అనేక మంది దేవుడెక్కడున్నాడు? అని ప్రశ్నిస్తారు. ఆలాంటివారికి ఏమని జవాబు చెప్పాలి?
“ఇందు గలడందు లేడని
సందేహము వలదు చక్రి సర్వోపగతుం
డెందెందు వెదకి చూసన
అందందే గలడు....."
అని ధైర్యంగా చెప్పాలి. భగవంతుడు లేడన్న వారికి లేదు, ఉన్నాడన్న వారికి ఉన్నాడు.
నో అనువారికి నో అనురా
ఎస్ అనువారికి ఎస్ ఆనురా
నో , ఎస్ లు మీ నోటికెగాని
సాయికి సర్వం ఎస్, ఎస్. ఎస్"
దేవుడు లేడని వాదించేవారికి మీరు చెప్పవలసిన సమాధానమేమిటి? "అయ్యా! నీ దేవుడు నీకు లేకపోవచ్చు. కాని, నా దేవుడు నాకున్నాడు. నా దేవుడు లేడని చెప్పడానికి నీకు అధికారం లేదు" అని వారికి బుద్ధి చెప్పాలి. ఎలాంటి పరిస్థితిలోనైనా మీరు అవిశ్వాసానికి చోటివ్వరాదు. ధైర్యసాహసాలతో సమాజధర్మాన్ని ప్రాచీన సంస్కృతిని నిలబెట్టడానికి కంకణం కట్టుకోవాలి. భగవంతుడు మూడు ప్రతిజ్ఞలు చేశాడు - "సంభవామి యుగే యుగే" (ధర్మ సంస్థాపనార్థం నేను ప్రతి యుగమునందును అవతరిస్తాను). "యోగ క్షేమం వహామ్యమ్" (అనన్య భక్తితో నన్ను ఉపాసించినవారి యోగక్షేమాలను చూసుకుంటాను), "మోక్షయిష్యామి మా శుచః" (నన్ను శరణుజొచ్చినవారికి మోక్షం ప్రసాదిస్తాను). భగవంతుని బిడ్డలైన మీరు కూడా మూడు ప్రతిజ్ఞలు చేయాలి - దైవం ఉన్నాడనే ఆచంచల విశ్వాసాన్ని కలియుంటామనేది మొదటిది, దైవాన్ని చూడగల్గుతామనేది రెండవది, దైవంతో ఏకం అవుతామనేది మూడవది..
(ప.పా. ఫి. 2000 పు. 41/42)