మానవునికి సర్వసంపదలు ఉంటున్నాయి. కాని, రెండు మాత్రం లేవు. ఆ రెండు ఎవరి దగ్గరున్నాయి? భగవంతుని దగ్గర మాత్రమే ఉన్నాయి. ఆ రెండింటికోసమే భగవంతుణ్ణి మీరు ప్రార్థించాలి. ఏమిటా రెండు? ఒకటి శాంతి, రెండవది ఆనందము. లౌకిక విషయాలలో ఆనంద మున్నట్లుగా, శాంతి ఉన్నట్లుగా అనిపిస్తుందిగాని అది క్షణభంగురమైనది. శాశ్వతమైన శాంతి, శాశ్వతమైన ఆనందము దైవానుగ్రహమే. కనుక, ఆ వరమును ప్రసాదించమని మీరు ప్రార్థన చేయాలి. "భగవంతుడా! నాకు జగత్తులో దొరికేవి ఏమీ అక్కరలేదు. ఈ ప్రపంచంలో లేనివి, నా దగ్గర లేనివి నీ దగ్గర ఉన్నవి. వాటిని నేను అడుగుతున్నాను. నీ శాంతిని నాకందించు, నీ ఆనందమును నాచేత అనుభవింపచేయి. ఈ రెండు తప్ప నాకు ఏమీ అక్కరలేదు." ఇదే మీరు భగవంతుణ్ణి కోరవలసినవి. మీరు కోరే సుఖసంతోషాలన్నీ ఈ - జగత్తులోనే ఉన్నాయి. అవి క్షణభంగురమైనవి. భగవద్గీత "అనిత్య మసుఖం లోకం ఇమం ప్రాప్య భజస్వ మామ్" అనింది. అంతా అనిత్యమే, అసుఖమే. ఆకలైనప్పుడు రెండు చపాతీలు తిని ఆకలి తీర్చుకోవచ్చును. కానీ, ఎంత సేపు? రెండు గంటల తరువాత తిరిగి ఆకలి ప్రారంభమతుంది.అంతా అనిత్యమైనదే కదా. కనుకనే, భగవంతుణ్ణి ప్రేమించాలి. దైవ సన్నిధిని, దైవ పెన్నిధిని కోరడం ప్రేమ నిమిత్తమే. ఒక్క ప్రేమ లభించిందా, సకల జగత్తు మీ హస్తగతమైపోతుంది. కనుక. ప్రేమ నిమిత్తమై మీరు ప్రార్థించాలి. ప్రాపంచిక సంబంధమైన చిన్న చిన్న విషయాలు కూడా ఈ ప్రార్థనలో చేరిపోతుంటాయి.
(సా.శు.పు.37/38)
(చూ॥ కర్మదాటవశమా!, భక్తసూరదాసు, త్యాగం)