నేను ఏ అష్ట్వారీ, పంచాక్షరీ మంత్రాలనో మీకు ఉపదేశించ దలచుకోలేదు. ఏ భగవద్గీతనో, ఏ బ్రహ్మసూత్రాలనో చదవమని నేను బోధించడం లేదు. దేవుడున్నాడు... ఈ ఐదక్షరాల వాక్యాన్ని మీరు ప్రధానంగా తీసుకోండి. దినమంతా దీనినే చింతిస్తూ భావిస్తూ ఆచరిస్తూ ఆనందిస్తూ అందరికీ అందిస్తూ రండి. ఎక్కడి కెళ్ళినా ఎల్లాంటి పరిస్థితులందైనా దేవుడున్నాడు. ఉన్నాడు, ఉన్నాడని బల్ల గ్రుద్ధిచాటండి. ఈ విశ్వాసాన్ని బలపర్చుకుంటే లోకమంతా నిత్య కళ్యాణం పచ్చ తోరణంగా కళకళలాడుతూ కిలకిలనవ్వుతుంది. దేవుడున్నాడన్న విశ్వాసమే మీకు బ్రహ్మాస్త్రంగా పని చేస్తుంది. ఎలాంటి సమస్యలు వచ్చినా ఎదుర్కునే ధైర్యసాహసాలు కలుగుతాయి.రామమంత్రము, కృష్ణమంత్రము, శివమంత్రముకంటే దేవుడున్నాడు" అన్నదే చాల బలమైన మంత్రం. ఈ విశ్వాసం లేకుండా ఎన్ని మంత్రాలు చెప్పినా ప్రయోజనం లేదు.
(స.సా...డి. 96 వెనకకవరు)
ఉన్నాడయా దేముడున్నాడయా కన్నుల కనిపించకున్నాడయా!
లోకాల చీకట్లు పోకార్చురవిచంద్రుదీపాలుగగనానత్రిప్పుచున్నాడయా!
లక్షలాదిగనున్న నక్షత్రములనెల్ల నేల రాల్చకమింటనున్నాడయా!
ఈధారుణీచక్రం యిరుసు లేకుండగను ఎల్లవేళల త్రిప్పుచున్నాడయా!
జీతభత్యములు లేక ప్రీతితో మనవైపుగాలిలో సురటేలు విసిరేనయా!
అధారమేలేక అలరుచున్నట్టి ఆకాశమును ఆపుచున్నాడయా!
పొంగి పొరలుచు పృథ్వి పై పడకుండ కడలిరాజు కాళ్ళుముడి చాడయ్యా!
తెరచాటు నుండి తెరముందు జనముంచి తైతక్కలాడించుచున్నాడయ్యా!
విశ్వమును వింత సృష్టించే విశ్వకర్త తానై పోషించి నడిపించే ధర్మమూర్తి!
దివ్య చైతన్యవంతమై దీప్తి కలుగ విశ్వశాంతి యొనగూర్చి విశ్వవిభుడు||
(సా .పు 29)
(చూ|| ఉన్నాడయ్యా)