ఒక నాడు అక్బర్ కు తన ఆస్థాన గాయకుడైన తాన్ సేన్ గురువు ఎలా పాడతాడో వినాలనిపించింది. కాని, ఆయన తన గ్రామాన్ని వదలి బయటికి రాడని తాన్ సేన్ వివరించగా ఇరువురూ మారువేషంలో ఆ మహాపురుషుని ఇంటికి వెళ్ళారు. ఆయన తన పూజామందిరంలో చేసిన గానం విని ఇరువురూ బ్రహ్మనంద భరితులైనారు. ఇంతటి గొప్ప వ్యక్తి దగ్గర శిక్షణ పొందిన నీవు ఒక్కనాడైనా ఆ రకంగా పాడలేదే" అన్నాడు అక్బర్. "మహారాజా! ఆయన దేవుని కొరకై పాడుతున్నాడు. నేను నీకొరకు పాడుతున్నాను. కమకనే, నా గానం అమితానందము నీయదు" అన్నాడు తాన్ సేన్. అనగా పరమాత్మ ప్రీతిగా చేసిన కర్మలే మధురంగా హృదయానందంగా ఉంటాయి. కనుకనే, కర్మలను కృష్ణారణంగా చేయమని గీత బోధిస్తున్నది.
(స.సా.ఆ. 95 చివరి కవరు పేజీ)