషయ చింతన ప్రారంభ మయినదన్న తన వికృత స్వరూపాన్ని చూడవలసివచ్చును; అనుభవించవలసివచ్చును. గణితానికి అంతులేదు; కామానికి పూర్తిలేదు అన్నట్లు బాహ్యంద్రియ నిగ్రహముతో పాటు మనోనిగ్రహము కూడా వుండిన నే స్థితప్రజ్ఞుడు, అట్లు లేకున్న దానికి విరుద్ధమైన గత ప్రజ్ఞుడు కాగలడు. గత ప్రజ్ఞ స్థానము అధోగతి, స్థిత ప్రజ్ఞస్థానము ఊర్థ్వగతి, మనస్సును నిగ్రహించిన చాలును. బాహ్యేంద్రియములను నిగ్రహించకపోయిననూ అంతప్రమాదము సంభవించదు. మనసున విషయాసక్తి నశించిన, రాగద్వేషములు నిరాశ్రయమై దిక్కుతోచక తమకుతామే లొంగిపోవును. రాగద్వేషములు నశించిన తర్వాత ఇంద్రియములు విషయాలతో ప్రవర్తించినమా బంధానికి అవకాశముండదు. ఆత్మప్రసాదలబ్ధునకు సంసారిక దుఃఖము లెక్కడివి! సూర్యుడుదయించినంతనే నక్షత్రము లగుపించనటుల, జ్ఞాన ప్రసాదలాభములోదుఃఖ అశాంతులు, అజ్ఞాన స్వరూపాలు పలాయనమగును. మానవునకు మూడు ముఖ్యమైన ఉపకరణాలు కలవు: మనస్సు బుద్ధి, యింద్రియములు! ఇవి ఒకదానిలో ఒకటి సమ్మేళన కలిగినప్పుడే వరించినపుడే, వాటి తత్వములయిన సంసారప్రాప్తి, ఆత్మప్రాప్తి చేకూరుచున్నవి...
(గీ.పు.39/40)
ఇంద్రియములను సర్వతోముఖంగా నిగ్రహించుట స్థితప్రజ్ఞ లక్షణము. అన్ని భూతములకూ ఏది రాత్రియో స్థితప్రజ్ఞుడు అందులో మేల్కొనియుండును. అన్ని భూతములు మేల్కొనియున్న కాలములో స్థితప్రజ్ఞుడు నిద్రించు చుండును. (అనగా పగలు రాత్రిగను రాత్రి పగలుగనూ) దీనికి సామాన్యముగా లోకమున అక్షరార్థమును తీసుకొనుచున్నారు. అది స్థిత ప్రజ్ఞుని లక్షణమునకు సరితూగదు. అంటే, సామాన్య మానవులు రాత్రి నిద్రించు సమయమున స్థితప్రజ్ఞుడు మేలుకొనుననియు, సామాన్య మానవులు మేలుకొనిన పగలు, స్థితప్రజ్ఞునికి రాత్రి అనియు తలంతురు. దీనికి గూఢార్థము అతి సున్నితము. లౌకిక విషయములందు సామాన్య మానవులు జాగ్రత వహించుచుందురు. అనగా విషయేంద్రియములందు విజృంభించి యుండుటే మేలుకొనుట. కానీ, స్థితప్రజ్ఞుడు ఇట్టి విషయేంద్రియములందు విముఖుడై యుండును: అనగా నిద్రించును, విషయేంద్రియములను అరికట్టుటే నిద్రించుట, విషయముల రేకెత్తించుటే మేలుకొనుట, సామాన్య మానవులు ఇంద్రియములను విజృంభింపను చేయునపుడు స్థితప్రజ్ఞుని ఇంద్రియములు నిద్రించును. దీనినే, మరొకరీతిగా కూడనూ చెప్పవచ్చును. ఆత్మస్థితిని మరచుట, దేహస్థితిని పొందుట. ఇవి సామాన్య మానవుల స్థితులు, సామాన్య మానవులు ఆత్మస్థితియందు మరచి నింద్రిచుచూ దేహ స్థితిలో మేల్కొనుచుందురు. స్థితప్రజ్ఞుడు అట్లుకాక ఆత్మస్థితిలో మేల్కొని దేహస్థితిలో నిద్రించుము; ఇదే స్థితప్రజ్ఞ స్థితి. సామాన్య మానవులు అజాగ్రత్తలో వున్న ఆత్మస్థితిలో స్థిత ప్రజ్ఞుడు జాగ్రత్తతోను, సామాన్యులు జాగ్రతలో వున్న విషయవాసనలలోస్థిత ప్రజ్ఞుడు అజాగ్రతతో మెలగును. ఇదియే సూక్ష్మార్టము. కానీ, అందరూ మేలు కొన్న సమయమున స్థితప్రజ్ఞుడు నిద్రించుననియు అందరూ నిద్రించు సమయమున స్థిత ప్రజ్ఞుడు మేలుకొనునవియు అక్షరార్థమునే తెలిపిన దొంగలుఘూర్కాలు, పహరావారు, ఇట్టి వారందరూ రాత్రులందు మేల్కొని పగలు నిద్రింతురు కదా! వీరందరూ స్థితప్రజ్ఞులు కావలసిన దేవా!
