మానవులు ఏదో సుఖించాలని, తమ సుఖము కోసం అనేకమైన పెడమార్గములకు పోపుచున్నారు. ఆధునిక యుగమందు ఆంగ్ల విద్యా ప్రభావముచేత విద్యార్థుల తత్త్వములు, విద్యావంతుల ప్రభావములు వికార మార్గమును అనుసరిస్తున్నాయి. మీ అందరికీ తెలుసు, అనేకమంది అధికారులు ఆఫీసులకు పోతారు. తమ తమ పనులు తాము చేస్తూ ఉంటారు. ఏదో పెద్ద శ్రమపడి వచ్చినట్లుగా ఇంటికి వస్తారు. మాకు సుఖము లేదు - మాకు శాంతి లేదు. అని అనుకుంటారు. ఆఫీసు పనులుచేసి, మా వ్యాపారము పనులు చేసి, మా కర్తవ్య కర్మలు ఆచరించి, మాకు ఏమాత్రము సుఖశాంతులు లేకుండా ఉంటున్నాయని వాపోతారు. ఇంటికి వచ్చిన వెంటనే డ్రస్పులు విసర్జించి, ఇంకొక డ్రస్సులు ధరించి Happy నిమిత్తమై క్లబ్బులకు వెళుతారు. దేనికోసం వెళుతున్నారు? అని ప్రశ్నిస్తే - "సంతోషము కోసము పోతున్నాము, Rest కోసము పోతున్నాము" అని జవాబు చెబుతారు. అక్కడ నిజంగా సంతోషం దొరుకుతుందా? శాంతి లభిస్తుందా? అక్కడ సుఖమున్నదా? ఆ క్లబ్బులకుపోవటం, కార్డ్సు ఆడటం, మత్తు పదార్థములు తీసుకోవటం మున్నగునవి చేస్తారు. ఇవి కేవలము ప్రపంచమునే మరచిపోయి కూర్చోవటమని చెప్పవలె. ఇవన్నీ సుఖ-శాంతి నిమిత్తమై ఆచరించే సత్కర్మలుగా భావిస్తారు. ఇది చాలా దుర్మారమైన మార్గం. ఈ సుఖము సుఖమనే ఆపేక్షతో, వారు దుఃఖమును కొనుక్కొంటున్నారు. వారికి వారు చెడిపోవుటయే కాక, వారు సమాజాన్ని కూడా చెడగొట్టుచున్నారు. ఇది మొదట చాలా సుఖముగానే కనిపిస్తుంది, కానీ, ఇది పోను పోను క్రమక్రమేణా ఎక్కడికి దిగజారుతుందంటే –
First the Man drinks the Wine
Second the wine drinks the Wine
Third the Wine drinks the Man
ఈ రీతిగా, మానవుడు పతనము పొందుతాడు. కేవలము తాను - తాను" తీసుకుంటున్నానిన భ్రమిస్తున్నాడు. కాదు కాదు. అదే తనను తీసుకుంటున్నది. ఈ విధమైన శాంతినికోరి, పెడమార్గమును పట్టి జీవితమును భ్రష్టు పట్టించుకొంటున్నారు.
(స.సా.అ..90 పు 272/273)