సర్వకామములనూ వదలి యెవ్వడు నిస్పృహుడై అహంకారమమకార రహితుడై సంచరించునో వాడే శాంతిని పొందును. స్థిత ప్రజ్ఞ లక్షణమును కామనాత్యాగ ప్రసంగంలో కృష్ణుడు ముగిస్తాడు. ఈ పాంఖ్యయోగము అద్వితీయమయినది. గీతాసారమంతా ఇందులో యిమిడ్చబడినది.
జీవిత కురుక్షేత్ర సంగ్రామ రంగమున అతిదీనుడై విభ్రాంతుడై దిక్కూ తెన్నూ తోచక నిర్వేదించే మానవునకు - మాధవుడు సాంఖ్యయోగోపదేశము ప్రసాదించెను. తక్కిన ఆధ్యాయములు వ్యాఖ్యానములుగా ఈ రెండవ ఆధ్యాయమైన సాంఖ్యయోగమునందే అమరి ఉన్నవి. ఇందులో సందియము లేదు. అర్జునా! మనసును వదలి నీలో నీవు తన్మయుడవై యుండుటకు సిద్ధము కమ్ము, తాబేలు వలె యెవడు శబ్దాది విషయముల నుండి తన యింద్రియములను అన్ని విధముల నిగ్రహింపగల్గునో వాడే స్థితప్రజ్ఞుడు" అని కృష్ణపరమాత్మ ఈ రెండవ ఆధ్యాయమున పదకొండవ శ్లోకము నుండి ముప్పదవ శ్లోకమువరకూ ఆత్మతత్త్వమును విపులముగా పండువలచి అందించునటుల అర్జునునకు అందించెను.
(గీ.పు.39/42)
రెండవ అధ్యాయము యేబది ఆరవశ్లోకము మొదలు డెబ్బది రెండవ శ్లోకము వరకు స్థిత ప్రజ్ఞాని లక్షణములు, దాని మహిమను విశదీకరించెను.
(గీ.పు.43)
ఇంద్రియ నిగ్రహము గల వానికి శీతోష్ణ సుఖ, దుఃఖ, మానవమానములన్నియూ సమముగానే యుండును.బాహ్యేంద్రియ నిగ్రహముతో బాటు, మనోనిగ్రహము ఉండి స్థితప్రజ్ఞుడు మనస్సును నిగ్రహించిన చాలును. మనస్సున విషయాసక్తి నశించిన రాగద్వేషములు నిరాశ్రయమై, దిక్కులు తోచక, తమకు తామే లొంగిపోవును. ఇది కేవలము శీతోష్ణముల వలె నుండును. శీతలము వేడికాలమున సుఖమును, హాయిని ఇచ్చును. అటులనే ఉష్ణము కూడాను. శీతాకాలమున సుఖమును, హాయిని అందించును. అటులనే విషయస్పర్శలు కూడానూ, ప్రపంచమున్నంతవరకూ బయట విషయములు తప్పవు. అయితే వాటిని భరించుకొను విద్యను ఉపాయమును నేర్చుకొనవలెను.
(శ్రీ భ.ఉ.పు.20)